కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడో ?.. బల్దియా సమావేశంపై మేయర్ సైలెంట్

కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడో ?.. బల్దియా సమావేశంపై మేయర్ సైలెంట్
  • 3 నెలలకోసారి పెట్టాల్సి ఉన్నా..ఆర్నేళ్లుగా ఏర్పాటు చేయలేదు
  • గత నవంబర్ లోనే జరగాల్సినా..అసెంబ్లీ ఎన్నికల కోడ్ తో వాయిదా
  • కౌన్సిల్ ఏర్పాటుపై సభ్యుల డిమాండ్

హైదరాబాద్, వెలుగు : బల్దియా కౌన్సిల్​మీటింగ్ ఎప్పుడు నిర్వహిస్తరనే దానిపై క్లారిటీ లేదు.  మేయర్, అధికారులెవరూ నోరు విప్పడంలేదు. ఆఫీసర్లు హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ మేయర్ మాత్రం స్పందించడంలేదని సమాచారం. ప్రతి 3 నెలలకోసారి మీటింగ్ నిర్వహించాలి. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడే టైమ్ కూడా లేకపోవడంతో చర్చకు రావడంలేదు. ప్రస్తుత కౌన్సిల్ ఏర్పడి మూడేళ్లు కావస్తుంది.  ఇప్పటి వరకు కేవలం 7 మీటింగ్ లు మాత్రమే జరిగాయి. తొలిసారి వర్చువల్​గా నిర్వహించారు. మిగతా ఆరు హాల్ లో ఏర్పాటు చేయగా.. వాటిని వాకౌట్ చేశారు. ఇక ఐదు సమావేశాల్లో ప్రజా సమస్యలపై పెద్దగా చర్చకు రాకుండానే వాయిదా పడ్డాయి.  ఏ మీటింగ్ లోనూ ప్రజల  ఇబ్బందులపై చర్చించేందుకు కార్పొరేటర్లకు పెద్దగా చాన్స్ రాలేదు.  ఏడో  కౌన్సిల్ సమావేశం జరిగి ఆరు నెలలు కావస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలతో నిర్వహించలేదని చెబుతుండగా... కొత్త ప్రభుత్వం వచ్చి రెండునెలలు కావస్తున్నా ఇంకా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడంలేదు. వచ్చేనెలలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడనేదానిపైనే కార్పొరేటర్లు మేయర్ తో పాటు అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు.  

గత మీటింగ్ లతో పోల్చితే..

మూడు నెలలకోసారి మీటింగ్ లను క్రమం తప్పకుండా నిర్వహిస్తే ఇప్పటికే 12 మీటింగ్ లు జరిగేవి. కానీ మూడేళ్లలో  ఏడు సార్లు మాత్రమే  జరిగాయి. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ డివిజన్ లోని సమస్యలపైనే చర్చించేందుకు ముందురావడంలేదు.  దీంతో గ్రేటర్ లోని ప్రాబ్లమ్స్ పై చర్చ లేకుండాపోతుంది. మొన్నటివరకు బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉంది. ఇటు బల్దియాలో కూడా బీఆర్ఎస్​ అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటివరకు ఉన్న కౌన్సిల్ మీటింగ్ లతో  పోలిస్తే నిర్వహించబోయే సమావేశంపై చాలా ఆసక్తి ఉండనుంది. మొన్నటి వరకు ఏ ప్రశ్నలు అడిగినా  సరైన సమాధానాలు లేకుండానే దాటవేశారు. ఇప్పుడు మీటింగ్ ఎలా ఉంటుందనే దానిపై కూడా ఇంట్రెస్ట్ పెరిగింది.  

సభ్యులు డిమాండ్ చేస్తున్నా..​

కౌన్సిల్ మీటింగ్​వెంటనే పెట్టాలని మరోవైపు కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించాలని పలుమార్లు ప్రతిపక్ష సభ్యులు హెడ్డాఫీసును ముట్టడించి మేయర్ చాంబర్ ను సైతం ధ్వంసం చేశారు. అయినప్పటికీ రెగ్యులర్ గా  మీటింగ్ లు ఏర్పాటు చేయడంలేదు. త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలంటూ  కార్పొరేటర్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు అధికారులను డిమాండ్ చేశారు.  అయినా కౌన్సిల్ ఏర్పాటుపై ఎలాంటి స్పందన రావడంలేదు. ప్రధానంగా కౌన్సిల్ మీటింగ్ నిర్వహణపై మేయర్ సైలెంట్ గా ఉన్నట్లు తెలిసింది.