కాంగ్రెస్ ​ఆశావహుల్లో టెన్షన్

  • టికెట్​ ఖరారైందని ఇప్పటికే నేతల ప్రచారం
  • కానీ ఫస్ట్ లిస్ట్​లో ఎవరికీ దక్కని చోటు
  • బీజేపీలో టికెట్ వచ్చేదేవరికో..?

ఆసిఫాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు మరో 45 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జిల్లాలోని అభ్యర్థులకు బీఫాంలు అందజేసింది. పేర్లు ఖరారైన నాటి నుంచే సిర్పూర్, ఆసిఫాబాద్​ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్​పర్సన్ కోవ లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నరు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం చాలా వెనకబడిపోయాయి. ఆదివారం కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్ట్​ను రిలీజ్​చేయగా.. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను కేటాయించకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. 

ఎవరికి వారే విస్తృత ప్రయత్నాలు

ఎస్టీ నియోజకవర్గమైన ఆసిఫాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం మర్సుకోల సరస్వతి, శ్యామ్ నాయక్, రాథోడ్ శేషారావు, గణేశ్ రాథోడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్యామ్ నాయక్ కు టికెట్​ఖరారయ్యిందని ఓ వర్గం ప్రచారం చేసుకుంటుంటే.. మరో వర్గం గణేశ్ రాథోడ్ కే టికెట్ ఖరారైనట్లు ప్రచారం చేసుకున్నారు. అయితే మొదటి జాబితాలో ఏ ఒక్కరి పేరు లేకపోవడంతో కార్యకర్తలు ఖంగుతిన్నారు. శ్యామ్ నాయక్​కు  టికెట్ ఇప్పించేందుకు రేవంత్ ద్వారా ఓ వర్గం ప్రయత్నిస్తుండగా.. డాక్టర్ గణేశ్ రాథోడ్ కోసం స్ట్రాటజీ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఢిల్లీ లెవల్​లో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.

ఆదివాసీ అయిన మర్సుకోల సరస్వతికే టికెట్ ఇవ్వాలంటూ గాంధీ భవన్ ఎదుట ఆదివాసులు నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆసిఫాబాద్ నియోజకవర్గం బీజేపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టికెట్ కోసం కోట్నాక్ విజయ్ కుమార్, అజ్మీర ఆత్మారాం నాయక్ పోటీ పడుతుండగా.. అధిష్టానం మాత్రం సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావును ఇక్కడి నుండి పోటీలో దింపాలని చూస్తున్నట్లు సమాచారం. 

హైదరాబాద్​లో మకాం

సిర్పూర్ నియోజకవర్గంలో ఇదివరకే అభ్యర్థిత్వం ఖరారైన బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమదైన రీతిలో ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రావి.శ్రీనివాస్ లేదా కోరళ్ల కృష్ణారెడ్డికి టికెట్​ దక్కనుందని ప్రచారం జరుగుతోంది.

తొలి జాబితాలో ఎవరి పేరు ఖరారు చేయకపోవడంతో శ్రీనివాస్, కృష్ణారెడ్డి హైదరాబాద్​లో మకాం వేసి టికెట్​ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీజేపీలో పాల్వాయి హరీశ్ బాబు, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, లెండిగురే శ్యామ్ రావు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్​దక్కుతుందోనని కాంగ్రెస్, బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోంది.