టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ధోనీ, కోహ్లీ, సచిన్ లాంటి దిగ్గజాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఫ్యాన్స్ కోపానికి కారణమవుతారు. వీటిలో కొన్ని నిజాలున్నప్పటికీ మరికొన్ని వివాదాలకు కారణమవుతూ ఉంటాయి. తాజాగా గంభీర్ గతంలో తనకు జరిగిన ఒక అన్యాయం గురించి చెప్పుకొచ్చారు. భారత ఓటములకు ధోనీ, కోహ్లీని కాకుండా తనకు శిక్ష విధించారని గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
గంభీర్ మాట్లాడుతూ..2011 లో భారత్ వరల్డ్ గెలిచిన తర్వాత మేము ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెళ్లామని.. అక్కడ ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టు 0-4 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఆ సమయంలో భారత వైస్ కెప్టెన్ గా నేను ఉన్నాను. ధోనీ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లోనూ విఫలమయ్యాడని ఈ మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చారు.
"2012 కామన్ వెల్త్ బ్యాంక్ సిరీస్ ఫైనల్ సమయంలో ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. కృష్ణమాచారి శ్రీకాంత్ ఆధ్వర్యంలోని సెలెక్టర్లలో ఒకరైన మొహిందర్ అమర్‌నాథ్, ధోనీని టెస్ట్ కెప్టెన్‌గా తొలగించాలని భావించారు, అయితే అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ కారణంగా అలా చేయలేకపోయారు. ఈ దశలో ధోనీని కెప్టెన్ నుండి తొలగించకుండా నన్ను వైస్ కెప్టెన్ నుంచి తొలగించారు. నా స్థానంలో కోహ్లీని వైస్ కెప్టెన్ గా నియమించారు. ఈ విషయం నేను ఎక్కడా చర్చించలేదు.." అని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
— SUPRVIRAT (@ishantraj51) December 9, 2023