చట్టసభల్లో మహిళా భాగస్వామ్యం పెరిగేదెప్పుడు?

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. ఆ పేరుతో ఏడాది పాటు సంబురాలు కూడా జరుగుతున్నాయి. మరి 75 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మహిళల పరిస్థితి దేశంలో ఎలా ఉంది? మహిళలకు దక్కాల్సిన సమాన అవకాశాల పరిస్థితి ఏంటి? ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అనే నినాదం ఇంకా అలాగే ఎందుకు మిగిలింది? అన్ని రంగాల్లో సమాన హక్కులు సరే, చట్టాలు చేసి దేశాన్ని ముందుకు నడిపించే చట్టసభల్లో మహిళలకు ఏ మేరకు భాగస్వామ్యం దక్కింది?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏండ్ల తర్వాత చట్టసభల్లో ముఖ్యంగా పార్లమెంట్ ఉభయసభల్లో మహిళల ప్రాతినిధ్యం తొలిసారిగా వంద దాటింది. ప్రస్తుతం లోక్​సభలో 81 మంది, రాజ్యసభలో 29 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇది 14.9 శాతమే. సమాన అవకాశాల నినాదం ప్రకారం చూసినా, 33 శాతం రిజర్వేషన్ బిల్లు పరంగా చూసినా చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువే. ఇక ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నిక అవుతున్న మహిళల సంఖ్య చూస్తే పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సగటున 9 శాతం మంది 
మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. ఓటర్ల సంఖ్య విషయానికి వస్తే పురుషులకు కొంచెం అటుఇటుగా మహిళా ఓటర్లు ఉంటారు. కానీ, ఎన్నికల్లో పోటీ, గెలుపు విషయానికి వచ్చే సరికి మాత్రం వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..

దేశంలోని మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 317 మంది మహిళలు పోటీ చేయగా.. 27 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంటే గెలిచిన వారు 9.1 శాతం మాత్రమే. 259 మంది మహిళా అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 140 మంది మహిళలు పోటీ చేస్తే ఆరుగురు మాత్రమే గెలిచారు. 122 మంది డిపాజిట్లు కోల్పోయారు. 2019 ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో 211 మంది పోటీ చేస్తే 14 మంది మహిళలు గెలవగా, 174 మందికి డిపాజిట్ దక్కలేదు. ఇక 2014లో చంద్రబాబు సీఎంగా ఏర్పడిన ఏపీ కేబినెట్​లో పరిటాల సునీత, అఖిలప్రియ, మృణాళిని, పీతల సుజాత మంత్రులుగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కొలువుదీరిన మొదటి కేబినెట్​లో ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరు. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం, ఆ తర్వాత మరోసారి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు కేబినెట్​లో చోటు దొరికింది. వారే సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి. సబిత వేరే పార్టీ నుంచి రాగా.. సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ బీ-ఫారం మీద గెలిచిన ఏ ఒక్క మహిళా ఎమ్మెల్యే ఇప్పటి వరకు మంత్రి కాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్​లో 2019లో ఏర్పడిన వైఎస్ జగన్ కేబినెట్​లో పుష్ఫ శ్రీవాణి, వనిత, సుచరిత మంత్రులయ్యారు. 

పార్టీల్లోనూ అంతంతే..

రాజకీయ పార్టీల విషయానికి వస్తే నలుగురు మహిళలు పార్టీలకు అధ్యక్షులుగా ఉండి విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. మాయావతి, సోనియాగాంధీ, మమతా బెనర్జీ, మెహబూబా ముఫ్తీ రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని రకాల ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. జయలలిత వంటి వారు కూడా పార్టీని ఎంత సమర్థవంతంగా నడిపారో, ఎలా అధికారంలోకి తెచ్చారో మనకు అనుభవంలో ఉన్నదే. అయితే మిగతా రాజకీయ పార్టీల్లో మహిళలు ఎక్కడ ఉంటున్నారు? వారి పాత్ర ఏమిటి అని ఆలోచించినప్పుడు నిరాశాపూరిత వాతావారణమే కనిపిస్తుంది. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, కోశాధికారి వంటి పదవులకు మహిళలు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా పలు పార్టీల్లో లేదు. దశాబ్దాలుగా పురుషుల డామినేషన్ ఆయా పార్టీల్లో పరంపరగా కొనసాగుతూ వస్తోంది. ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లను దాటి పార్టీ పగ్గాలు చేపట్టే పరిస్థితి మెజారిటీ పార్టీల్లో మహిళలకు లేదు. 

33 శాతం రిజర్వేషన్‌‌ బిల్లు పరిస్థితి..

