WhatsApp: కాల్ ప్రైవసీ కోసం కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..

WhatsApp: కాల్ ప్రైవసీ కోసం కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp యూజర్ల ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పటికప్పుడు సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేస్తుంది. ప్రస్తుతం వాయిస్, వీడియో కాల్స్‌ కు మరింత ప్రైవసీని అందించే కొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి తెస్తుంది. 

ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్అనే ఆప్షన్‌ ఎనేబుల్ చేసుకున్న యూజర్ల కాల్స్‌ను సొంత సర్వర్‌ల ద్వారా వాట్సాప్ పంపుతుంది. తద్వారా కాల్‌లోని ఇతర వ్యక్తులు యూజర్ ఐపీ అడ్రస్ ( IP address) చూడలేరు. ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నెట్‌లో ఒక డివైజ్, లొకేషన్‌ను గుర్తించే నంబర్. IP అడ్రస్ ఎవరికైనా తెలిస్తే వారు యూజర్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు.. ఆన్‌లైన్ యాక్టివిటీని ట్రాక్ చేయొచ్చు.

వాట్సాప్ దీన్ని ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల్లో పరీక్షిస్తోంది. గతంలో ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఇప్పుడు iOS వాట్సాప్ బీటా 23.20.1.73 అప్‌డేట్‌లో ఈ కొత్త ఆప్షన్ కనిపించినట్లు పేర్కొంది. ఈ అప్‌డేట్‌ టెస్ట్‌ఫ్లైట్ యాప్‌లో అందుబాటులో ఉంది.

ఎలా పని చేస్తుంది?

ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేయడానికి వాట్సాప్‌లోని ప్రైవసీ సెట్టింగ్స్‌కు వెళ్లి "ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్" అనే ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇది కాల్స్‌ను మరింత సెక్యూర్‌గా మారుస్తుంది. ప్రైవసీ రిలే అనే సెక్యూర్ పద్ధతిలో ఈ కాల్ సాగుతుంది. అంటే యూజర్ల మధ్య కాల్ కనెక్షన్ నేరుగా కనెక్ట్ అవ్వకుండా ముందుగా సర్వర్లకు కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఎవరైనా ట్రాక్ చేయదలచినప్పుడు వాట్సాప్ సర్వర్ ఐపీ అడ్రస్ మాత్రమే కనిపిస్తుంది. యూజర్ ఐపీ అడ్రస్ కనిపించదు.

ప్రైవసీ లేదా కాల్ క్వాలిటీ ఈ రెండింటిలో ప్రైవసీ కావాలనుకుంటే కొత్త ఫీచర్ ఆన్ చేస్తే సరిపోతుంది. క్వాలిటీ కాల్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఫీచర్‌ను టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. గుర్తుతెలియిన వ్యక్తికి కాల్ చేసినప్పుడు ఈ ఫీచర్ ఆన్ చేసుకోవచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

ఈ ఫీచర్‌తో ఐడెంటిటీ, లొకేషన్‌ వివరాలు ఇతరులకు లేదా హ్యాకర్లకు తెలియకుండా జాగ్రత్త పడొచ్చు. IP అడ్రస్ ఆధారంగా లక్ష్యంగా చేసుకునే అన్‌వాంటెడ్ యాడ్స్ లేదా స్పామ్‌లను కూడా అడ్డుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్ల కన్వర్జేషన్లను ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంచుతుంది కాబట్టి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.