వానొస్తే రాస్తా బంద్.. వాగులు పొంగితే రాకపోకలకు ఆటంకం

రాజన్న సిరిసిల్ల,వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానలు పడ్డాయంటే చాలు  గ్రామాలకు  రాకపోకలు బంద్ అవుతున్నాయి.  గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జిలు  లేకపోవడంతో   ఏటా ఈ సమస్య వస్తోంది.  జిల్లాలో 13 మండలాలు ఉండగా దాదాపు 8 మండలాల్లోని   గ్రామాలకు వరద బాధ తప్పడం లేదు. 

8 మండలాల్లో రాకపోకలు బంద్

  • చందుర్తి మండలం బండపల్లిలో    చెరువు నిండినప్పుడు కోనరావుపేట మండలం బావుసాయిపేటకు,   బండపల్లి చెరువు మత్తడి దుంకడం వల్ల చందుర్తి, కోనరావుపేట మండలాల మధ్య రాకపోకలు బంద్ అవుతున్నాయి.  
  •  చందుర్తి మండలంలోని  ఎన్గల్ గ్రామంలో వర్షాలు కురిసినప్పుడు ఎన్గల్, బండపల్లి గ్రామాల రోడ్లు వరదతో నిండి, రోడ్లు బ్లాక్​ అవుతున్నాయి.  
  • వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట నక్క వాగు వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పుడు పొంగిపొర్లుతోంది. దీంతో బొల్లారం, లింగంపల్లి, హనుమాజీపేట తోపాటు కోనరావుపేట  ప్రజలు వేరే ఊరు వెళ్లాలంటే  ఇబ్బందులు పడుతున్నారు. 
  • హన్మాజీపేట వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి  ఇటీవల  ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ పనులు ప్రారంభం కాలేదు. నక్క వాగు పొంగడం వల్ల వేములవాడ రూరల్ మండలానికి కోనరావుపేట మండలాల రాకపోకలు నిలిచిపోతున్నాయి.  
  •  కోనరావుపేట మండలంలోని మూలవాగు పై ఉన్న  చిన్న వంతెన ఉన్నా అధిక వర్షాల వల్ల  మామిడిపల్లి,నిజామాబాద్, వెంకట్రావుపేట, బావుసాయిపేట, వట్టిమల్ల,  నిమ్మపల్లి గ్రామాలకు  వెళ్లాలంటే కష్టంగా మారుతోంది.  
  •   నిమ్మపల్లి ప్రధాన రహదారి పై ఉన్న పెంటి వాగు బ్రిడ్జి గతంలో కొట్టుకుపోగా తాత్కాలికంగా మట్టిని పోశారు. మళ్లీ వర్షాలు అధికంగా కురిసి వాగు పారితే రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
  •  బోయినిపల్లి మండలంలో అధిక వర్షాలతో  బోయిన్ పల్లి వాగు పొంగటం ద్వారా  బోయిన్ మండల కేంద్రం నుంచి  కొదురుపాక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 
  •  గంజీవాగు పొంగడం ద్వారా వేములవాడ,బోయిన్​పల్లి మండలాలకు ఇబ్బంది ఎదురవుతోంది. మత్తడి దుంకడం వల్ల కొరెం, దుండ్రపల్లి,అనంతపల్లి,బూరుగుపల్లి,కొడిమ్యాల మండలం నల్గొండ గ్రామాల ప్రజలకు ప్రయాణం చేయలేకపోతున్నారు.  
  •  ఈ మండలంలోని లోలెవల్ బ్రిడ్జీలను హై లెవల్ బ్రిడ్జీలుగా నిర్మించాల్సి ఉంది. గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు నిండటం ద్వారా   లింగన్నపేట,గంభీరావుపేట, కోళ్లమద్ది ,మాచారెడ్డి రోడ్ లు పోలీసులు మూసివేస్తున్నారు.
  •  గంభీరావుపేట మండలంలోని  మల్లుపల్లి, సముద్రలింగాపూర్  గోరింటాల వాగులు పొంగితే ప్రజలకు అవస్థలు తప్పవు.  తంగాళ్లపల్లి లక్ష్మీపూర్ గ్రామాల మధ్య   సండ్ర వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇల్లంతకుంట కు పోయే వాహనాలను తాడూరు మీదుగా మళ్లీస్తున్నారు. 
  • ముస్తాబాద్​ మండలంలోని రామలక్ష్మిణ పల్లె రోడ్ మీదనుంచి మానేరు వాగు నీరు ప్రవహించడంతో రాకపోకలు బంద్ అవుతున్నాయి.

ఒకే మండలంలో బ్రిడ్జి పూర్తి 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 8 మండలాలో హై లెవల్ బ్రిడ్జిలు  మంజూరు చేయాలని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. రాకపోకలు బంద్ అయ్యే  మండలాల్లో కేవలం ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి మండలాల మధ్య ఒకే బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది.  వర్షాల  పడ్డప్పుడుల్లా, చెరువులు మత్తడి దుంకడం,వాగులు పొంగడం వల్ల  8 మండలాల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా బ్రిడ్జిలు నిర్మించాల్సిఉంది. చందుర్తి,బోయిన్ పల్లి, వేములవాడరూరల్, కోనరావుపేట, తంగళ్లపల్లి,ఎల్లారెడ్డిపేట,గంభీరావుపేట, ముస్తాబాద్  మండలాల్లో బ్రిడ్జీల నిర్మాణానికి నిదులు మంజూరు చేయాల్సి ఉంది.

వర్షాకాలం రాకపోకలకు తిప్పలయితాంది.

కోనరావుపేట మండలం మూలవాగు పై వంతెన లేక రాకపోకలకు ఇబ్బంది అయితాంది.మూలవాగుపై ఉన్న వంతెన గతేడాది వరద ఉదృతికి కొట్టుకుపోయింది.దీంతో  తాత్కాలికంగా మట్టి  పోశారు.  నెల రోజులకే మట్టికొట్టుకుపోయింది. దీంతో దాదాపు నెల రోజులు  పైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.మామిడిపల్లి,నిజాంబాద్ గ్రామాల మద్య రాస్తా బంద్ కావడంతో  రైతులు, ప్రజలు తీవ్ర అవస్ధలు పడుతున్నారు.ప్రభుత్వం మా గ్రామానికి మూలవాగుపై బిడ్జిని మంజూరు చేయాలి.
జూకంటి మల్లేశం, మామిడిపల్లి

గతేడాది రోడ్ల మరమ్మతులకు రూ.80లక్షలు

గతేడాది వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం  మంత్రి కేటీఆర్ రూ. 80లక్షలు మంజూరుచేశారు. బోయినపల్లి మండలంలో గంజీవాగుపై బ్రిడ్జి నిర్మించడానికి నిధులు  మంజూరయ్యాయి.  పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా...ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి మండలాల మధ్య  మాత్రమే బ్రిడ్జి  నిర్మించారు. మిగితా మండలాల్లో హైలెవ్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని  ఆయా గ్రామాల ప్రజలు కోరుతన్నారు.