T20 World Cup 2024: గాడిలో పడకపోతే కష్టమే.. కోహ్లీ ఫామ్‌పై ఆందోళన

T20 World Cup 2024: గాడిలో పడకపోతే కష్టమే.. కోహ్లీ ఫామ్‌పై ఆందోళన

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉంటే ఆపడం ఎవరి వల్ల కాదు. ఫార్మాట్ ఏదైనా కింగ్ క్రీజ్ లోకి అడుగుపెడితే ప్రత్యర్థికి చుక్కలు కనబడాల్సిందే. అలవోకగా పరుగులు చేయడమే కాదు.. అంతే సునాయాసంగా సెంచరీలు బాదేస్తాడు. ఇక ఐసీసీ టోర్నీల్లో కోహ్లీ పూనకం వచ్చినట్టు చెలరేగిపోతాడు. సహచరులు విఫలమైనా.. ఒక్కడే వారియర్ లా జట్టును ముందుకు తీసుకెళ్తాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ ఫామ్ గాడి తప్పినట్టుగానే కనిపిస్తుంది. పట్టుమని 10 బంతులైనా ఆడకుండా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతున్నాడు. 

వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగుతున్న వరల్డ్ కప్ లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఐసీసీ టోర్నీల్లో కోహ్లీ ఇలా విఫలం కావడం ఇదే తొలిసారి. ఐర్లాండ్, అమెరికా లాంటి పసికూనలపై ఆడలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఐర్లాండ్ పై ఒక్క పరుగు చేసిన విరాట్.. అమెరికాపై గోల్డెన్ డకౌటయ్యాడు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 4 పరుగులు చేసి ఔటయ్యాడు. పిచ్ లు కష్టంగా ఉన్నా అది కోహ్లీ లాంటి పరుగుల వీరుడికి ఇదొక సమస్య కాదు. 

సూపర్ 8 లో కోహ్లీ ఆడటం కీలకం 

గ్రూప్ మ్యాచ్ ల్లో ఎలా ఆడినా కోహ్లీని పెద్దగా ఎవరు ప్రశ్నించలేదు. అతన్ని విమర్శించే ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. ఎందుకంటే కోహ్లీ చెలరేగితే ఫలితం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సూపర్ 8 లో భారత్ కు అసలు సవాలు ఎదురు కానుంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. భారత్ సెమీ ఫైనల్ కు వెళ్లాలంటే కోహ్లీ ఫామ్ చాలా కీలకం. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ.. సూపర్ 8 లో ఫామ్ లోకి రావాలని దేశమంతా కోరుకుంటుంది. 2014, 2016, 2022 టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ టోర్నమెంట్ టాప్ స్కోరర్ కావడం విశేషం. 2024 ఐపీఎల్ సీజన్ లోనూ టాప్ స్కోరర్. ఇదే ఫామ్ ను రానున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ల్లోనూ ప్రదర్శిస్తే భారత్ కు తిరుగుండదు.