నూటికో.. కోటికో ఒక్కరు : ఓ చిన్న గ్రైండర్ (మిక్సీ) బహుమతికి డబ్బు చెల్లించిన అబ్దుల్ కలాం

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్, పాలిటిక్స్ రెండింటిలోనూ చేసిన కృషి ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన వృత్తిపరమైన విజయాలతో పాటు, భారత సూత్రాలను అనుసరించినందుకు గానూ చాలా సార్లు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) అధికారి MV రావు.. బహుమతులు స్వీకరించడంపై డాక్టర్ కలాం వైఖరిని సోషల్ మీడియా ద్వారా చెప్పుకువచ్చారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒక సాధారణ గ్రైండర్ మెషిన్ బహుమతిని తీసుకోవడానికి నిరాకరించిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. అయితే కలాం ఆ బహుమతికి చెల్లించాలని పట్టుబట్టాడని, నిర్వాహకులతో మాట్లాడి కలాం చివరికి బహుమతిని అంగీకరించారని చెప్పారు. ఆయన చేసిన ఈ పని ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

“2014లో 'సౌభాగ్య వెట్ గ్రైండర్' అనే కంపెనీ ఒక కార్యక్రమంలో స్పాన్సర్‌గా ఉంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పాన్సర్ ఆయనకు బహుమతిని అందించారు. కానీ కలాం దాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు. స్పాన్సర్ అది కేవలం గ్రైండర్ అని వివరించాడు, అంగీకరించమని అభ్యర్థించాడు. కలాం మరో వాదన లేకుండా బహుమతి తీసుకున్నాడు. మరుసటి రోజు, గ్రైండర్ ధరను తెలుసుకోవడానికి అబ్దుల్ కలాం తన వ్యక్తిని మార్కెట్‌కి పంపి.. దానికి విలువైన చెక్కును కంపెనీకి పంపాడు. ఊహించిన విధంగానే కంపెనీ చెక్కును డిపాజిట్ చేయకూడదని నిర్ణయించుకుంది. ఆ తర్వాత కలాం తన బ్యాంక్ ఖాతా నుంచి చెక్కు ద్వారా పంపిన అమౌంట్ కట్ కాకపోవడంతో.. కలాం, కంపెనీతో చెక్కు జమ చేయకపోతే, తాను గ్రైండర్‌ను తిరిగి ఇస్తానని నొక్కి చెప్పాడు. ఆయన మాటలకు ముగ్ధులైన కంపెనీ అధికారులు చెక్కును డిపాజిట్ చేశారు. ఆయన స్ఫూర్తికి గుర్తుగా కంపెనీ చెక్కు ఫొటోకాపీని తీసి ప్రదర్శనలో ఉంచింది అని MV రావు ట్విట్టర్ లో రాసుకువచ్చారు.

ఈ పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కలాం చేసిన పనిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. కలాం జీవితం నుంచి నేర్చుకోగల పాఠాలను హైలైట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొంతమంది అధికారులు అధికారిక సందర్శనల సమయంలో వ్యక్తిగత బహుమతులు లేదా ఆహారం తీసుకోవడం ఎందుకు మానుకుంటారో ఇప్పుడు తమకు అర్థమైందని మరొకరు పంచుకున్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశానికి అత్యంత ప్రియమైన వ్యక్తి, గౌరవనీయమైన రాష్ట్రపతి అని ఇంకొకరు చెప్పారు. కాగా ఈ పోస్టును ఐఏఎస్ అధికారి ఎంవీ రావు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి వైరల్‌గా మారి 2 లక్షలకు పైగా వ్యూస్‌ను దాటింది.