పోడు పట్టాలు ఇంకెప్పుడు? రాష్ట్ర సర్కార్‌‌‌‌కు కాంగ్రెస్ నేత రాములు నాయక్ ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాములు నాయక్ అన్నారు. ఈ విషయంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లను నిలదీయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పట్టాల కోసం 4 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, లక్షన్నర మందికే ఇచ్చి చేతులు దులుపుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పేదలకు భూములివ్వాల్సిన ప్రభుత్వం, వారి దగ్గర్నుంచే గుంజుకుంటున్నదని ఆరోపించారు.

ALSO READ:వానాకాలం సాగు కోటిన్నర ఎకరాలు ..ఇప్పటి వరకు 4.18 లక్షల ఎకరాల్లో సాగైన పంటలు

మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో 1,500 ఎకరాల పట్టా భూములను ఫారెస్ట్‌‌‌‌ భూములుగా చూపించి లాక్కునేందుకు కుట్ర చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కొని, వారిని జైళ్లకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. హరితహారం పేరిట రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం తీసుకుని, బడా బాబులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. అసలు హరితహారంలో ఎన్ని చెట్లు నాటారో, అందులో ఎన్ని బతికి ఉన్నాయో వైట్‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ పోడు పట్టాలిస్తామని అన్నారు.