తెలంగాణ చౌరస్తాలో చిన్న పార్టీల దారెటు? : ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

తెలంగాణ చౌరస్తాలో చిన్న పార్టీల దారెటు? : ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

ఎన్నికల ఢంకా మోగడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. నవంబర్‌‌ 30న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తలపడేందుకు ప్రధాన పార్టీలకు దీటుగా.. చిన్న పార్టీలు సైతం ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌, బీజేపీలతోపాటు టీడీపీ, బీఎస్పీ, టీజేఎస్‌‌, జనసేన, వైఎస్‌‌ఆర్‌‌టీపీ, వామపక్షాలు కూడా కదనరంగంలోకి దిగుతున్నాయి. వీటిలో కొన్ని ప్రధాన పార్టీలతో పొత్తుల కోసం పాకులాడుతున్నాయి, మరికొన్ని పార్టీలు ఒంటరి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అయితే, ఎన్నికలకు సిద్ధమవుతున్న  చిన్న పార్టీలు తమకు ప్రజాదరణ ఉందో?  లేదో? అనే  సందిగ్ధంలో ఉన్నాయి. తెలంగాణ రాజకీయ చౌరస్తాలో ఎటూ తేల్చుకోలేక సరైన రహదారి కోసం దిక్కులు చూస్తున్నాయి. 

వామపక్షాలు, వైఎస్‌‌ఆర్‌‌టీపీ,  టీజేఎస్‌‌ పార్టీలు కాంగ్రెస్‌‌తో  పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి.  టీడీపీ, జనసేన, బీఎస్పీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నాయి. పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న పార్టీలకు కాంగ్రెస్‌‌ నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి.  

జనాకర్షణలేని జనసేన

తెలుగు రాజకీయాల్లో నూతన పంథాను అనుసరిస్తున్న జనసేన తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతోంది.  తాము ఎన్డీయే కూటమితో ఉన్నట్టు పవన్‌‌ కల్యాణ్‌‌ చెప్పుకుంటున్నా రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఆంధ్ర పార్టీలతో పొత్తులు లేవని పలుమార్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయనని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న జనసేనాని.. తెలంగాణలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమని ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ పరిణామాల మధ్య తెలంగాణలో అభ్యర్థుల పేర్లు లేకుండా 32 స్థానాల జాబితా జనసేన తెలంగాణ విభాగం పేరుతో వెలువడింది. ప్రకటించిన ఈ స్థానాల్లో సెటిలర్ల ఓట్ల ప్రభావం ఎక్కువ. అంతేకాక ఇవి గతంలో తెలుగుదేశానికి గట్టిపట్టున్న స్థానాలు.  తెలంగాణలో జనసేన ఉనికి నామమాత్రమే. ఆ పార్టీకి పోటీ చేసే స్థానాల్లో డిపాజిట్‌‌ రావడం మహాభాగ్యమే. ఏపీలో పది ఏండ్లుగా  అనేక ప్రజా కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్న పవన్‌‌  తెలంగాణలో మాత్రం ఎలాంటి భారీ కార్యక్రమాలను చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్‌‌ కంటే ముందు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం ఎంతోకొంత ఏపీపై పడవచ్చు. బలం లేని తెలంగాణలో పోటీ చేసే వృథా ప్రయాస కంటే బలమున్న ఆంధ్రప్రదేశ్‌‌పైనే పవన్​ ఎక్కువ దృష్టి పెడితే జనసేన పార్టీకి ఎంతో మేలు.

 టీడీపీలో అనిశ్చితి

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో 40 సంవత్సరాలపాటు రాణించిన తెలుగుదేశం రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌‌కే పరిమితమైంది. 2014 తెలంగాణ ఎన్నికల్లో 14 స్థానాలు సాధించిన టీడీపీ అనంతరం బలహీనపడింది. 2018 ఎన్నికల్లో  కాంగ్రెస్‌‌ నేతృత్వంలో  మహాకూటమి ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో రిక్తహస్తమే ఎదురయ్యింది. ఏపీలో అధికారంలో ఉన్న ఆ సమయంలో కూడా టీడీపీ తెలంగాణలో 13 స్థానాల్లో పోటీ చేసి 3.51 శాతం ఓట్లతో  రెండు సీట్లు మాత్రమే గెలిచింది.  

