ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ రిక్రూట్మెంట్ఎప్పుడు?
ఆరేండ్లలో నింపింది 804 పోస్టులే
రాష్ట్రవ్యాప్తంగా 13 వేల పోస్టుల దాకా పెండింగ్
ఈ ఏడాది ఎక్స్‌టెన్షన్ జీవో కూడా ఇయ్యని సర్కారు
జీవోలు ఇచ్చినా భర్తీ మాత్రం చేస్తలేరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను పట్టించుకోవడం లేదు. వేల సంఖ్యలో పోస్టులు పెండింగ్‌లో ఉన్నా భర్తీపై దృష్టి సారించడం లేదు. 13 వేలకుపైగా బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండగా.. ఈ ఆరేండ్లలో ఎనిమిది వందల పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఇన్ని ఖాళీలు ఉన్నా ఏటా రిక్రూట్‌మెంట్ ఎక్స్‌టెన్షన్ జీవో రిలీజ్ చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఈసారి అయితే ఎక్స్‌టెన్షన్ జీవో కూడా రిలీజ్ చేయలేదు. జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ రిక్రూట్‌మెంట్ కోసం నియమించాల్సిన కమిటీలు పత్తా లేకుండా పోయాయి.
హెచ్‌వోడీల్లోనే ఆరువేలకుపైగా ఖాళీలు
ఏవైనా డిపార్ట్‌మెంట్లలో ఎస్సీ, ఎస్టీల పోస్టులు భర్తీ కాకుండా మిగిలితే.. తర్వాత ఎస్సీ, ఎస్టీలతోనే రిక్రూట్ చేయాలి. ఇతరులతో భర్తీ చేయడానికి ఉండదు. ఆ పోస్టుల రిక్రూట్‌మెంట్ ఎక్స్‌టెన్షన్ కోసం జీవో రిలీజ్ ఇవ్వాలి. వీటినే బ్యాక్‌లాగ్ పోస్టులు అంటారు. వీటి భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ అవసరం ఉండదు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేదా రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేయొచ్చు. రాష్ట్రంటైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు హెచ్‌వోడీల్లో 7,188 ఎస్సీ, ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా మిగిలాయి. ఇందులో ఆరేండ్లలో 804 పోస్టులను భర్తీ చేశారు. మిగతా 6,384 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూన్ నుంచి ఇప్పటిదాకా మరో 2 వేలకుపైగా పోస్టులు ఖాళీ అయినట్టు అంచనా.
జిల్లాల్లో మరో ఆరున్నర వేలు..
జిల్లాల్లోనైతే ఈ పోస్టుల భర్తీ మరింత దారుణంగా ఉంది. ఒక్కో జిల్లాలో 200వరకు బ్యాక్‌లాగ్ పోస్టులు ఉంటాయని, రాష్ట్రవ్యాప్తంగా 6,500కుపైగా ఉంటాయని అధికారుల అంచనా.
రిక్రూట్‌మెంట్ ఎక్స్‌టెన్షన్ కూడా ఇయ్యలే..
డిపార్ట్‌మెంట్ల వారీగా బ్యాక్‌లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. ఉమ్మడి ఏపీలో 2012 డిసెంబర్ 31 నుంచి 2016 జూన్ 30 వరకు బ్యాక్‌లాగ్ పోస్టులను ఎక్స్‌టెన్షన్ చేయగా.. తర్వాత 2017, 2018లో ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. ఈ గడువు ఈ ఏడాది జూన్ 30తోనే ముగిసింది. కానీ సర్కారు మళ్లీ ఎక్స్‌టెన్షన్ జీవో ఇవ్వలేదు. అసలు ఉమ్మడి ఏపీలో బ్యాక్‌లాగ్‌లు ఉంటే.. కొద్దిరోజుల్లోనే భర్తీ చేసేవారని, తెలంగాణ వచ్చాక జీవోలు కూడా ఇవ్వడం లేదని ఎస్సీ, ఎస్టీ సంఘాలు మండిపడుతున్నాయి.
జాడ లేని కమిటీలు
జిల్లా ఆఫీసుల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి కమిటీలు ఉంటాయి. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా, కొందరు అధికారులు మెంబర్లుగా ఉంటారు. జిల్లాలో మొత్తం ఎన్ని బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని నింపారు, ఇంకా ఎన్ని నింపాలన్నది కమిటీ సమావేశమై చర్చించాలి. ఖాళీలను నిర్ణీత సమయంలో భర్తీ చేయాలి. కానీ ఏ జిల్లాలో ఈ కమిటీలే నియమించలేదు.
కావాలనే పెండింగ్‌లో పెడ్తున్నరు
ఎస్సీ, ఎస్టీలపై వివక్ష, నిర్లక్ష్యంతో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఏం చేయకున్నా నడుస్తోందన్న ధోరణితో సర్కారు, ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. పోస్టులన్నీ పెండింగ్‌లో పెట్టి.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. ఈ ఏడాది గడువు ముగిసినా రిక్రూట్‌మెంట్ ఎక్స్‌టెన్షన్ జీవో రిలీజ్ చేయకపోవడం సరికాదు. ఇట్లా ఎస్సీ, ఎస్టీలపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే కేసులు కూడా పెట్టొచ్చు. సర్కారు వెంటనే బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి.
– బత్తుల రాంప్రసాద్, మాల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్
For More News..