బీసీ కుల గణన ఇంకెన్నడు?

ఎవరి కుల దామాషా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. దేశంలో బీసీల జనాభా 70 కోట్లు, మొత్తం జనాభాలో ఇది 56% అని అంచనా. 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్లు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయి. కులాల లెక్కల తోనే బీసీల అసలు జనాభా తెలుస్తుంది.  కులగణన చేపట్టాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పదేండ్లకోసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా..అందులో దళితులు, ఆదివాసీల సంఖ్య పైన మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే జనాభాలో ఓబీసీ తో పాటు ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు.

సమగ్ర గణనతోనే  సమన్యాయం

75 ఏండ్ల స్వాతంత్ర్య చరిత్రలో బీసీల జనాభా గణనలోకి తీసుకోలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. కుల గణనతో లాభాలేంటి అనే విషయాన్ని ఆలోచిస్తే.. వెనుకబడిన మెజార్టీ ప్రజలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయవచ్చు. జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు.దీంతో పేదలు, వెనుకబడిన వర్గాల వారికి స్వాంతన చేకూరుతుంది. సంక్షేమం పేరిట ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసాకు లెక్క తేలి, పథకాల అమలులో  పారదర్శకత పెరుగుతుంది.

కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనాపరంగా కష్టమని తెలిపింది. అది దేశంలో 70 కోట్లకు  పైగా ఉన్న ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే. దేశంలో 1931లో చేసిన జనాభా లెక్కలే సంపూర్ణంగా కులగణనలతో చేసిన సమగ్ర లెక్కలుగా ఉన్నాయి. ప్రస్తుతం కులాల వారి జన గణన ఒక్కటే పరిష్కార మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలకతీతంగా పలువురు రాజకీయ నేతలు కూడా కులగణనకు డిమాండ్ చేస్తున్నారు. భారతదేశం మూడు రకాల రాజ్యాంగాన్ని చూసింది. అవి మనుధర్మ శాస్త్ర ప్రకారం రాసిన మను రాజ్యాంగం, ఆ తర్వాత బ్రిటిష్ పరిపాలన జరుగుతున్నప్పుడు నడిచిన బ్రిటిష్- ఇండియా రాజ్యాంగం, ఇపుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత దేశ ప్రజల క్షేమాన్ని కోరి  తన సొంత అనుభవాల నుంచి తయారు చేసిన రాజ్యాంగాన్ని  మనం అనుభవిస్తున్నాం.  

ఒకసారి రిజర్వేషన్ల చరిత్రలోకి  వెళితే మొట్టమొదటగా 1884లో మహాత్మ జ్యోతిబాపూలే..   అన్ని రంగాల్లో బ్రాహ్మణులు ఆధిపత్యంలో ఉన్నారు, మిగతా నిమ్న వర్గాలు అభివృద్ధిలోకి రావాలంటే రిజర్వేషన్లు ఇవ్వాలి అని  ‘హంటర్ కమిషన్’ కి  ఒక నివేదికను సమర్పించారు. వారి సుదీర్ఘ ఉద్యమ ఫలితంతో 1902 లో కొల్హాపూర్ సంస్థాన సాహు మహారాజ్ బ్రాహ్మణేతరులకు 50% రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయం తీసుకుని రిజర్వేషన్ల పితామహుడిగా నిలిచాడు సాహు మహారాజ్. 19 24 లో తమిళనాడులో ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేశాక అక్కడ రిజర్వేషన్లు అమలు చేశారు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లు కొట్టివేయడం జరిగింది. వెనువెంటనే తమిళనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు రావడంతో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్ పెట్టి తమిళనాడులో 69% రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. 1935లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండాలని బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ప్రతిపాదన చేయడం జరిగింది. 

అనేక కమిషన్లు చెప్పినా..

