స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఇంకెప్పుడు?

స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఇంకెప్పుడు?
  •     ఎన్నికల కోడ్ ముగిసి 25 రోజులు గడుస్తున్నా ఆ ఊసే లేదు
  •     కమిటీ అప్రూవల్ కోసం పలు ఫైళ్లు వెయిటింగ్
  •     మీటింగ్​ పెట్టి అప్రూవ్​ చేస్తే అభివృద్ధి పనుల్లో వేగం పెరిగే చాన్స్​

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాల నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. లోక్​సభ ఎన్నికల కోడ్ ముగిసి 25 రోజులు గడుస్తున్నా సమావేశాల ఊసే లేదు. దీంతో అభివృద్ధి పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ ఏర్పడిన తరువాత ఈ ఏడాది మార్చి 6న ఒక్క సమావేశం మాత్రమే జరిగింది.  మార్చి16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 5న కోడ్ ముగిసినప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్టాండింగ్​కమిటీ సమావేశం నిర్వహించలేదు. వాస్తవానికి ప్రతి వారం స్టాండింగ్​కమిటీ మీటింగ్​జరగాల్సి ఉంది.

కోడ్ ముగిశాక మొన్నటిదాకా బల్దియా కమిషనర్ గా పనిచేసిన రొనాల్డ్​రోస్​సెలవులపై వెళ్లడంతో సమావేశాలకు బ్రేక్​పడుతూ వచ్చింది. తిరిగొచ్చిన తర్వాత రోజున ఆయన బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆమ్రపాలి చార్జ్​తీసుకున్నారు. మరి వచ్చే వారమైనా స్టాండింగ్​కమిటీ సమావేశం నిర్వహిస్తారో లేదో చూడాలి. కమిటీ అప్రూవల్ కోసం పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లు వెయిట్​చేస్తున్నాయి. మేజర్ పనులకు సంబంధించి 10 ఫైళ్లు పెండింగ్​ఉన్నాయి. సమావేశం జరిగితే అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ కనుసైగల్లో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగేది. ఆయన నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే అప్రూవల్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. స్టాండింగ్ కమిటీలో చర్చించి డెవలప్ మెంట్ కి సంబంధించి ఏది అవసరమో దానికే సభ్యులు అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంది. బల్దియా కమిషనర్​కు రూ.2 కోట్ల వరకు పనులకు అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అంతకు మించి రూ.5 కోట్ల వరకు పనులను ఓకే చేయాలంటే స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తప్పనిసరి.