
కేరళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓనం పండుగ ఆదివారం ( ఆగస్టు20) ప్రారంభం కానుంది. తొలిరోజున అత్తమ్‌తో ప్రారంభమై.. పదో రోజున తిరుఓనమ్‌తో ముగిసే ఈ పండుగ ప్రాముఖ్యత, శుభముహుర్తం, విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగల్లో ఓనమ్ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. రైతులు తాము పండించిన పంట కోతకు రావడంతో అందుకు ఆనందపడుతూ చేసుకునే పండగ ఇది. పురాణాల ప్రకారం.. 10 రోజుల ఓనమ్ పండగను గొప్ప మహా రాజైన మహాబలిని ఆహ్వానించే సంజ్ఞగా జరుపుకుంటారు. ఓనమ్ సందర్భంగా ఆ గొప్ప రాజుకు చెందిన ఆత్మ ఆ రాష్ట్రానికి వస్తుందని వాళ్ల నమ్మకం.
ఓనం వేడుకల్లో భాగంగా తొలిరోజును అతమ్‌గా.. చివరి రోజున తిరు ఓనమ్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు చాలా కీలకమైనవిగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఆగస్టు20 న ఓనం పండుగను అతమ్ తో ప్రారంభించి ... ఆగస్టు 31వ తేదీన తిరు ఓనం వేడుకలను జరుపుకోనున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం ఓనం పండుగ సమయంలో సొంతూళ్లకు చేరుకుంటారు. అందుకే మలయాళీలకు ఈ పండగ అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు ఈ సమయంలోనే పడవ పందేలు కూడా జరుగుతాయి. ఈ పండుగ మళయాలీలతో పాటు అన్ని మతాలకు చెందిన వారు జరుపుకోవడం విశేషం. 10 రోజుల ఈ పండగలో ఈ రెండు రోజులను మాత్రం కేరళ ప్రజలు చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తారు. ఈ పండగ సందర్భంగా కేరళ ప్రజలు పది రోజుల పాటు వారసత్వంగా వారికి వచ్చిన గొప్ప సంప్రదాయాలను ప్రతిబింభించేలా, అవి ప్రపంచానికి తెలిసేలా ఎంతోఅద్భుతంగా జరుపుకుంటారు. అంత బాగా జరుపుకుంటారు. 1961 లో ఈ పండగను కేరళ జాతీయ పండగగా గుర్తించారు.
ఓనం వేడుకల్లో..
ఓనమ్ పండుగ రోజు ప్రతి ఒక్కరూ వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించి సమీపంలోని గుడికి వెళ్లి దైవదర్శనాన్ని చేసుకుంటారు. తొలి సంధ్య వేళకే ఇంటి ముందు పూక్కాలమ్ రెడీ అవుతుంది. అమ్మాయిలు పోటీపడి మరి రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. చిన్నపిల్లలు పూల రంగవల్లికలకు కాపలా ఉంటారు. ఓనమ్ చీరలతో తిరుగాడే అమ్మాయిలే దర్శనమిస్తారు. ఓనమ్ పాటలే వినిపిస్తుంటాయి. పండగకు అర్థం ఓనమ్‌ను చూస్తే తెలిసిపోతుంది. యువకులు శారీరక శ్రమనిచ్చే ఆటలు ఆడతారు. పెద్దవారు మాత్రం ఇంట్లోనే ఉంటూ చదరంగం, పులిజూదం లాంటి ఆటలు ఆడుకుంటారు. విలువిద్య పోటీలు, కత్తియుద్ధాల వంటి క్రీడలు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. కబడ్డీ ఆటను కూడా మలయాళీలు ఇష్టంగా ఆడతారు.
తిరుఓనం పండుగ వేళ మహాబలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ, ఇళ్ల ముందు కల్లాపి చల్లి, రంగు రంగుల పువ్వులతో అందంగా ముగ్గులను వేస్తారు. వీటిని పూగళమ్ అంటారు. ఇదే సమయంలో బంగారం రంగు అంచు ఉండే తెల్లని చీరలను ధరిస్తారు. ముగ్గుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడి మైమరచిపోతూ.. జానపద కళల్లో కలై, తుంబి తుల్లల్లు ముఖ్యమైనవి.
