న్యాయ పాలన తెలుగులో ఎప్పుడు?

‘కమిటీ’ అనే పదానికి తెలుగుపదం కోసం ప్రయత్నించి సరైన పదం దొరక్క మానేసుకున్నాను’ అన్నారు పది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి టి. వినోద్. ‘కమిటీ’ అనే వాడండి సర్ అన్నాను నేను. అదే పని చేశానని ఆయన అన్నారు. కొన్ని పదాలను తర్జుమా చేయకూడదు. అలాగే వాడితే బాగుంటుంది. అనువాదం అన్న పదం తర్జుమాకి బాగానే ఉంటుంది. అలాంటి సులువుగా అనువాదానికి లొంగే పదాలను వాడటం ఆమోదయోగ్యం. కానీ కొన్ని పదాలు తెలుగుదనాన్ని సంతరించుకుంటాయి. అలాంటి పదాలను అనువాదం చేయకూడదు. ఈ సంభాషణ అంతా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా జరిగింది.1992లో జరిగిన సంఘటన ఒకటి కూడా ఈ సందర్భంగా గుర్తుకొచ్చింది. అప్పుడూ ఇలాంటి సందర్భమే వచ్చింది. ఆ కాలంలో నేను ‘ఆంధ్రప్రభ’ ఆదివారం అనుబంధం సంచికలో లీగల్ ​వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. ప్రజలకు బాగా అవసరం అనుకున్న అంశాలను మొదటగా రాశాను. అందులో ముఖ్యమైనవి మోటార్​ వాహన ప్రమాదాలు– నష్ట పరిహారాలు, వినియోగదారుల రక్షణ చట్టం. అప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం బాగా ప్రాచుర్యంలో ఉంది. ఆ చట్టం గురించి రాసిన వ్యాసాలను, తీర్పులను కలిపి పుస్తకంగా వేద్దామని అనుకున్నాను. ఓ కమర్షియల్​ లా పబ్లిషర్​అది ప్రచురించడానికి ముందుకు వచ్చాడు. 

జ్యుడీషియల్ ​అకాడమీ తొలి ప్రచురణ

ఆ బుక్ ​ప్రూఫ్​ రీడింగ్​దశలో ఉండగా ఆ పుస్తక విషయం అప్పటి ఆంధ్రప్రదేశ్​ జ్యుడీషియల్​అకాడమీ డైరెక్టర్​ ఎంఈఎన్​ పాత్రుడి దృష్టికి వెళ్లింది. ఆ పుస్తకాన్ని అకాడమీ మొదటి ప్రచురణగా ప్రచురిద్దామని ఆయన చెప్పారు. నేను సంతోషపడ్డాను. నేనప్పుడు మెట్రోపాలిటన్​ మేజిస్ట్రేట్​గా పని చేస్తున్నాను. ఆ దశలో అది ఓ గొప్ప గౌరవం. ఓ రెండు రోజుల తర్వాత అకాడమీకి నన్ను రమ్మని చెప్పారు. అకాడమీ బోర్డ్​ఆఫ్​గవర్నర్స్​అధ్యక్షులు హైకోర్టు న్యాయమూర్తి ఎంఎన్​రావుని పరిచయం చేస్తామని చెప్పారు. నేను వెళ్లాను. బయట కూర్చున్నాను. డైరెక్టర్​ చాంబర్​లో డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ భవానీ ప్రసాద్, హైకోర్టు న్యాయమూర్తి ఎంఎన్​రావు మాట్లాడుకుంటున్నారు. ‘అకాడమీ’ అన్న పదాన్ని తెలుగులో రాస్తే బాగుంటుందని వాళ్లు చర్చించుకుంటున్నారు. దానికి అనువాదం ‘పరిషత్’ అని వాళ్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు నాకు అనిపించింది. వాళ్ల మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ అనువాదం ఎందుకో నాకు ఏ మాత్రం నచ్చలేదు. సందర్భం వస్తే ఆ విషయం చెప్పాలనుకున్నాను. కాసేపటికి నన్ను లోపలికి పిలిచారు. అకాడమీ అనే పదం తొలగించి పరిషత్​ అన్న పదం పుస్తకంలో వేయండి అని చెప్పారు. ఆ సందర్భాన్ని నేను ఉపయోగించుకున్నాను. అకాడమీని అకాడమీ అంటేనే బాగుంటుంది.. పరిషత్​ అంటే బాగుండదు సార్​ అని అన్నాను. అక్కడితో ఊరుకోకుండా. నా అభిప్రాయానికి బలం చేకూరేలా ‘కేంద్ర సాహిత్య అకాడమీ’, ‘ రాష్ట్ర సాహిత్య అకాడమీ’, ‘తెలుగు అకాడమీ’ లాంటి కొన్ని ఉదాహరణలు చెప్పాను. నా మాటలతో ముగ్గురూ ఆలోచనలో పడ్డారు. చివరికి నా మాటలతో ఏకీభవించారు. ఆంధ్రప్రదేశ్​ జ్యుడీషియల్​అకాడమీ మొదటి ప్రచురణగా ‘వినియోగదారుల రక్షణ చట్టం’ పుస్తకం వచ్చింది. తెలుగులో కూడా అకాడమీ అన్న పదం స్థిరపడింది. ఆ పుస్తకాన్ని అప్పటి ప్రధాన న్యాయమూర్తి1992 జులై 28న ఆవిష్కరించారు.  అకాడమీ మొదటి పుస్తకం తెలుగు పుస్తకం. అది చాలా ప్రాచుర్యం పొందింది. అయితే అదే పుస్తకం అకాడమీ చివరి పుస్తకం కావడం ఓ విషాదం. ఆ తర్వాత మరికొన్ని పుస్తకాలు అకాడమీ ప్రచురణలుగా వచ్చాయి. అందులో నా పుస్తకం కూడా మరొకటి ఉంది. అయితే అవి అన్నీ ఇంగ్లీష్​లోనే ఉన్నాయి. ఆ పుస్తక ప్రచురణ తెలుగులో జరిగి 30 ఏండ్లు దాటింది. కానీ మరో పుస్తకం ఏదీ తెలుగులో రాలేదు.

