అభిమానులు ఎంతగానో ఎదరు చూస్తున్న ఐపీఎల్ 2025 రిటైన్ చేసుకునే ప్లేయర్ల సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో ఏ ఫ్రాంచైజీ ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటారో తెలిసిపోనుంది. ఇప్పటికే ఆయా జట్ల ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకున్నట్టు తెలిసింది. సాయంత్రం 5 గంటలకు అధికారిక ప్రకటన రానుంది.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ సహా మొత్తం 10 జట్లు ఈ రోజు (అక్టోబర్ 31) సాయంత్రం 5 గంటలకు రిటెన్షన్ జాబితాను షార్ట్‌లిస్ట్ చేయాలి.
లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?
ఐపీఎల్ 2025 రిటెన్షన్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ వీక్షించవచ్చు. సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అక్టోబరు 31 (గురువారం) సాయంత్రం 5 గంటలలోపు ప్రతి జట్టు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలి. స్టార్‌టీమ్స్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తమ రిటైన్డ్ ప్లేయర్‌ల జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
Also Read : బుమ్రా చేజారిన నం.1 ర్యాంక్
డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్ తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోనుంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కూడా వేలంలోకి వస్తున్నారని సమాచారం. సునీల్ నరైన్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తితో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్ హర్షిత్ రాణాను కేకేఆర్ రిటైన్ చేసుకునే చాన్సుంది.
సీఎస్కే.. తమ మాజీ కెప్టెన్ ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, జడేజా, శివం దూబే, శ్రీలంక పేసర్ మతీష పతిరణను కొనసాగించనుంది. మహీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ కానున్నాడు. గుజరాత్ టైటాన్స్‌కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన జీతం తగ్గించుకొని రెండో రిటెన్షన్‌గా ఉండేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. జీటీ తమ ఫస్ట్ రిటెన్షన్‌గా రషీద్ ఖాన్ పేరును ఖరారు చేయనుంది. ఆ తర్వాత గిల్, సాయి సుదర్శన్, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్‌ను రిటైన్ చేసుకోనుంది.
ఢిల్లీకి పంత్ గుడ్‌బై
టీమిండియా స్టార్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి వేలంలోకి రానున్నాడు. తను జట్టుతోనే కొనసాగేలా ఒప్పించేందుకు ఢిల్లీ ఫ్రాంచైజీ చివరి నిమిషం వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేఎల్ రాహుల్ లక్నోను వీడటం ఖాయం కాగా.. ఆర్‌సీబీ విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ యష్ దయాల్ ముగ్గురినే కొనసాగించే చాన్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు శశాంక్ సింగ్
ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను మాత్రమే రిటైన్ చేసుకొని వచ్చే సీజన్‌లో పూర్తి కొత్త జట్టుతో బరిలోకి దిగాలని చూస్తోంది. ముంబై ఇండియన్స్ రోహిత్, హార్దిక్, సూర్యకుమార్, బుమ్రా, తిలక్ వర్మను కొనసాగించొచ్చు. రాజస్తాన్ రాయల్స్ ఎలాంటి సంచలనాలు లేకుండా జైస్వాల్, శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మయర్, ధ్రువ్ జురెల్, సందీప్ శర్మ (అన్‌క్యాప్డ్)ను రిటైన్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.