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో రూపొందించిన బిల్లు ఇప్పటికీ పార్లమెంట్ ఆమోదం పొందలేదు. 2008లో తొలిసారిగా పార్లమెంటు ముందుకు వచ్చిన ఈ బిల్లుకు కొన్నిపార్టీలు ససేమిరా అన్నాయి. మహిళలకు ఒకసారి రిజర్వు చేస్తే శాశ్వతంగా తమకు అధికారం దక్కదన్న భావన ఆ బిల్లుకు ఆమోదం కాకుండా అడ్డుపడుతోంది. యూపీఏ హయాంలో ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లు గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ దక్కుతున్నా ఎన్నికైన తర్వాత 90 శాతం మగవారే పెత్తనం చెలాయిస్తున్నారు. పేరుకే మహిళలు సీట్లో కూర్చుంటున్నా భర్తో, అన్నో, తండ్రో వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినా చూసీ చూడనట్లు నడిచిపోతోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? సంప్రదాయకంగా మహిళలను ఇంటికి, ఇంటి వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచన మెజారిటీ కుటుంబాల్లో ఉండటమే ప్రధాన కారణం. ఇల్లు, పిల్లలు తప్ప మరో గోల పట్టని మహిళలే మెజారిటీ. వారిని ఆ చట్రంలోనే ఉంచుతున్నది మెజారిటీ పురుషస్వామ్యమే అయినా అక్కడక్కడ మహిళలు కూడా ఇందుకు దోహదపడుతున్నారు. ప్రాథమికంగా చదువుకునే విషయం నుంచే ఈ వివక్ష మొదలవుతోంది. ఆడపిల్లలకు చదువు ఎందుకనే చర్చ మొదలుకొని ఎక్కువ చదువుకుంటే సరైన భర్తను తేలేమన్న హిపోక్రటిక్ భావాలతో సమాజం నిండిపోయింది. ఇలాంటివెన్నో వారు రాజకీయంగా ఎదగకపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఉమెన్​ ఫ్రెండ్లీ కల్చర్​ ఎక్కడ?

రాజకీయాల్లో ఉమెన్ ఫ్రెండ్లీ వాతావరణం లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. పార్టీల్లో స్థానం కోసం బహుముఖ పోటీ, నిలదొక్కుకోవడానికి అవకాశాలు దొరకపుచ్చుకోవడం, పురుషులతో సమానంగా ఎత్తుకు పై ఎత్తులు వేయడం మహిళలకు సాధ్యం కాదనే ప్రచారం అవరోధాలుగా కనిపిస్తుంటాయి. దీంతో ఈ రాజకీయం మనకెందుకులే అని అనుకునే వారే ఎక్కువ మంది కనిపిస్తారు. మితిమీరిన రాజకీయ హింస కూడా మహిళలను రాజకీయాలకు దూరం చేస్తోంది. నేరపూరిత, కుట్రపూరిత రాజకీయాలతో పాటు అవినీతి వంటి అంశాలు మహిళలు పొలిటికల్ ఎరీనాలోకి రాకుండా చేస్తున్నాయి. రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుపుకునే వాతావరణం ఉండాలి. ప్రెసిడెంట్ సహా ఇతర అన్ని పోస్టులకు పురుషులతో సమానంగా మహిళలు పోటీ చేసే వాతావరణాన్ని కల్పించాలి. రాజకీయ పార్టీల్లో మహిళలకు కచ్చితమైన పర్సంటేజ్ రిజర్వు చేస్తేనే ఆయా పార్టీలకు గుర్తింపు కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ నిబంధన విధిస్తే తప్ప ఇది సాధ్యమయ్యేలా లేదు. గిల్ ఫార్ములా సిఫారసు చేసింది ఇదే. అదే సమయంలో మహిళను ఇంటికే పరిమితం చేసే ఆలోచన సమాజం నుంచి కూడా దూరం కావాల్సి ఉంది. చదువులోనూ, ఉద్యోగంలోనూ, పనిచేసే చోట ఆడ, మగ అనే తేడా లేకుండా సమాజం నడుచుకున్నప్పుడే మహిళలకు అవకాశాలు వస్తాయి. విద్య, వైద్యం, పోషకాహారం వంటి రంగాలకు సరైన న్యాయం జరగాలన్నా, జీవన ప్రమాణాలు మెరుగుకావాలన్నా  చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ఒక్కటే మార్గం.

:: కంభాలపల్లి కృష్ణ, సీఈవో, వాయిస్​ ఫర్​ తెలంగాణ, ఆంధ్ర (వోటా)