ఏజెన్సీ మున్సిపాలటీలకు ఎన్నికలెప్పుడు?

స్థానిక ప్రభుత్వం లేకుండా, 24 ఏండ్లుగా  మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న మందమర్రి గతంలో  గ్రామ పంచాయతీగా ఉండేది. ప్రభుత్వం 1993 అక్టోబర్ 21 న నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించింది.1995 మే8 న  థర్డ్ ​గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించారు. చైర్మన్​ పదవి ఎస్సీకి రిజర్వు కాగా, 1/70 చట్టం అమలులో ఉన్నందున ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  చైర్మన్​ పదవి ఎస్టీకి కేటాయించాలంటూ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఎన్నికలు నిలిపివేయాలంటూ కోర్టు స్టే ఇచ్చింది. దాంతో ఏజెన్సీ ప్రాంత మున్సిపాలిటీ పాలకమండలి లేక 24 ఏండ్లు గడిచిపోయాయి.  ఏజెన్సీ ప్రాంత మున్సిపాలిటీలకు పాలకమండళ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మందమర్రితో పాటు పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, సారపాక, ఆసిఫాబాద్​ లాంటి లోకల్​ బాడీస్​లో ఇదే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఏజెన్సీ ప్రాంతాల్లోని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలి.    డిసెంబర్​ 7 నుంచి 17 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లోనైనా  ఏజెన్సీ ప్రాంతంలోని మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు కృషి చేయాలి. రాష్ట్రంలో ఎజెన్సీ ప్రాంతంలోని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగని అంశంపై తెలంగాణ పార్లమెంటు సభ్యులందరూ పార్లమెంట్​లో  ప్రస్తావించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటేనే ఏండ్లుగా వేధిస్తున్న  ఈ సమస్యకు ఫుల్​స్టాప్​ పడుతుంది. అప్పుడే ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటై, ప్రజల కష్టాలు తీరుస్తాయి.
- గంట రాకేశ్​,
మందమర్రి, మంచిర్యాల జిల్లా