2019లో ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు  ఆ రాష్ట్రంపైనే ప్రత్యేక దృషి పెట్టారు. ప్రస్తుతం చంద్రబాబు  జైలుకెళ్లాక టీడీపీ అనిశ్చితిలో ఉంది. ఆ పార్టీ అధిష్టానం దృష్టి అంతా కేసులు, కోర్టుల చుట్టే తిరుగుతున్న ఈ సమయంలో టీడీపీ తెలంగాణ ఎన్నికలపై ఫోకస్‌‌ పెట్టడం కష్టమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో  తెలంగాణ సెంటిమెంట్‌‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌ఎస్‌‌ గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌,  నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సెటిలర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారని గుర్తించి వారికి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. 

 ఉనికి కోసం వామపక్షాల పోరాటం 

మునుగోడు ఉప ఎన్నికల్లో  బీఆర్‌‌ఎస్‌‌  గెలుపు మాతోనే సాధ్యమైంది. కాబట్టి సీట్లపై బేరసారాలు చేసుకోవచ్చని ఆశపడ్డ వామపక్షాలకు కేసీఆర్‌‌ షాక్​ఇవ్వడంతో కాంగ్రెస్‌‌ కటాక్షం కోసం కమ్యూనిస్టులు ఎదురుచూస్తున్నారు. లెఫ్ట్​పార్టీలకు పట్టున్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌‌లోనే తీవ్ర పోటీ ఉండడంతో వామపక్షాలకు సీట్లు కేటాయించడం కష్టసాధ్యమే. కానీ, సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలకు చెరో స్థానం ఇవ్వచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్‌‌ సానుకూలంగా స్పందించకపోతే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తామంటున్నాయి. పొత్తు లేకుండా బరిలోకి దిగితే గతానుభవాలను పరిశీలిస్తే ఈ పార్టీలకు ఒక్క సీటు వచ్చినా సంచలనమే.
 
తెలంగాణలో  తెల్ల ఏనుగు బీఎస్పీ

గురుకులాల పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఐపీఎస్‌‌ అధికారి ఆర్‌‌ఎస్‌‌. ప్రవీణ్‌‌కుమార్‌‌ ఇప్పుడు రాజకీయ పరీక్షను ఎదుర్కొంటున్నారు. స్వేరో వ్యవస్థాపకులుగా బడుగు, బలహీన విద్యార్థుల్లో ప్రత్యేక స్థానం పొందిన ప్రవీణ్‌‌కుమార్‌‌  బీఎస్పీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. కాగా, గతంలో ఇతర పార్టీల టికెట్లు లభించక బీఎస్పీ తరఫున పోటీ చేసేవారు. ఇప్పుడు ప్రవీణ్‌‌కుమార్‌‌ పార్టీని బలోపేతం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఆ పార్టీకి అభ్యర్థుల తాకిడి ఎక్కువయ్యింది.

బీఎస్పీ 20 మంది తొలి జాబితాను ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ప్రవీణ్‌‌కుమార్‌‌ రిజర్వుడు స్థానం కాకుండా జనరల్‌‌ సెగ్మంట్‌‌ అయిన సిర్పూరు నుంచి బరిలోకి దిగుతుండడంతో అక్కడ గట్టి పోటీ ఉంటుంది.  పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌, నిరుద్యోగ సమస్యలపై గళమెత్తుతున్న ప్రవీణ్‌‌ పట్ల యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. స్వేరో విద్యార్థుల అండ ఆయనకు అదనపు బలం. 

