న్యూఢిల్లీ: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు వచ్చాయి. కమ్యూనిటీ, గ్రూప్ కాలింగ్, గ్రూప్ యూజర్ల సంఖ్య పెంపు, పోల్ చాట్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ మేరకు మేటా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు గ్రూప్‌లను క్రియేట్ చేసి యూజర్లను అందులో యాడ్ చేసేవారు. తర్వాత గ్రూప్‌లో ఉన్నవారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసేవారు. ఆ ఇన్ఫర్మేషన్‌ను అవసరమైతే మిగతా గ్రూప్‌లకు సపరేట్‌గా పంపేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఒకే ఇన్ఫర్మేషన్‌ను వేర్వేరు గ్రూపులకు ఒకేసారి పంపేందుకు ‘కమ్యూనిటీస్’అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో కమ్యూనిటీని క్రియేట్ చేసి, ఆయా గ్రూప్‌లను ఇందులో యాడ్ చేసి, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే, ఇది అందరికీ చేరుతుంది.
ఇన్‌చాట్ పోల్స్..
ఇన్‌చాట్ పోల్స్ ఫీచర్‌ను వాట్సాప్ చాలా కాలంగా పరీక్షిస్తోంది. ఏ విషయం గురించి అయినా గ్రూప్ సభ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు పోల్ నిర్వహించవచ్చు. ఇందులో గరిష్టంగా 12 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో తమకు నచ్చిన ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకొని పోల్‌లో పాల్గొనవచ్చు.
ఒకేసారి 1,024 మందితో గ్రూప్ చాట్..
గ్రూపుల్లో యాడ్ చేసుకునే సభ్యుల సంఖ్య పరిమితిని 1,024కు పెంచింది. ప్రస్తుతం వీడియో కాల్‌లో ఒకేసారి 8 మంది మాట్లాడే అవకాశం ఉంది. ఆ సంఖ్యను 32కు పెంచింది. 2 జీబీ వరకు ఫైల్స్‌ను షేర్ చేయడం, ఎమోజీ రియాక్షన్లు, అడ్మిన్ డిలీట్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.