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగాలని అనేక కమిషన్లు చెప్పినప్పటికీ జనాభా కులగణన సమగ్రంగా లేదని చెప్పి కోర్టులో నిలబడలేదు. భారతదేశానికి సంబంధించి 1950లో 44 సిఫార్సులతో రిజర్వేషన్లను అమలు చేయాలని వచ్చిన గొప్ప కమిషన్ మండల్ కమిషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీసీలకు 44 శాతం రిజర్వేషన్ ఉండాలని  మురళీధర్ రావు కమిషన్ .  అసలు మండల్ కమిషన్​ సిఫార్సులను ఉన్నదున్నట్టుగా అమలు చేస్తే ఈదేశంలో ఏ ఒక్క ఉద్యమానికి అవసరం ఉండదు. కానీ అప్పుడు మండల్​ కమిషన్ ప్రతిపాదించిన 44 సిఫారసుల్లో ఒక్కదాన్ని అప్పటి ప్రధానమంత్రి వీ.పీ .సింగ్ అమలు చేయడానికి ప్రయత్నిస్తే, కొందరు కోర్టులను ఆశ్రయించారు. దాంతో సమగ్రమైన కులగణన లేదు కాబట్టి రిజర్వేషన్లు నిలబడలేవు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఇందులో కోర్టు ల తప్పు కూడా ఏమి లేదు, కోర్టులు ఏమంటున్నాయంటే   సైంటిఫిక్ కులగణనలేదు కాబట్టి మేము కోర్టుపరంగా ఆర్డర్ ఇవ్వలేమని చాలా స్పష్టంగా తెలుపుతున్నాయి.  చట్టానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లు 50 శాతం దాటి ఉండొద్దు అంటున్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 10 శాతం ఈ బీసీ రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు, కానీ జనాభా దామాషా ప్రకారం కులగణన జరిపి మేమెంతో మాకంత అనే ప్రాథమిక సూత్రాన్ని భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు పాటించడం లేదు.  75 ఏండ్లలో జనాభా ఎంతో పెరిగింది. రాజకీయ పార్టీలు  తమ ఓటు బ్యాంకుల కోసం ఎన్నో కులాలను బీసీల్లో కలిపారు. కానీ బీసీల రిజర్వేషన్లను మాత్రం పెంచలేదు. దేశంలో 56 శాతం ఉన్న బీసీలు కేవలం 27శాతం రిజర్వేషన్లు పొందడమే సామాజిక అన్యాయానికి తార్కాణం.  ఒక ప్రణాళిక ప్రకారం ఆధిపత్య శక్తులు కుల గణనకు అడ్డుపడుతున్నాయా?  దేశంలోని రాజకీయ పార్టీలే దీనికి జవాబుదారీ కావాలి. కాబట్టి దేశ వ్యాప్తంగా బీసీల్లో రాజకీయ చైతన్యం పెరుగుతున్నది. దాని ప్రభావం పార్టీల పాపులారిటీలకు పరీక్ష కాకతప్పదు. కాబట్టి పార్లమెంటులోని ప్రతి రాజకీయ పార్టీ ఈ దిశగా ఆలోచించక తప్పని పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతాయి తప్ప తగ్గవు.

బీసీ నేతలు చొరవ తీసుకోవాలి

ఎంతోమంది దేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు,  జాతీయ స్థాయిలో బీసీ నాయకులున్నారు, అందరూ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.    75 ఏండ్లలో  ఒక బీసీ ప్రధానమంత్రి భారత దేశ పగ్గాలు చేపట్టారు. ఈ శుభ సమయంలో అనేక సంచలన సంస్కరణలు తీసుకొస్తున్న  ప్రధానమంత్రి మోడీ  బీసీల కులగణన అంశాన్ని సెన్సెస్ లో చేర్చి తన సత్తాను చాటుకుంటారని దేశంలోని బీసీ ప్రజలందరూ ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు బీసీ గణన చేసి దామాషా  ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలపడం సంతోషకరం.  అదే పద్దతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​అలాగే ఏపీ సీఎం  జగన్మోహన్​రెడ్డి  కూడా బీసీల లెక్కలు చేసి వారి వారి రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలుకై ప్రయత్నిస్తారని ఆశిద్దాం. 

–డాక్టర్ పరికిపండ్ల అశోక్, సోషల్ ఎనలిస్ట్