కాశ్మీర్‌లో పెంచినపుడు తెలంగాణలో ఎందుకు పెంచరు?

వరంగల్: కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచినపుడు తెలంగాణలో మాత్రం ఎందుకు పెంచరని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒకే దేశం.. ఒకే విధానం అంటున్న బీజేపీ.. ఈ విషయంలో మాత్రం ఎందుకు అమలు చేయదని ఆయన మండిపడ్డారు. కాశ్మీర్‌లో పెంచుతున్నట్లే.. తెలుగు రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌసులో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వినోద్ పైవ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

‘తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు గురించి లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సమాధానం దాటవేసింది. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచుతారా లేదా అనే విషయం స్పష్టం చెయాలి. సెక్షన్ 26ను ఆసరాగా చేసుకుని కాశ్మీర్‌లో సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే దేశం ఒకే చట్టం అనేది బీజేపీ సిద్దాంతం. ఒకే దేశం ఒకే ట్యాక్స్, ఒకే దేశం ఒకే హెల్త్ స్కీమ్, ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు జరగాలి అన్నారు. ఇలా అనేక అంశాలపై ప్రధాని మోడీ ఒకే దేశం ఒకే విధానం అంటున్నారు. డీలిమిటేషన్ కమిటీ వేసి కాశ్మీర్‌లో సీట్లు పెంచుతున్న మోడీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎందుకు పెంచరు? ఒకే దేశం ఒకే న్యాయం ఉండాలి. అంతేకాని కాశ్మీర్‌లో ఒక న్యాయం.. తెలుగు రాష్ట్రాల్లో మరో న్యాయం ఎందుకు? శాసన సభలో సీట్లు పెంచేందుకు కుటుంబ నియంత్రణకు ఏం సంబంధం ఉంది. బీజేపీ కేవలం కౌవ్ బెల్ట్ పార్టీ, ఉత్తర భారత దేశ పార్టీ. తెలంగాణలో ఎలాగూ గెలవరని సీట్లు పెంచడం లేదు. వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం’ అని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.