టీఎన్జీవోస్ ఎలక్షన్స్ ఎప్పుడు? .. డిసెంబర్ 26తో జిల్లా కమిటీ కాలపరిమితి పూర్తి

టీఎన్జీవోస్ ఎలక్షన్స్ ఎప్పుడు? .. డిసెంబర్ 26తో జిల్లా కమిటీ కాలపరిమితి పూర్తి
  • సభ్యత్వం విషయంలోనూ ప్రస్తుత కమిటీ నిర్లక్ష్యం
  • నలుగురు నాయకుల పెత్తనంపై టీఎన్జీవోల ఆగ్రహం
  • మెంబర్​షిప్ చేపట్టి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
  • ఆరు యూనిట్లకు నవంబర్​లోనే ముగిసిన గడువు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట, మందమర్రి, కన్నెపల్లి యూనిట్ల పదవీకాలం నవంబర్​లోనే ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీలను ఎన్నుకోవాల్సి ఉండగా ఇప్పటికీ, రెండు నెలలు కావస్తున్నా ఆ ఊసే లేకపోవడంతో టీఎన్జీవోలు ఫైర్ అవుతున్నారు.

3 జిల్లాలోని ఆరు యూనిట్లకు ఎన్నికయ్యే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పాత బాడీ కార్యవర్గ సభ్యులు కలిసి కొత్త కమిటీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యూనిట్ల కాలపరిమితికి ముందే జిల్లా వ్యాప్తంగా కొత్త మెంబర్​షిప్ చేపట్టి ఎన్నికలకు వెళ్లాలి. కానీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ చేపట్టకపోవడంపై సభ్యులు మండిపడుతున్నారు. ప్రస్తుతం మంచిర్యాల యూనిట్​లో 300 మంది, లక్షెట్టిపేటలో 120, మందమర్రిలో 94, చెన్నూర్​లో 107, బెల్లంపల్లిలో 112, కన్నెపల్లి యూనిట్​లో 67 మంది సభ్యులున్నారు. 

ఏకపక్షంగా కమిటీల ఎన్నిక

టీఎన్జీవోస్ ఆరు యూనిట్ కమిటీలతో పాటు జిల్లా కమిటీ ఎన్నికలు గతంలో కొంతమంది నాయకులు కనుసన్నల్లో ఏకపక్షంగా జరిగాయని, ముఖ్యంగా జిల్లా కమిటీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించడం లేదని  సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా బాడీని పాత కమిటీ కార్యవర్గ సభ్యులతో పాటు ఆరు యూనిట్లకు కొత్తగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కలిసి ఎన్నుకుంటారు.

 వీరి సంఖ్య పరిమితం కావడంతో యూనియన్​లో మొదటి నుంచి పెత్తనం చెలాయిస్తున్న కొంత మంది నాయకులు అందరినీ మేనేజ్ చేసి తమకు అనుకూలంగా ఉన్నవారిని ఎన్నుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల జిల్లా కమిటీలో కొంతమంది నాయకుల ఆధిపత్య ధోరణలు పెరగడాన్ని టీఎన్జీవో సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఈసారి ఆరు యూనిట్లతో పాటు జిల్లా కమిటీ ఎన్నికల్లో పలువురు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆ నలుగురిదే ఆధిపత్యం

తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నలుగురు నాయకుల చేతిలో బందీ అయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర జిల్లాలకు ట్రాన్స్​ఫర్ అయినవారు, గెజిటెడ్ అధికారులుగా ప్రమోషన్ పొందినవారు యూనియన్ లో కొనసాగుతూ పెత్తనం చెలాయిస్తున్నారని సభ్యులు మండిపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గడియారం శ్రీహరి ఆరు నెలల కిందట గెజిటెడ్ అధికారిగా ప్రమోషన్ పొందారు. ఇప్పటికీ ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నాయి. ఇదేకాకుండా ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మళ్లీ తానే ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానని తన మనసులోని కోరికను బయటపెట్టినట్టు సమాచారం. 

అలాగే జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్న బి.రామ్మోహన్ ఆసిఫాబాద్ జిల్లాలో డిప్యుటేషన్​పై పనిచేస్తూ ఇక్కడ పదవి అనుభవించడాన్ని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మంచిర్యాల జిల్లా కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్​గా ఉన్న పొన్న మల్లయ్య ఏకంగా మూడు పదవుల్లో కొనసాగడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయన స్టేట్ యూనియన్​లో సెక్రటరీగా, టీఎన్జీవోస్​కు అనుబంధంగా ఉన్న స్టేట్ ఫారెస్ట్ ఎంప్లాయీస్ ఫోరంకు రాష్ట్ర అధ్యక్షుడిగా, టీఎన్జీవోస్ జిల్లా ట్రెజరర్​గా పదవులు అనుభవిస్తున్నారు. 

రెండేండ్ల కిందట మండల పంచాయతీ అధికారి(ఎంపీవో)గా గెజిటెడ్ హోదా పొందిన శ్రీపతి బాపు నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్​కు అసోసియేట్ ప్రెసిడెంట్​గా కొనసాగడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ టీజీవో అనుబంధంగా ఉన్న తెలంగాణ మండల పంచాయతీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

ఉద్యోగ విరమణ పొంది ప్రస్తుతం పొరుగు జిల్లాలో ఉంటున్న జిల్లా మాజీ అధ్యక్షుడి కనుసన్నల్లో ఈ నలుగురు టీఎన్జీవో యూనియన్ ను తమ గుప్పెట్లో పెట్టుకున్నారని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో టీఎన్జీవోలంతా ఏకమై వీరి చెర నుంచి సంఘాన్ని విముక్తి చేస్తామని పేర్కొంటున్నారు.

త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాం..

జిల్లాలోని ఆరు యూనిట్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ వెంటనే జిల్లా కమిటీని కూడా ఎన్నుకుంటాం. పదవుల కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొంత మంది యూనియన్​పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. యూనియన్​లో ఎవరి పెత్తనం లేదు. అన్ని వ్యవహారాలు ప్రజాస్వామ్య బద్ధంగానే సాగుతున్నాయి. ఫస్ట్ లెవల్ గెజిటెడ్ ఆఫీసర్లు టీఎన్జీవోస్​లో ఉండవచ్చని బైలాస్​లోనే ఉంది. 2014లో ప్రభుత్వం జీవో సైతం తీసుకొచ్చింది. జోడు పదవుల్లో కొనసాగుతున్నవారు కొత్త కమిటీలో పోటీ చేయాలనుకుంటే ఏదో ఒక పదవిలో మాత్రమే ఉండాలని స్పష్టం చేశాం.

గడియారం శ్రీహరి, జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్