- పీఎస్ హెడ్‌మాస్టర్ పోస్టులు 10 వేలకు పెంచుతామన్న సీఎం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీ ఓట్ల కోసమే హామీలిచ్చారన్న విమర్శలు
హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూళ్ల హెడ్‌మాస్టర్ పోస్టులను 10 వేలకు పెంచుతామని, ఖాళీ హెచ్ఎం పోస్టులను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. సీఎం ప్రకటన చేసి ఏడు నెలలైనా ఇప్పటికీ దానికి అతీగతీ లేకుండా పోయింది. మొదట్లో కొంత హడావుడి కనిపించినా.. ఆ తర్వాత ఈ విషయాన్ని సర్కారు పెద్దలు, ఉన్నతాధికారులు పక్కనపెట్టేశారు. దీంతో హెడ్‌మాస్టర్ పోస్టులు వస్తాయన్న ఆశతో ఉన్న ఎస్జీటీలకు నిరాశే మిగిలింది. మరోపక్క ప్రైమరీ స్కూళ్లలో ఎప్పటిలాగే పర్యవేక్షణ కరువైంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందుకే సీఎం కేసీఆర్ ప్రకటన చేసి, చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
14 వేల బడులకు హెడ్మాస్టర్లు లేరు
రాష్ట్రంలో 18,240 సర్కార్ ప్రైమరీ స్కూళ్లు ఉండగా, వాటిలో 4,429 లో ఫీమేల్ లిటరసీ(ఎల్ఎఫ్ఎల్) హెచ్ఎం పోస్టులు ఉన్నాయి. వీటిలో 2,386 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 2,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు కొత్తగా మరో 5,571 పోస్టులను సర్కారు మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులకు కేవలం డీఈడీ (టీటీసీ) చేసిన వారికి మాత్రమే ప్రమోషన్ ఇస్తున్నారు. మిగిలిన 14 వేల ప్రైమరీ స్కూళ్లలో హెడ్‌మాస్టర్ పోస్టులు లేకపోవడంతో ఆయా స్కూళ్లలో పర్యవేక్షణ లేకుండా పోయింది. మరోవైపు ఈ ఏడాది దాదాపు అన్ని ప్రైమరీ స్కూళ్లలో స్టూడెంట్ల అడ్మిషన్లు పెరగడంతో కొత్త పోస్టుల అవసరం మరింతగా పెరిగింది.
ఎస్జీటీల ఓట్ల కోసమే ప్రకటన?
మార్చిలో సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ప్రైమరీ స్కూళ్లలో హెచ్‌ఎం పోస్టులను పది వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సీఎం ప్రకటనతో ఏయే జిల్లాలు, స్కూళ్లలో పోస్టులు అవసరమనే వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సేకరించారు. వాటితో పాటు కొత్తగా అవసరమయ్యే 5,571 పోస్టుల వివరాలను కూడా ఏప్రిల్ లోనే ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు పంపారు. అప్పటినుంచి ఆ ఫైల్ పెండింగ్లో ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో ఎస్జీటీలంతా ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉండటంతో ఎస్జీటీల ఓట్ల కోసం సీఎం అలా ప్రకటన చేశారని టీచర్లు అంటున్నారు. ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.
ప్రమోషన్లు స్పీడప్ చేయాలె
ఎస్జీటీలకు పదివేల హెచ్ఎం ప్రమోషన్లు కల్పిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. అయినా ఇంతవరకూ ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో ఎస్జీటీలు నిరాశలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైమరీ స్కూళ్ల హెచ్ఎం పోస్టులకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందించి, జీవో ఇవ్వాలి. ఎస్జీటీలకు హెచ్ఎం ప్రమోషన్లు కల్పించాలి.
- ఎండీ ఖమ్రోద్దీన్, ఎస్జీటీఎఫ్ స్టేట్ లీడర్