- ఏడేండ్లుగా భర్తీకాని డైరెక్ట్ క్లరికల్, మైనింగ్ పోస్టులు
- యాక్టింగ్ క్లర్క్‌లకు ఇంకా మజ్దూర్ జీతాలే
మందమర్రి, వెలుగు: సింగరేణిలో ప్రతి ఏటా కార్మికుల సంఖ్య తగ్గిపోతుండగా.. ఖాళీలను మాత్రం భర్తీ చేయడం లేదు. దాంతో ఉన్నవారిపైనే పని భారం పడుతోంది. సింగరేణి వ్యాప్తంగా కీలక కేటగిరిల్లో సుమారు 4 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్ నియామకాలు చేయని సింగరేణి యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న కారుణ్య నియామకాల ద్వారా వారసులకు జాబ్ కల్పిస్తూ వాటినే కొత్త ఉద్యోగాలుగా చెబుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా 3,498 మందికి ఉద్యోగాలు కల్పించగా కారుణ్యం ద్వారా 12,553 మంది సింగరేణిలో చేరారు.
-క్లర్కుల భర్తీ ఎప్పుడో..
సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులు, మ్యాన్‌వే, జీఎం ఆఫీస్‌లు, మ్యాగ్జిన్, వేబ్రిడ్జి, పే షీట్, వెల్ఫేర్, స్టోర్స్, బిల్స్, పర్చేజ్, ఆర్డర్స్, కో ఆర్డినేషన్స్, సెటిల్మెంట్లు, అడిట్, జీతభత్యాలు, ప్రమోషన్లు, సర్వీసు తదితర రంగాల్లో 1,600 మంది క్లర్కులు పని చేస్తున్నారు. సీనియర్ క్లర్కులు చాలామంది ఇటీవల రిటైర్‌అయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోకపోవడంతో ఇద్దరు, ముగ్గురు చేయాల్సిన పనులు ఒక్కరే చేయాల్సి వస్తోంది. సుమారు 1,200 మంది వరకు క్లర్కుల కొరత ఉంది. చాలామంది క్లర్క్‌లు 30 నుంచి 40 ఏళ్ల కిందట నియమితులైనవారు ఉన్నారు. వీరికి కంప్యూటర్లపై పూర్తి అవగాహన లేదు. డిప్యుటేషన్‌పై డ్యూటీ చేస్తున్న సిబ్బందికి పని విధానం తెలియకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నత చదువులు చదివి, కంప్యూటర్‌పై అవగాహన కలిగిన 1000 మందికిపైగా జనరల్ మజ్దూర్ కార్మికులను యాక్టింగ్ క్లర్కులుగా ఉపయోగించుకుంటున్నారు. గత ఏడాది మరో 177 మంది ఎక్స్టర్నల్ క్లర్కులను మార్చి నెలలోగా నియమిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆ ఊసే లేదు. యాక్టింగ్ క్లర్కులుగా చేస్తున్నవారికి మజ్దూర్ జీతమే చెల్లిస్తున్నారు. పర్మినెంట్ క్లర్క్‌కు రూ.29 వేల బేసిక్ వస్తే యాక్టింగ్ క్లర్క్‌కు రూ.18 వేలు దాటడం లేదు.
-ఏళ్లుగా సూపర్వైజర్ల పోస్టులు ఖాళీ
బొగ్గు గనుల్లో ఉత్పత్తి ప్రక్రియ, సేఫ్టీ పూర్తిగా మైనింగ్సూపర్వైజర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సింగరేణిలో 24 అండర్‌గ్రౌండ్ మైన్లు, 20 ఓసీపీలున్నాయి. గనుల్లో ఒక్కో పనిస్థలంలో షార్ట్‌ఫైరర్, సర్దార్, ఓవర్‌మెన్ ఉంటేనే అక్కడ పనులు నిర్వహించాల్సి ఉంటుంది. గనిలో షిఫ్టుకు కనీసం 10 మంది ఓవర్మెన్లు, 20 మంది సూపర్వైజర్ల చొప్పున రోజుకు మూడు షిప్టుల్లో అవసరముంటుంది. వీరు కార్మికులతో పనులు చేయించడంతో పాటు పనిస్థలంలో ఉత్పత్తి ఎంత వస్తోంది, సేఫ్టీ తదితర అంశాలపై పర్యవేక్షణ చేస్తారు. ఓవర్‌మెన్ రెండు నుంచి మూడు పని స్థలాలను పర్యవేక్షిస్తారు. సర్దార్లు ఒక పనిస్థలంలో సూపర్వైజర్లుగా చేస్తే.. వారికి అసిస్టెంట్లుగా షార్ట్ఫైరర్లు ఉంటారు. సింగరేణి వ్యాప్తంగా 3వేల మంది సూపర్వైజర్ల అవసరముంటుంది. ఏటా ఎంప్లాయీస్ రిటైర్కావడంతో వీరి సంఖ్య కేవలం 900కు పరిమితమైంది. మరో 650 మంది జేఎంఈటీలు ఉన్నారు. సరైన సూపర్వైజింగ్లేక గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడేండ్ల కిందట650 మంది జేఎంఈటీ(మైనింగ్)లను నియమించిన యాజమాన్యం ఇప్పటివరకు మళ్లీ పోస్టులు భర్తీ చేయలేదు.
-ఇంటర్నల్ పోస్టుల భర్తీ రూల్స్‌పై గుర్రు
సింగరేణి యాజమాన్యం తాజాగా 155 ఇంటర్నల్జూనియర్అసిస్టెంట్పోస్టుల భర్తీకి నోటిఫికేషన్జారీ చేసింది. ఇందులో పాతవి 96 పోస్టులు ఉన్నాయి. 96 పోస్టులు పూర్తిగా మహిళలకే కాగా.. మిగిలిన 59 పోస్టుల్లో కూడా 33శాతం ఫిమేల్కు కేటాయించారు. మొత్తంగా 115 పోస్టులు ఫిమేల్ ఎంప్లాయీస్ కు దక్కనున్నాయి. మిగిలిన 42 పోస్టులకు వందల మంది మేల్ఇంటర్నల్ ఎంప్లాయీస్ పోటీ పడాల్సిందే. గతంలో రూల్‌ప్రకారం 5 ఏళ్లు సీనియరిటీ ఉన్నవారికి చాన్స్ ఉంటే ఇప్పుడు 190/240 మస్టర్లు ఉన్న వారికి కూడా అవకాశం ఇచ్చారు. దీని వల్ల సీనియర్లకు తీరని అన్యాయం జరుగుతుందని కార్మికసంఘాలు పేర్కొంటున్నాయి.
అన్ని పోస్టులు భర్తీ చేయాలె
యాక్టింగ్ క్లర్క్‌లుగా చేస్తున్న ఎంప్లాయీస్‌కు వన్టైమ్సెటిల్మెంట్కింద జూనియర్అసిస్టెంట్లుగా చాన్స్ఇవ్వాలె. ఖాళీగా ఉన్న అన్ని ఇంటర్నల్, ఎక్స్టర్నల్ పోస్టులు భర్తీ చేయాలె.
- ఎస్.వెంకటస్వామి, సీఐటీయూ లీడర్