ఫేక్ న్యూస్కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎలా వాడాలి?

ఫేక్ న్యూస్కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎలా వాడాలి?

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) యుగంలో సోషల్ మీడియాలో వస్తున్న సమాచారంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టమై పోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేందుకు ప్రత్యేకమైన టీమ్ లు, కొన్ని సంస్థలు నిత్యం పనిచేస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.

మనం సాధారణంగా కొన్నిసార్లు మనకు ఇష్టం లేకున్నా వాట్సాప్ గ్రూప్ లలో చేరుతుంటాం. గ్రూపులలో ఎప్పుడూ ఏవో మెసేజ్ లతో విసిగిపోతూనే ఉంటాం. అయితే ఈ గ్రూపులలో ఎక్కణ్నుంచి, ఎవరు పంపారో కూడా తెలియని మెసేజ్ లు, ఫోటోలు, న్యూస్ మళ్లీ మళ్లీ షేర్ అవుతుంటుంది. కొందరు తమకు అనుకూలమైన అంశాన్ని ప్రచారం చేసేందుకు.. మరి కొందరు ఇతర వ్యక్తులు, వర్గాలు, సంఘాలపై వ్యతిరేక ప్రచారం చేసేందుక.. ఇలా ఎన్నో రకాల పద్ధతులలో న్యూస్ స్ప్రెడ్ అవుతుంటుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. 

ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ వెబ్ కొత్త వెపన్ ను కస్టమర్స్ ముందుకు తీసుకొచ్చింది. రివర్స్ ఇమేజ్ సర్చ్ అనే ఆప్షన్ ద్వారా దీనికి అడ్డుకట్ట వేయొచ్చునని వాట్సాప్ సంస్థ చెబుతోంది. మీకు ఏదైనా ఇమేజ్ వచ్చినపుడు అది నిజమా లేదా ఫేకా అని తెలుసుకునేందుకు డైరెక్ట్ గా గూగుల్ ఇమేజ్ సర్చ్ లో అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది. దీని వలన వెంటనే ఆ ఇమేజ్ బ్యాగ్రౌండ్ ఏంటి.. అది ఒరిజినలా, ఫేక్ ఇమేజా అనేది వెంటనే తెలిసిపోతుంది. 

ఎలా వినియోగించాలి:

రియల్ ఇమేజా ఫేక్ ఇమేజా అని తెలుసుకునేందుకు వాట్సాప్ చాలా సింపుల్ సొల్యుషన్ ఏర్పాటు చేసింది. వాట్సాప్ లో వచ్చిన ఇమేజ్ పై ట్యాప్ చేసి.. పైన త్రీ డాట్ (3 డాట్స్) మెనుపై క్లిక్ చేస్తే ‘సర్చ్ ఆన్ ద వెబ్’ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ కి అవకాశం ఇస్తుంది. గూగుల్ డాటా బేస్ ఉపయోగించి ఆ ఇమేజ్ ఏంటో చెప్పే్స్తుంది. 

వాట్సాప్ తెచ్చిన ఈ ఆప్షన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సమాచారం ఏది నిజమో నమ్మలేని పరిస్థితి. అంతేకాకుండా రకరకాల ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు ఈ ఆప్షన్ సెక్యూరిటీలా కూడా పని చేస్తుందని మెటా సంస్థ చెబుతోంది.