వాట్సాప్ లోనూ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ డౌన్ లోడ్

వాట్సాప్ లోనూ  పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ డౌన్ లోడ్

వాట్సాప్ లో మరో సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చేసింది. ఇకపై మీరు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా వాట్సాప్ లో చాలా సులువుగా  డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన డిజిటల్  పౌర సేవల విభాగం ‘మైజీవోవీ.ఇన్’, వాట్సాప్ చేతులు కలిపి ఈ సరికొత్త  సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.  వాట్సాప్ ద్వారా మీ ‘డిజి లాకర్’ ఖాతాలోకి లాగిన్ అయి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం (ఆర్సీ) , ద్విచక్ర వాహన బీమా పాలసీ పత్రం, పదో తరగతి, ఇంటర్ మార్కుల షీట్ లను  డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ధ్రువపత్రాల డౌన్ లోడ్ ఇలా.. 

  • తొలుత మీరు +91 9013151515 వాట్సాప్  నంబరును సేవ్ చేసుకోవాలి.  దానికి ‘నమస్తే’, ‘హాయ్’ లేదా ‘డిజిలాకర్’ అని మెసేజ్ పెట్టాలి. 
  • ఆ వెంటనే మీకు వాట్సాప్ లో డిజిలాకర్ హెల్ప్ డెస్క్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏయే ధ్రువపత్రాల డౌన్ లోడ్ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలిపే ఒక జాబితా మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. అందులో మనకు అవసరమైన  ఒక ఆప్షన్ కు సంబంధించిన నంబరును ఎంటర్ చేయాలి. 
  • ఈ నంబర్ ను ఎంటర్ చేసిన వెంటనే డిజిలాకర్ పోర్టల్ టీమ్ మీరు కోరిన ధ్రువపత్రాన్ని షేర్ చేస్తుంది. 
  • అయితే అంతకుముందు డిజిలాకర్ ఖాతాలో మనం డౌన్ లోడ్ చేసి, సేవ్ చేసుకున్న ధ్రువపత్రాలను మాత్రమే ఈవిధంగా వాట్సాప్ లో పొందగలుగుతాం అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
  • ఒకవేళ మీకు డిజిలాకర్ ఖాతా లేకుంటే.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని కొత్త ఖాతాను క్రియేట్ చేసుకోవచ్చు.