ప్రాంతీయ భాషల్లో తీర్పులు..

పై విషయాలన్నీ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషల్లో తీర్పులను అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం కూడా సమర్థిస్తున్నది. దేశంలోని వివిధ హైకోర్టులు కూడా ఇంగ్లీషులో ఉన్న ప్రధాన తీర్పులను ఆయా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయని వింటున్నాం. ఈ స్థితిలో తెలుగులో న్యాయపాలన జరగాలని చాలా మంది కాంక్షిస్తున్నారు. మన చుట్టు పక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో న్యాయపాలన వాళ్ల భాషల్లోనే జరుగుతున్నది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం న్యాయపాలన తెలుగులో జరగడం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్​లో కోర్టుల విషయంలో తెలుగు భాష అంతగా అభివృద్ధి చెందలేదు. తెలుగు భాష కోర్టుల్లో అమలు జరగలేదు. తెలుగులో తీర్పులను అనువాదం చేస్తున్న సందర్భంలో ఈ దిశగా అందరూ కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో న్యాయపాలన జరగాలంటే తెలుగులో కూడా న్యాయశాస్త్ర గ్రంథాలు అందుబాటులో ఉండాలి. ఆ పనికి నా లాంటి ఒకరిద్దరు మిత్రులు కాకుండా జ్యుడీషియల్​ అకాడమీ, తెలుగు అకాడమీ, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. అది కూడా మనస్ఫూర్తిగా చేయాలి. తెలుగులో న్యాయశాస్త్ర పుస్తకాలు ఉంటే తెలుగులో తీర్పులు రావడానికి మార్గం కొంత సుగమం అవుతుంది. ఈ దిశగా హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని భాషాభిమానులే కాదు కక్షిదారులూ కోరుకుంటున్నారు.


ఒత్తిడి తేవాల్సిందే..

తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించడం మాత్రమే సరిపోదు. న్యాయశాస్త్ర పుస్తకాలు, అనువాదం చేసిన తీర్పులు ప్రజల భాషలో ఉండాలి. అలా లేనప్పుడు ప్రజలకు కోర్టులకు మధ్య అగాధం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. తెలుగులో న్యాయపాలన జరిగితే కక్షిదారులకు తమ కేసు ఎందుకు పోయిందో, అవతలి వ్యక్తుల కేసు ఎందుకు గెలిచిందో అర్థం అవుతుంది. అలా అర్థమైనప్పుడు ప్రజలకు కోర్టుల మీద విశ్వసనీయత పెరుగుతుంది. ప్రజలకు కోర్టులకు మధ్య ఉన్న అవరోధం భాష. ఈ అవరోధం తొలగించడానికి అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాల్సి ఉన్నది. అనువాదం చేసే క్రమంలో చూడాల్సిన మరో అంశం తెలుగులోకి చొచ్చుకొచ్చి తెలుగుదనం సంతరించుకున్న పదాలను అదేవిధంగా ఉంచడం, ప్రజలకు కోర్టుల న్యాయం చేరువ కావాలంటే కావాల్సింది తెలుగులో న్యాయపాలన. ఈ దిశగా ప్రయత్నాలు చిత్తశుద్ధితో జరగాలి. సంస్థలు నామమాత్రంగా ఉండటం కాదు.. అవి ఉనికిలో ఉన్నాయని నిరూపించుకోవాలి. ఈ మాటలను విజ్ఞులు వింటున్నారా? మరీ ముఖ్యంగా అధికార భాషా సంఘం?

- మంగారి రాజేందర్,
రిటైర్డ్​ జిల్లా సెషన్స్​ జడ్జి