రాజకీయాల్లో ‘సార్‌‌’ విఫలం

తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్‌‌తోపాటు సమానంగా క్రియాశీలక పాత్రను ప్రొఫెసర్‌‌ కోదండరామ్‌‌ పోషించారు. ఉద్యమ నేతగా ఆయన రాణించినా రాజకీయాల్లో విఫలమవుతున్నారు. ఉద్యమ సమయంలో పార్టీలకతీతంగా అందరిచే “సార్’గా పిలుచుకున్న కోదండరామ్‌‌ కేసీఆర్‌‌తో ఏర్పడిన విభేదాలతో తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన టీజేఎస్‌‌ తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో విఫలమయ్యింది.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకొని ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన టీజేఎస్ ఒక్కచోట కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌‌ పోటీచేసినా మూడవ స్థానంలో నిలిచారు. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా ఉన్న కోదండరామ్‌‌ ఈ రాజకీయాల ఊబిలోంచి బయటపడి రాష్ట్రాభివృద్ధికి తగు సూచనలు, ప్రజా ఉద్యమాలు చేస్తే ఆయనకు పూర్వవైభవం లభిస్తుంది. అప్పుడు రాజకీయ పార్టీలే కోదండరామ్‌‌ను మరోసారి ‘సార్‌‌’ అంటూ క్యూ కట్టడం ఖాయం. కాగా,  రాష్ట్రంలో పీపుల్స్‌‌ పల్స్‌‌ చేపట్టిన పలు అధ్యయనాలలో మెజార్టీ స్థానాల్లో బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ పార్టీల మధ్య ద్విముఖ పోటీ, కొన్ని చోట్ల బీజేపీ కూడా పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోటీ నెలకొందని తేలింది.

చిన్న పార్టీలు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో రాణించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఈ పార్టీలు తమ అవకాశాలకు అనుగుణంగా కాకుండా ఒక అవగాహనతో నిర్ణయాలను తీసుకుంటే భవిష్యత్తు ఆశాజనకంగా ఉ౦టుంది. లేకపోతే ఆటలో అరటిపండులా మారడం ఖాయం. ఒకవేళ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రయోగాలతో ముందుకెళ్తే.. చిన్న పార్టీలు దారితప్పాయో? సరైన మార్గంలోనే పయనించాయో? డిసెంబర్‌‌ 3వ తేదీన వెలువడే ఫలితాల్లో స్పష్టంగా తేలుతుంది.

దిశ తప్పుతున్న షర్మిల బాణం 

తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి సంచలనం రేపిన  వైఎస్‌‌.షర్మిల బాణం దిశ తప్పుతోంది. షర్మిల వైఎస్‌‌ఆర్‌‌టీపీని కాంగ్రెస్‌‌లో విలీనం చేస్తుందనే వార్తలొచ్చినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆమెను ఏపీకే పరిమితం చేయాలని, తెలంగాణలో ఆమె పాత్ర వద్దని టీపీసీసీ నేతలు కాంగ్రెస్‌‌ అధిష్టానంపై ఒత్తిడి తెస్తుండడంతో పార్టీ విలీనంపై కాంగ్రెస్‌‌ పెద్దలు వెనకడుగు వేశారు. దీంతో వైఎస్‌‌ఆర్‌‌టీపీ చీఫ్‌‌ షర్మిల తన పార్టీ తొలి జాబితాను సిద్ధం చేస్తున్నారు. బలం ఉన్న ఏపీని వదిలి తెలంగాణ రాజకీయాల్లో రాణించాలనుకోవడం ఆమెకు  కష్టమే.

టీడీపీ,  వైఎస్‌‌ఆర్‌‌టీపీ, జనసేన పార్టీలు గ్రహించాల్సిన మరో విషయం దేశ చరిత్రలో  ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇప్పటివరకు ఏ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా రాణించలేదు అనేది వాస్తవం. యూపీలో ఒకప్పుడు బలంగా ఉన్న సమాజ్‌‌వాది పార్టీకి.. ఉత్తరప్రదేశ్​ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్‌‌లో ఉనికే లేదు. బిహార్‌‌లో కీలకమైన ఆర్జేడీ,  జేడీ(యూ) పార్టీలు ఆ రాష్ట్రం నుంచి విడిపోయిన జార్ఖండ్‌‌లో ప్రాతినిధ్యం నామమాత్రమే. పంజాబ్‌‌లోని అకాలీదళ్‌‌ ఆ రాష్ట్రం నుంచి విడిపోయిన హర్యానాలో రాణించలేదు. ఇదే రాజకీయ సూత్రం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, రీసెర్చర్‌‌,  పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