గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు? 

గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు? 
  • గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు? 
  • నిరుడు జూన్ లో 9 వేల పోస్టులకు, 
  • పోయిన నెల 1,900 పోస్టులకు క్లియరెన్స్ 
  • అయినా విడుదల కాని నోటిఫికేషన్ 
  • ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో ఆలస్యం  
  • నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపులు   

హైదరాబాద్, వెలుగు:   గురుకులాల్లో ఖాళీల భర్తీకి సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. నిరుడు జూన్​లోనే 9 వేలకు పైగా పోస్టులకు క్లియరెన్స్ ఇచ్చినా.. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ కాలేదు. మరిన్ని గురుకుల పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ అనుమతి వస్తుందంటూ అధికారులు కాలయాపన చేశారు. చివరికి గత నెలాఖరులో మరో 1,900  పోస్టుల వరకూ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అయినా, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) నోటిఫికేషన్ ఇవ్వలేదు. తాజాగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్ని సాకుగా చూపిస్తూ నోటిఫికేషన్ ను మరింత ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చేందుకు బోర్డుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వకపోవడమే అసలు కారణమని సమాచారం. 

గురుకులాల్లో12 వేల పోస్టులను భర్తీ చేస్తామని నిరుడు మార్చిలో  సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా 9,096 పోస్టుల భర్తీకి జూన్​లోనే ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. వీటిలో బీసీ గురుకులాల పరిధిలో 3,870, ఎస్టీ గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267, మైనార్టీ గురుకులాల్లో 1,445 పోస్టులున్నాయి. వీటిని టీఆర్ఈఐఆర్బీ ద్వారా భర్తీ చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. అయితే ఆయా పోస్టులకు టీఆర్ఈఐఆర్బీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కొత్త గురుకులాల్లోని కొన్ని పోస్టులనూ యాడ్ చేస్తారని, అన్నింటికీ కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సర్కారు పెద్దలు చెప్తూ వచ్చారు. ఇలా ఒకటీ, రెండు నెలలు కాదు ఏకంగా 8 నెలల వరకూ కాలయాపన చేశారు. చివరికి పోయిన నెల చివర్లో1900 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంట్లో బీసీ గురుకులాలతో పాటు సొసైటీ గురుకులాల పోస్టులున్నాయి. ఈ పోస్టులకు డిసెంబర్ నెలాఖరులో, జనవరి ఫస్ట్ వీక్​లో అనుమతి వస్తుందని.. ఆ వెంటనే నోటిఫికేషన్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చినా.. రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వలేదు.  తాజాగా మరో 2 వేల పోస్టులను కలిపే యోచనలో సర్కారు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే నోటిఫికేషన్ రిలీజ్ కు మరింత టైమ్ పట్టే అవకాశముంది.  

సర్కారు పర్మిషన్ ఇవ్వనందుకేనా..  

నిరుడు జూన్​లో ప్రభుత్వం అనుమతించిన 9 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని రిక్రూట్మెంట్ బోర్డు ప్రయత్నించింది. సర్కారు పెద్దలను పర్మిషన్ కోరగా, కొత్తగా వచ్చే పోస్టులతో కలిపి ఒకేసారి ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. జనవరి నెలాఖరులో మిగిలిన పోస్టులకూ ఫైనాన్స్ పర్మిషన్ రావడంతో, మరోసారి నోటిఫికేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ, వివిధ కారణాలతో సర్కారే ఆలస్యం చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండోవారంలో రిలీజ్ అయింది. దీంతో ఎలెక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం దీన్ని సాకుగా చూపించి నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు మూడు ఉమ్మడి జిల్లాల్లోనే ఉన్నాయని, ఆయా పోస్టులకు ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చినందున ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 

ఎన్నికల కోడ్ ముగిశాకే..

 
గురుకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.  

- మల్లయ్యబట్టు, కన్వీనర్, టీఆర్ఈఐఆర్బీ