4జీ, 5జీ.. తేడా ఏంటీ? 

4జీ, 5జీ.. తేడా ఏంటీ? 

న్యూఢిల్లీ: 5జీ అంటే.. ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీ. టెలికం రంగంలో ప్రతి పదేండ్లకు ఓసారి కమ్యూనికేషన్ టెక్నాలజీ మారుతోంది. ఇలా 1990లలో 1జీతో మొదలై.. ఆపై 2జీ,3జీ,4జీ టెక్నాలజీలు వచ్చాయి. తాజాగా ప్రపంచమంతా 5జీ టెక్నాలజీ విస్తరిస్తోంది. ప్రస్తుత 4జీ కంటే 5జీ నెట్ వర్క్​లతో ఇంటర్నెట్ సేవలు మరింత వేగంగా అందనుండటంతో మొబైల్ ఫోన్​లు, కంప్యూటర్​లు, ఇతర డివైస్​ల వాడకంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.   

4జీ, 5జీ.. తేడా ఏంటీ? 

4జీతో పోలిస్తే 5జీతో ఇంటర్నెట్ స్పీడ్ కనీసం10 రెట్లు పెరగనుంది. 4జీలో గరిష్టంగా డౌన్ లోడ్ స్పీడ్ సెకనుకు ఒక గిగాబిట్స్ (1జీబీపీఎస్) ఉంటే.. 5జీలో10జీబీపీఎస్​కు పెరుగుతుంది. దీంతో ఎక్కువ క్వాలిటీ, డ్యురేషన్ ఉన్న వీడియోలనూ సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 4జీలో ఇంటర్నెట్ ల్యాటెన్సీ (జాప్యం) 50 మిల్లీ సెకన్లు ఉండగా.. 5జీలో అది1 మిల్లీ సెకన్ కు తగ్గిపోతుంది. దీనివల్ల ఎలాంటి బ్రేక్ లేకుండా గేమ్​లు ఆడుకోవచ్చు. 5జీతో అగ్రికల్చర్, హెల్త్, బ్యాంకింగ్, ఆన్ లైన్ ఎడ్యుకేషన్ లోనూ విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇక 4జీలో సమాచార సంకేతాలు సెల్ టవర్ల నుంచి ప్రసారం అవుతాయి. 5జీలో స్మాల్ సెల్ టెక్నాలజీ వాడతారు. పిజ్జా బాక్స్ సైజులో ఉండే చిన్న సెల్స్ తోనే హై బ్యాండ్ సేవలు అందుతాయి. ఈ బాక్సులను అమర్చలేని చోట, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రాంతాల్లో సెల్ టవర్లనే వినియోగిస్తారు.  

4జీ ఫోన్లలో పని చేస్తదా? 

ప్రస్తుతం ఉన్న 4జీ ఫోన్లు కూడా 5జీ నెట్ వర్క్ ను అందుకోగలవు. అయితే, ఆయా కంపెనీల ఫోన్లలోని హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ కారణంగా కొన్ని ఫోన్లు 5జీ సేవలను పూర్తిస్థాయిలో అందించలేకపోవచ్చని చెప్తున్నారు. ఆయా ఫోన్లు 5జీ సిగ్నళ్లను అందుకుంటాయా? అన్నది సర్వీస్ ప్రొవైడర్​ను సంప్రదించి తెలుసుకోవచ్చు. 

డేటా రేటు పెరుగుతుందా?

ప్రస్తుతానికి 4జీ డేటాకు ఉన్న ధరలే 5జీ డేటాకు కూడా వర్తించనున్నాయి. కానీ 5జీ స్పీడ్ ఎక్కువ కాబట్టి డేటా కూడా స్పీడ్ గా అయిపోతుంది. దీనివల్ల టెలికం కంపెనీలకు ప్రతి వినియోగదారుడిపై సగటు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. అంటే.. డేటా చార్జీలు పెంచకున్నా కంపెనీలకు మాత్రం ఆదాయం భారీగా పెరుగుతుందని చెప్తున్నారు.