సైబర్ నేరగాళ్లు విభిన్న పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోం పేరిట వల వేసి జనాలను బురిడికొట్టిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఉద్యోగాల ఎరవేస్తూ..అందినకాడికి దోచేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల బెదిరింపుల గురించి అవగాహన పెంచడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ వీడియో విడుదల చేసింది. స్కామర్‌లు ఉపయోగించే వ్యూహాలను వివరిస్తూ వారి ఉచ్చులో పడకుండా ఎలా ఉండాలనే దానిపై చిట్కాలను ఈ వీడియోలో వివరించింది.
ఎలా ప్రలోభపెడతారంటే..
సైబర్ నేరగాళ్లు వాట్సాప్,టెలిగ్రామ్ ద్వారా కాల్స్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోం, పార్ట్ టైం ఉద్యోగాలను ఆఫర్ చేస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించొచ్చని ప్రలోభపెడతారు. ఈ ఆఫర్లను ఆమోదించిన తర్వాత టాస్క్ మేనేజర్ అనే పోస్ట్ ను క్రియేట్ చేస్తారు. వారందరిని టెలిగ్రామ్ ఛానెల్ లో చేరాల్సిందిగా ఆదేశిస్తారు. చేరిన వారికి నిర్దిష్ట అసైన్ మెంట్ లను కేటాయిస్తారు.
ఏం జాబ్ తెలుసా..
సైబర్ నేరగాళ్లు తమ ఉద్యోగులకు..యూట్యూబ్ వీడియోలను సబ్ స్క్రైబ్ చేసి.. వీడియోలను లైక్, షేర్ చేయాలని చెబుతారు. వీడియోలను లైక్ , షేర్ చేసిన తర్వాత వాటిని స్క్రీన్ షాట్ తీసి టాస్క్ మేనేజర్ కు పంపాలని సూచిస్తారు. ఉద్యోగంలో చేరిన వ్యక్తుల రోజువారి సంపాదనను వారికి ఎప్పటికప్పుడు చూపిస్తుంటారు. అయితే నెల తర్వాత ఉద్యోగులు తాము సంపాదించింది తీసుకోవాలంటే స్కామర్లు రూ. 5 వేలను పెట్టుబడి పెట్టాలని అప్పుడే సాలరీని వేస్తామని డిమాండ్ చేస్తారు. దీంతో జీతం కోసం రూ. 5వేలను స్కామర్ల అకౌంట్లో వేసిన తర్వాత ..ఒక్కసారిగా అతన్ని వాట్సాప్, టెలిగ్రామ్లో బ్లాక్ చేస్తారు. ఆ తర్వాత బాధితులు బాధపడటం తప్ప చేసేదేమి ఉండదు. కొన్ని సందర్బాల్లో స్కామర్లు..ఉద్యోగుల బ్యాంకు అకౌంట్లను తీసుకుంటారు. వారి అకౌంట్ల నుంచి కూడా డబ్బును దోచేస్తారు.
అప్రమత్తంగా ఉండకపోతే..
సైబర్ నేరగాళ్ల ఆఫర్లు అంగీకరించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని..కంపెనీ సరైనదా..యజమాని ఎవరు అని పరిశోధించాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. చట్టబద్ధమైన కంపెనీ తమ ఉద్యోగులను డబ్బు డిమాండ్ చేయదని...నగదు చెల్లింపు కోసం QR కోడ్‌లను అభ్యర్థించరని గుర్తుంచుకోవాలంటున్నారు. ఆన్‌లైన్ స్కామ్‌కు గురైన వ్యక్తులు 1930కి డయల్ చేయాలని..లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ( https://cybercrime.gov.in/ ) ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.