కోలుకున్నవారి నెంబర్లు సేకరించి గ్రూప్ క్రియేట్
వారందరితో ప్లాస్మాదానం చేయిస్తున్న వరంగల్ యువకుడు
కరోనాకు మందు లేకపోవడంతో ప్లాస్మా థెరపీ ఒక్కటే మార్గమైంది. కరోనా నుంచి కోలుకున్న వారినుంచి ప్లాస్మా సేకరించి.. కరోనా పేషంట్ కి ఎక్కిస్తే.. వీలైనంత త్వరగా రోగి కోలుకుంటాడు. అందుకే డాక్టర్లు.. కరోనా నుంచి కోలుకున్నవారిని ప్లాస్మా దానం చేయాలని కోరుతున్నారు. తనలా కరోనా బారినపడిన వారు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ఓ యువకుడు వినూత్న సాయానికి తెరలేపాడు. వరంగల్ కు చెందిన అఖిల్ అనే యువకుడు బ్రిటన్ లోని డీన్ బర్గ్ యూనివర్సిటీలో లా చదువుతున్నాడు. కరోనాతో యూనివర్సిటీలన్నీ మూతపడటంతో అఖిల్ కూడా ఇంటిబాట పట్టాడు. అలా వస్తున్న తరుణంలో అఖిల్ కు కూడా కరోనా సోకింది. బ్రిటన్ నుంచి హైదరాబద్ లో దిగగానే కరోనా టెస్ట్ చేయించుకోగా.. అఖిల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడు. గాంధీ ఆసుపత్రి సూపరింటిండెండెంట్ డాక్టర్ రాజారావు సూచన మేరకు కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడంతో అఖిల్ తో పాటు మరో వ్యక్తి తొందరగా కోలుకున్నాడు. దాంతో తాను కూడా ప్లాస్మా దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఒక్కడే కాకుండా.. కరోనా నుంచి కోలుకున్నవారితో కూడా ప్లాస్మా దానం చేయించాలని అనుకున్నాడు. ఆ ఆలోచనతో కరోనా నుంచి కోలుకున్నవారందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ప్రభుత్వం నుంచి కరోనా నుంచి కోలుకున్న వారి వివరాలు తీసుకొని వారిని కూడా ఆ గ్రూప్ లో జాయిన్ చేస్తున్నాడు. వారందరితో మాట్లాడి.. ప్లాస్మా దానంపై అవగాహన కల్పించి వీలైనంత ఎక్కువమందితో ప్లాస్మా దానం చేయిస్తున్నాడు.
ఈ గ్రూప్ గురించి కరోనా బాధితుడు అఖిల్ మాట్లాడుతూ.. ‘చాలామంది కరోనా రాగానే భయపడిపోతున్నారు. అటువంటి వారిలో ముందుగా ధైర్యాన్ని కల్పించడమే మా గ్రూప్ ప్రథమ కర్తవ్యం. బాధితుల భయాన్ని ఆసరగా చేసుకొని చాలామంది సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కొంతమంది మోసగాళ్లు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ప్లాస్మా దాతలు, గ్రహీతల గ్రూప్స్ ఏర్పాటు చేసి ఫోన్ నంబర్స్ సేకరిస్తున్నారు. తమ ఖర్చులకు డబ్బులు ఇస్తే.. ప్లాస్మా థెరపీ చేయిస్తామని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని ఆయన అన్నారు.
అఖిల్ కరోనా భాదితుల కోసం చేస్తున్న సేవను ఎంజీఎం మాజీ నోడల్ అధికారి, ప్రొఫెసర్ చంద్ర శేఖర్ మెచ్చుకున్నారు. ‘కరోనా సోకిందని తెలిస్తే… తోడబుట్టిన వారే పట్టించుకోకుండా వదిలేస్తున్న ఈ రోజుల్లో.. కరోనా బారినపడిన వారికి మేమున్నామంటూ అఖిల్ ఏర్పాటు చేసిన గ్రూప్ మనోధైర్యాన్ని కల్పిస్తుంది. భాదితులను ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో పాటు.. వారికి ప్లాస్మా ధానం చేస్తన్నారు. కరోనా భాదితులను కాపాడేందుకు అఖిల్ చేస్తున్న కృషి అభినందనీయం’ అని అన్నారు.
For More News..