
- చైనా, బ్రెజిల్, ఈయూపైనా సేమ్ టారిఫ్లు వేస్తామన్న ప్రెసిడెంట్
- శాంతి చర్చలకు వస్తామని జెలెన్ స్కీ లేఖ రాశారు
- పనామా కాలువ తీసుకుంటాం.. గ్రీన్ లాండ్‌ను చేర్చుకుంటాం
- యూఎస్ కాంగ్రెస్‌లో సుదీర్ఘ స్పీచ్
వాషింగ్టన్: ఇండియా సహా వివిధ దేశాల వస్తువులపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలను విధిస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయా దేశాలు తమ వస్తువులపై ఎంత శాతం టారిఫ్ లను వేస్తాయో తాము కూడా అంతే శాతం(రెసిప్రోకల్ టారిఫ్స్) వేస్తామన్నారు. ఇండియా, ఇతర దేశాలు తమ వస్తువులపై విధిస్తున్న టారిఫ్లు చాలా అన్యాయంగా ఉన్నాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
మంగళవారం (మార్చి4) రాత్రి అమెరికన్ కాంగ్రెస్‌లో ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇండియా, చైనా, బ్రెజిల్, ఈయూ, ఇతర దేశాల గురించి మీరు విన్నారా? మనం వాళ్లపై వేస్తున్న టారిఫ్‌ల కంటే వాళ్లు మనపై ఎంతో ఎక్కువ టారిఫ్లు వేస్తున్నారు. ఇండియా మన ఆటో ఉత్పత్తులపై 100 శాతానికిపైగా టారిఫ్‌లను వసూలు చేస్తోంది. వస్తువుల రకాన్ని బట్టి 30, 40, 60, 70 శాతం వరకూ సుంకాలు విధిస్తోంది.
ఇండియాకు వెళ్లే అమెరికా కార్లపై ఆ దేశం 70% టారిఫ్ వసూలు చేస్తోంది. దీనివల్ల అక్కడ కార్లను అమ్మడం సాధ్యమే కావట్లేదు. ఇండియాతో అమెరికాకు దాదాపు 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. ఇలా దీర్ఘకాలంగా కొనసాగుతున్న అసమానతలపై చర్చించేందుకు ప్రధాని మోదీ కూడా అంగీకరించారు” అని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తొలిసారి కాంగ్రెస్ జాయింట్ సెషన్లో రికార్డ్ స్థాయిలో 1.40 గంటల పాటు ప్రసంగించారు.
ఇప్పుడు మన వంతు వచ్చింది..
కొన్ని దశాబ్దాలుగా అన్ని దేశాలూ మన వస్తువులపై అధిక టారిఫ్లు విధించి లాభపడుతున్నాయని ట్రంప్ అన్నారు. ‘‘ఇప్పుడు మన వంతు వచ్చింది. ఆయా దేశాలపై మనం కూడా అంతే మొత్తంలో టారిఫ్లు వేస్తాం” అని ప్రకటించారు. వాణిజ్య విధానాల్లో అసమానంగా ఉన్న అంశాలను అమెరికా తప్పనిసరిగా వ్యతిరేకిస్తుందన్నారు. పరస్పర సుంకాలపై అమెరికా వైఖరిని తాను ఇదివరకే ప్రధాని మోదీకి కూడా స్పష్టం చేశానని ట్రంప్ చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి అమెరికాపై ఏ దేశం ఎంత టారిఫ్లు విధిస్తే.. ఆ దేశాలపై తామూ అంతే టారిఫ్లు వేస్తామని తేల్చిచెప్పారు.
జెలెన్ స్కీ నుంచి లెటర్ వచ్చింది..
రష్యాతో శాంతి ఒప్పందం దిశగా ఉక్రెయిన్ నుంచి కదలిక వచ్చిందని ట్రంప్ సభలో ప్రకటించారు. మంగళవారం ఉదయమే తనకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ నుంచి లేఖ వచ్చిందని, ఆ లేఖను చదివి వినిపించారు. ‘‘రష్యాతో సీరియస్ గా చర్చలు జరిపాం. శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని వారి నుంచి గట్టి సంకేతాలు వచ్చాయి” అని ట్రంప్ అన్నారు. ‘‘ఉక్రెయిన్ ప్రజల కన్నా ఎవరూ శాంతిని ఎక్కువగా కోరుకోరు. ప్రెసిడెంట్ ట్రంప్ దృఢమైన నాయకత్వంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగే శాంతి స్థాపన కోసం పని చేసేందుకు నేను, నాటీమ్ సిద్ధంగా ఉన్నాం” అని జెలెన్ స్కీ పేర్కొన్నారని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు గత బైడెన్ సర్కారు హయాంలో వందల కోట్ల డాలర్ల మిలిటరీ సాయం చేశామని ట్రంప్ ధ్రువీకరించారు.
పనామా కాలువ మనకే..
పనామా కాలువను తిరిగి తీసుకునేందుకు చర్యలు చేపట్టామని ట్రంప్ ప్రకటించారు. ఈ కార్యం పూర్తిచేసే బాధ్యతను విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేతిలో పెట్టామన్నారు. డెన్మార్క్ అధీనంలో స్వతంత్ర భూభాగంగా ఉన్న గ్రీన్ లాండ్ ను ఎలాగైనా అమెరికాలో కలిపేసుకుంటామని ట్రంప్ చెప్పారు.
‘గోల్డెన్ డోమ్’తో అమెరికాకు రక్షణ
శత్రు దేశాల నుంచి రక్షణకు ఇజ్రాయెల్ రూపొందించుకున్న ఐరన్ డోమ్ షీల్డ్ వ్యవస్థ తరహాలో అమెరికాకు కూడా గోల్డెన్ డోమ్ క్షిపణి నిరోధక వ్యవస్థను తీసుకొస్తామని ట్రంప్ ప్రకటించారు. అత్యాధునిక టెక్నాలజీతో దీనిని శత్రుదుర్భేద్యంగా మారుస్తామని తెలిపారు. అమెరికన్ ఆర్మీని ప్రపంచంలోనే బలమైన సైన్యంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ‘‘అమెరికా ఈజ్ బ్యాక్. అమెరికన్ల కలలు సాకారం అవుతాయి. అమెరికాకు స్వర్ణయుగం జస్ట్ ఇప్పుడే ప్రారంభమైంది” అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు వెనక్కి
ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా ప్రస్తుతం ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఫెడరల్ ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వులను మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఫెడరల్ ఉద్యోగుల ను సామూహికంగా తొలగించడం చట్ట వ్యతిరేకం అంటూ ట్రంప్ ఉత్తర్వులను ఇటీవల కాలిఫోర్నియాలోని ఫెడరల్ జడ్జి రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులపై ఆయా ఏజెన్సీలే సొంతంగా నిర్ణయం తీసుకోవాలని, ఉద్యోగుల తగ్గింపుకు సెప్టెంబర్ 13 వరకూ సొంత ప్రపోజల్స్ రూపొందించుకోవాలని ఆఫీస్ ఆఫ్ పర్సొన్నెల్ మేనేజ్ మెంట్ (ఓపీఎం) ఈ మెమోరాండంలో పేర్కొంది.