ఆత్మగౌరవ భవనాలను కట్టేదెన్నడు?

రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీలే ఉన్నారు. అయినా పాలన చేస్తున్నది మాత్రం ఆధిపత్య వర్గాలే. పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి.. వాళ్లిచ్చే రాయితీలకు అలవాటు పడ్డవారే ఎక్కువ మంది ఉన్నారు. పాలనలో భాగంగా ఉన్న కొందరు బీసీ నాయకులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగే సాహసం చేయలేకపోవడం వల్ల బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతోంది. ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామన్న టీఆర్ఎస్ సర్కారు.. ఎన్నేండ్లయినా పట్టించుకోవడం లేదు. హామీని ఎప్పటికి పూర్తి చేస్తుందో చెప్పడం లేదు.

ఎన్నికల హామీ నెరవేర్చలే..
బీసీ సామాజిక వర్గాలకు రాష్ట్ర రాజధానిలో ఏ కులానికి ఆ కులం తమ తమ రాష్ట్ర, జిల్లా కులసంఘాల కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక వేదిక తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దీన్ని పట్టించుకునేవారు లేక బీసీ సామాజిక వర్గాలు నిరాదరణకు గురయ్యాయి. దీన్ని గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం సొంత రాష్ట్రంలో బీసీలు ఆత్మగౌరవంతో బతకాలని 2018 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ  కుల సంఘాల నాయకులతో సంప్రదింపులు జరిపింది. సీఎం కేసీఆర్ సూచన మేరకు సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు సమావేశాలు కూడా నిర్వహించారు. సామాజిక, రాజకీయ నిపుణుల సలహాతో అన్ని బీసీ కులాలకు వారి కులాల పేరుమీద ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికోసం 2018 ఆగస్టు 29న రూ.58.75 కోట్ల నిధులను కూడా ప్రకటించింది. సంచార జాతి కులాలకు చెందిన 35 కులాలకు ఉప్పల్ బగాయత్ లో 10 ఎకరాల స్థలంలో రూ. 10 కోట్లతో ఆత్మగౌరవ భవనం నిర్మాణం చేసి ఇస్తామని, అలాగే ఇంకా 29 వివిధ బీసీ కులాలకు ఉప్పల్ బగాయత్, కోకాపేట ఇతర ఏరియాల్లో స్థలాలు కేటాయించి రూ.48.75 కోట్లతో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని చెప్పి జీవో నంబర్ 633 ను జారీ చేసింది.

పట్టించున్న నాథుడే లేడు
ఆత్మగౌరవ  భవనాల విషయంపై  ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వమే జీవో ఇచ్చి నిధులు కూడా మంజూరు చేసింది. ఈ హామీని నెరవేర్చాలని అడిగి బీసీ వర్గాలకు సహకరించకుంటే బీసీ నాయకులు ఉన్నట్టా, లేనట్టా?. ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న బీసీ నాయకులకు బీసీ వర్గాలపై ఎందుకు ఇంత చులకన భావమో చెప్పాలి. సకల సబ్బండ వర్ణాలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో వివిధ బీసీ వర్గాల ప్రజల పోరాటం, కష్టం లేదా? బీసీలను నిర్లక్ష్యం చేయడం న్యాయంగా ఉందా? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలు తమకు ఆత్మగౌరవ భవనాలు కావాలని ప్రభుత్వాన్ని అడిగాయా? ఎన్నికలకు ముందు హడావుడిగా అందర్నీ పిలిచి మాట్లాడింది. బీసీల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ లో సమావేశ మందిరాలు, వివిధ కులాల రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందని ఆశ చూపింది. అన్ని హంగులతో ప్రతి కులానికి మీరు కోరినట్టు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని గొప్పలు చెప్పి జీవో జారీ చేసి నిధులు కూడా విడుదల చేసింది. అయితే మూడేండ్లయినా పట్టించుకోవడం లేదు. దీనిపై బీసీ వర్గాలు సీఎంను అడగాలనుకుంటే 'దొర'గారు ఎవరికీ దర్శనం ఇయ్యడం లేదు. సంబంధించిన మంత్రులను అడిగితే ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. అయినా ఈ హామీ అమలులో అడుగు ముందుకు  పడటం లేదు.

- శ్రీనివాస్ తిపిరిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్