ఇవి చేయొద్దు.. మీ వాట్సప్ బ్యాన్ అవుతుంది

ఇవి చేయొద్దు.. మీ వాట్సప్ బ్యాన్ అవుతుంది

నెలనెలా 20లక్షల అకౌంట్లను మూసేస్తున్న వాట్సప్

వాట్సాప్ లో అదే పనిగా ఏది పడితే అది పంపుతున్నారా? పెడితే పోలా అని ఎన్ని పడితే అన్ని మెసేజ్ లు ఫార్వర్డ్​ చేస్తున్నారా? అయితే, జర జాగ్రత్త. మీ అకౌంట్ కు తాళం పడొచ్చు. వాట్సాప్ వాడకుండా నిషేధం ఎదురుకావొచ్చు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ తప్పుడు సమాచారానికి కళ్లెం వేసేందుకు నెల నెలా దాదాపు 20 లక్షల అకౌంట్లను వాట్సాప్ మూసేస్తోందట.

గురువారం వాట్సాప్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. “మేం అందిస్తున్న ఉచిత సేవల్ని చాలా మంది తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి మా ప్లాట్ ఫాం భద్రంగా ఉండేలా ముందే ముకుతాడు వేస్తున్నాం”  అని తెలిపింది. రిజిస్ట్రేషన్ టైంలోనే అలాంటి అకౌంట్లను గుర్తించి మూసివేస్తున్నామని పేర్కొంది. దాదాపు 20 శాతం అకౌంట్లను అలాగే క్లోజ్ చేశామని వెల్లడించింది. అలాంటి నంబర్లను ముందే పసిగట్టేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపింది. ‘ఒకే ఫోన్ నంబర్ తో రెచ్చగొట్టే మెసేజ్ లు ఏమైనా వెళ్లాయా అన్నది మా వ్యవస్థ గుర్తిస్తుంది. అంతే గాకుండా అనుమానిత కార్యకలాపాలు సాగించిన కంప్యూ టర్ నెట్ వర్క్​ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూసినా మా వ్యవస్థ అడ్డుకుంటుంది’ అని తెలిపింది.

ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా బ్యాన్ అవుతుంది

రిజిస్టర్ అయిన ఐదు నిమిషాల్లో ఆ నంబర్ నుంచి జరిగే యాక్టివిటీస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది వాట్సప్.

రిజిస్ట్రేషన్ చేసిన ఐదు నిమిషాల్లో బల్క్ మెసేజ్ లు పంపితే బ్లాక్

డజన్ల కొద్దీ గ్రూప్ లను వేగంగా క్రియేట్ చేస్తే మీ అకౌంట్ సీజ్ అవుతుంది

ఇప్పటికే ఉన్న గ్రూప్స్ లో డజన్లకొద్దీ కొత్త నంబర్లను టకటకా యాడ్ చేస్తే ఆ నంబర్ బ్యాన్ అవుతుంది. ఆ గ్రూప్ కూడా డిలీట్ కావచ్చు

వాట్సప్ లో సాధారణంగా ఎవరు టైప్ చేసినా వారి పేరుతో టైపింగ్ అని వస్తుంది. అలా కాకుండా.. ‘ … టైపింగ్’ అని లేకుండా మీకు మెసేజెస్ వస్తుంటే.. ఆ నంబర్ ను మీకు మీరే బ్లాక్ చేయొచ్చు. అవి స్పామ్ నంబర్లు అయి ఉండొచ్చు. వాట్సప్ కూడా వీటిని డిటెక్ట్ చేస్తుంది.

అనుమానాస్పద లింక్ లు, అప్పటికే ఆదేశాలు జారీచేయబడిన నిషేధిత వీడియోలను ఫార్వార్డ్ చేసినా.. వాట్సాప్ ఆ అకౌంట్ ను బ్యాన్ చేస్తుంది.

ఇండియాలో గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమించామని, ఏ యూజర్ కైనా ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఆయన్ను సంప్రదించాలని సూచించింది. 2018లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు శిక్షణ ఇచ్చామని చెప్పింది.  ఈ ఏడాది కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వాట్సాప్ తెలిపింది.