ఎందుకు జరుపుకుంటారు
మహా బలిని ఆహ్వానిస్తూ పది రోజుల పాటూ జరుపుకునే పండుగ ఇది. చరిత్ర ప్రకారం మహాబలి పాలించిన సమయం మళయాలీలకు స్వర్ణ యుగంతో సమానం. బలిచక్రవర్తి పాలనలో రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్థిల్లారని చెబుతారు. అందుకే రాక్షస రాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని గౌరవించేవారు. బలిచక్రవర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పదిరోజుల పాటూ మహాబలిని పాతళలోకం నుంచి భూమ్మీదకు అహ్వానిస్తూ జరుపుకునే పండుగే ఓనం. ఇదే వేడుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు.
ఎవరీ మహాబలి
ఇంతకీ మహాబలి అంటే ఎవరోకాదు బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు మహా భక్తుడైన ప్రహ్లాదుడి మనవడే బలిచక్రవర్తి. ప్రహ్లాదుడి ఒడిలో విద్యాబుద్ధులు నేర్చుకున్న మహాబలి కూడా గొప్ప విష్ణుభక్తుడిగా పెరిగాడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అంతట విష్ణుమూర్తి తాను అదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా అదితి గర్భాన వామనుడిగా జన్మించిన విష్ణుమూర్తి..బలి దగ్గరకు వెళతాడు.
ప్రాచీన వేడుకలు..
ఓనం సందర్భంగా శాస్త్రీయ వాయిద్య పరికరాలను వాయిస్తుండగా.. పులి వేషాలు ధరించి డప్పు వాయిద్యాలు, డ్యాన్సులు ఓనం పండుగలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీటిని మళయాలీలు పులిక్కలి అంటారు. దీనికి భారతదేశంలో అతి ప్రాచీన వేడుకగా దీనికి పేరుంది. త్రిస్సూర్‌లో ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తూ పులి వేషం ధరించిన వారికి బహుమతులు ప్రదానం చేస్తుంటారు. అంతేకాదు ఓనం పండుగలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అందంగా ముస్తాబై యువత ఓనం పాటలు పడుతూ.. ఎత్తైన కొమ్మ మీద తాడు వేసి ఊయల కట్టి అందులో కూర్చొని ఒకరికొకరు ఊపుకుంటూ ఆనందంగా వేడుకలను జరుపుకుంటారు.
త్రివిక్రముడికి పూజలు..
ఓనం పండుగ వేళ కేరళలోని త్రిక్కకరలో ఉండే వామనమూర్తి దేవాలయంలో త్రివిక్రముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మళయాలంలో త్రిక్కకర అప్పన్ అంటే వామనుడు. ఆ దేవుని విగ్రహాలను ఓనం రోజుల్లో ఇళ్లలో ప్రతిష్టించి ఆరాధిస్తారు.
కేరళలో ఓనం పండుగ ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ పండగను కేరళ ప్రజలు దాదాపు పది రోజులపాటు జరుపుకుంటారు. ఈ పండగలో భాగంగా వివిధ దేవతలను కూడా పూజిస్తారు. అంతేకాకుండా పడవలను పూలతో చక్కగా అలంకరించి.. వాటికి రంగులు కూడా వేస్తారు. ముఖ్యంగా ఓనం పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కేరళ ప్రజలంతా వివిధ రకాల ఆహారాలను వండుకొని తింటారు. అయితే ఈ పండగ రోజున కేరళ ప్రాంతీయులు కేవలం కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అందులో ఎంతో ప్రసిద్ధి చెందిన పలు వంటకాలు ఉంటాయి.
విందు భోజనాలు..
ఓనం పండుగలో చివరి రోజున తిరుఓనం సందర్భంగా పచ్చని ఆకులో 20 రకాల వంటకాలతో, పాలు, చక్కెరతో చేసిన పాయసాన్ని ‘ఓన సధ్య’ను సామూహికంగా తీసుకుంటారు. వీటితో పాటు సాంప్రదాయక ఊరగాయలు, అప్పడాలతో పాటు ఇతర భారతీయ సాంప్రదాయ భారతీయ పిండి వంటలను కూడా తింటారు