
శివరాత్రి విశిష్టత ఏమిటి ? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు ? జాగారం ఎందుకు చేస్తారు ? ఎప్పుడు ప్రారంభించారు ? శివరాత్రి రోజు ఎందుకు ఉపవాపం ఉండాలో తెలుసుకుందాం. . .!
శివరాత్రి రోజు( ఫిబ్రవరి 26) శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతాయి. హర హర మహాదేవ శంభో అంటూ .. శివలింగానికి అభిషేకం చేస్తుంటారు. పార్వతిపరమేశ్వరుల కళ్యాణం చేస్తుంటారు. శివ కళ్యాణం రాత్రి సమయంలో జరుగుతుంది కాబట్టి ఆ రోజున ( ఫిబ్రవరి 26) రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. శివరాత్రి రోజంతా భక్తి చింనతో గడిపి ... రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యమైనది.
జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది. క్రీస్తుపూర్వం 3 వేల ఏళ్ల క్రితం అనగా సింధులోయ నాగరికత కాలంనుంచి శివుడిని ఆరాధించేవారు. ఆ కాలంలో పరమేశ్వరుడిని పశుపతిగా ఆరాధించి పూజలు చేసేవారు. క్రీస్తుపూర్వం 1500-1200 కాలంలో రుగ్వేదంలో మహారుద్రుడి పేరిట శివుని ప్రస్తావన వచ్చిందని వేదాలు ద్వారా తెలుస్తుంది.
క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల్లో శివరాత్రి ప్రాముఖ్యత గురించి వివరించారు. హాలాహలం మింగిన పరమేశ్వరుడికి .... దేవతలు ఆయన కంఠంపై నీళ్లతో అభిషేకం చేస్తుండగా.. మాఘమాసం.. కృష్ణ పక్షం చతుర్దశి రోజున స్పృహలోకి వచ్చాడని.. ఆయన 14 లోకాలను కాపాడినందుకు.. పార్వతీదేవితో కళ్యాణం జరిపించారని.. ఆ పెళ్లికి శివుడి కోరిక మేరకు సకల జీవరాశిని ఆహ్వానించారని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉందని వేదాలు చెబుతున్నాయి. ఇక ఆరోజు నుంచి ప్రతి ఏడాది మాఘమాసం కృష్ణపక్షం.. చతుర్దశి రోజున పరమేశ్వరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.
ALSO READ | Mahashivratri 2025 : శివుడు పెళ్లికి దేవతలే కాదు.. దయ్యాలు, పిశాచాలూ కూడా వచ్చాయి..!
ప్రస్తుతం శివాలయాల్లో ఆచరించే పూజా విధానాలు.. పద్దతులు..శివరాత్రి విశిష్టత.. మొదలైనవి క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమైనాయని ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది. శివ సంబంధ పూజలు శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం జరుగుతున్నాయి.
శివారాధనలో లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి జీవి హృదయంలోనూ శివుడు జ్యోతి స్వరూపం వెలుగుతూ ఉంటాడని నమ్ముతుంటారు. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు.
జాగరణ అంటే ఊరికే మేల్కొని ఉండడం కాదు...భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండటమే జాగరణ. భగవంతుడిని తలుచుకుంటూ మేల్కొని ఉండాలి కానీ భౌతికంగా మేల్కొని ఉంటూ ఏవేవో కాలక్షేపాలు చేయడం కాదు. రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి..పగలంతా ఆయన రాకకోసం వేచిచూస్తూ..పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేదుకే ఉపవాసం, జాగరణ చేస్తారు.
మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతోమంది తమ పాపాలను అధిగమించి, పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణాలు ఇతిహాసాలలో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా, శివయ్య అనుగ్రహం పుష్కలంగా ఉండే పర్వదినంగా జరుపుకుంటారు.