- ఎమర్జెన్సీ, గిఫ్ట్‌ల పేరుతో డబ్బులు వసూలు
- ఓటీపీ తెలుసుకుని కాంటాక్ట్ నంబర్ల హ్యాకింగ్
- యువతులను వేధిస్తున్న కొందరు ఆకతాయిలు
- వాట్సాప్‌లో సెక్యూరిటీ తప్పనిసరి అంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు
‘‘గత నెల 24న మెహిదీపట్నంకు చెందిన రెహమాన్ వాట్సాప్‌కు రూ.20 వేలు అర్జెంట్ గా కావాలని ఫ్రెండ్ సలీం నుంచి మెసేజ్ వచ్చింది. బ్యాంకు అకౌంట్ నంబర్ కూడా ఉండగా రెహమాన్ వెంటనే అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత సలీంకు రెహమాన్ ఫోన్‌కాల్ చేసి డబ్బులు పంపానని చెప్పగా, తన వాట్సాప్ డీ యాక్టివేట్ అయ్యిందని, మెసేజ్ చేయలేదని చెప్పాడు. దీంతో రెహమాన్ తన వాట్సాప్ హ్యాక్ అయ్యిందని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్చేశాడు.’’
‘‘అమీర్‌పేటలోని విమెన్స్ హాస్టల్‌లో ఉండే ఓ యువతి వాట్సాప్‌కి కొద్దిరోజుల కిందట ఫ్రెండ్ నుంచి మెసేజెస్ వచ్చాయి. దీంతో తన పర్సనల్ విషయాలను కూడా ఆమెతో చాట్ చేసింది. ఆ యువతికి అనుమానం వచ్చి చాట్ చేసిన ఫ్రెండ్‌కు కాల్ చేసి మాట్లాడింది. దీంతో తన వాట్సాప్‌ను మరొకరు యాక్టివేట్ చేసుకున్నట్లు గుర్తించింది. ఓటీపీ అడిగిన వ్యక్తి తనకు తెలిసిన వాడేనని గుర్తుచేసుకుని పోలీసులకు కంప్లయింట్చేయగా అతడిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు.’’
హైదరాబాద్, వెలుగు : సైబర్ నేరాల్లో వాట్సాప్ హ్యాకింగ్ కూడా చేరిపోయింది. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో అందినంత దోచేస్తున్నారు. కొందరు తెలిసిన వారే యువతుల పర్సనల్ విషయాలను ట్రాప్ చేస్తున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ, గిఫ్ట్స్ పేరుతో లింక్స్ పోస్ట్ చేసి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇప్పటివరకు గ్రేటర్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో రిజిస్టరైన కేసులను పోలీసులు స్టడీ చేస్తున్నారు. వాట్సాప్ యాప్ యాక్టివేషన్‌ను సైబర్ నేరగాళ్లు బెస్ట్ ఛాన్స్‌గా చేసుకున్నట్లు గుర్తించారు.
కాంటాక్ట్ నంబర్స్‌కు లింక్స్ పంపి..
మొబైల్లో వాట్సాప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే టైమ్‌లో కనెక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. అదే నంబర్‌కు వెంటనే ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్‌మీట్ చేయగానే వాట్సాప్ యాక్టివేట్ అవుతుంది. ఫోన్‌లో ఉండే బ్యాకప్ కూడా రిట్రివ్ చేసుకునే చాన్స్ ఉండగా, ఇదే ఓటీపీతో సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ స్కెచ్ వేశారు. ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. కాంటాక్ట్ నంబర్స్‌కు లింక్స్ పంపించి ఆయా మొబైల్స్‌లోని వాట్సాప్ డేటాను హ్యాక్ చేస్తున్నారు. ఒరిజినల్నంబర్ వాట్సాప్ క్రెడెన్షియల్స్ కూడా మారుస్తారు. దీంతో ఓటీపీ చెప్పిన వ్యక్తి ఫోన్లోని వాట్సాప్ డీ యాక్టివేట్ అవుతుంది. ఆ వాట్సాప్ ను సైబర్ నేరగాళ్లు ఆపరేట్ చేస్తారు. కొందరు ఆకతాయిలు కూడా ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి హ్యాక్ చేసిన నంబర్ల కాంటాక్ట్లిస్ట్లోని మహిళలతో అసభ్యకరంగా చాట్ చేస్తుంటారు. తెలిసిన మహిళల నంబర్స్ నుంచే ఇలాంటి మెసేజ్ వస్తున్నాయని నమ్మి అడిగిన ఇన్‌ఫర్మేషన్ షేర్ చేస్తారు. దీంతో కొంత మంది యువతులు తమ పర్సనల్ విషయాలను కూడా అవతలి వైపు తెలియని ఫేక్ వాట్సాప్ యూజర్స్‌కి చెప్తుంటారు. ఇలా ట్రాప్ చేసిన వారిని ఆకతాయిలు లైంగికంగా వేధింపులకు కూడా పాల్పడుతారు.
వెరిఫికేషన్ కోడ్ పేరుతో..
ముందుగా సైబర్ ఫ్రాడ్స్తమ సెల్‌ఫోన్లలో వాట్సాప్ యాప్‌డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో కలెక్ట్ చేసిన ఫోన్‌నంబర్లను ఎంటర్ చేస్తారు. సెలెక్ట్ చేసిన నంబర్‌కి కాల్ చేసి తాము వాట్సాప్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామని నమ్మిస్తారు. వెరిఫికేషన్ కోసం కోడ్ ఓటీపీ నంబర్ సెండ్ చేశామని చెప్తారు. రిసీవ్ చేసుకున్న కోడ్ చెప్పాలని అడుగుతారు. ఇది నిజమని నమ్మి ఓటీపీ చెప్పిన వారి నంబర్‌తో తమ వాట్సాప్ నంబర్ యాక్టివేట్ చేసుకుంటారు. అప్పటికే యాక్టివేట్‌లో ఉన్న ఒరిజినల్నంబర్ నుంచి వాట్సాప్ డీ యాక్టివేట్ అవుతుంది. ఇలా హ్యాక్ చేసిన వాట్సాప్ లోని కాంటాక్ట్స్ ను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. వాట్సాప్ ప్రొఫైల్స్ ఛేంజ్ చేస్తారు. హై ప్రొఫైల్ నంబర్స్‌తో చాటింగ్ షురూ చేస్తారు. ఫ్రెండ్స్ చేసినట్లుగానే హెల్త్ ఎమర్జెన్సీ, లేక ఇతర అవసరాలకు డబ్బులు అడుగుతారు. లింక్స్ పంపించి క్లిక్ చేసేలా ప్లాన్ చూసుకుంటారు. ఇలా తెలిసిన వారి నంబర్ నుంచి వచ్చిన లింక్స్ ఓపెన్ చేయడంతో వారి వాట్సాప్ కాంటాక్ట్స్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. ఇలా హ్యాక్ చేసిన నంబర్లతో వరుస మోసాలకు పాల్పడుతుంటారు.
ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడే..
వాట్సాప్ హ్యాకింగ్ వెరిఫికేషన్ ఓటీపీ ఉంటేనే సాధ్యం. ఇలాంటివి చాలా తక్కువ కేసులు ఉంటాయి. వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడే సైబర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. వాట్సాప్ సెట్టింగ్స్ అకౌంట్‌లో డబుల్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే వాట్సాప్ హ్యాకింగ్, మరొకరు యూజ్ చేసే ఛాన్స్ ఉండదు.
- కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్