మోదీ అధికారంలోకి వచ్చాక బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది: మంత్రి సీతక్క

పుట్టినా, చచ్చినా పన్ను వసూలు చేసిన ఘనత బీజేపీదే

కాంగ్రెస్ మాటంటే మాటే.. రుణమాఫీ చేసి తీరుతం

 కేసీఆర్ ఫాం హౌజ్ లకే ఫ్రీ కరెంట్ ఇచ్చిన్రు 

  ఆదిలాబాద్, వెలుగు : మోదీ వచ్చాక మహిళలు బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. పన్నుల రూపంలో పేదోళ్లను కష్టాల్లోకి నెట్టి.. పుట్టినా, చచ్చినా పన్నులు వసూలు చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు.  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్​ మండలంతో పాటు బేల, జైనథ్ మండలాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సీతక్క డప్పుకొడుతూ కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచారు. ముందుగా జైనథ్ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. పదేండ్లలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో బీజేపీ దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మోదీ అక్షింత‌లు పంపించి ఇదే అభివృద్ధి అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతి విషయానికి అయోధ్య రామాలయం అని అంటున్నారని, బీజేపీ నేతలకు ఊర్లలో గుళ్లు  కనిపించలేదా అని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ గెలిచిన బీజేపీ ఎంపీ ఆదిలాబాద్​కు ఏం తీసుకొచ్చారో చెప్పాలన్నారు. కేసీఆర్ పదేండ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశాడన్నారు. పేదోళ్లకు కరెంట్ కట్ చేసి ఫాంహౌజ్​లకు కరెంట్ ఫ్రీ ఇచ్చాడని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తోందన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో 50 ఏండ్ల కింద కట్టిన ప్రాజెక్టులకు..ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులు ఎంత తేడా ఉందో గ‌మ‌నించాల‌ని, ఇప్పుడ‌న్నీ క‌మీష‌న్లకు క‌క్కుర్తి ప‌డి చేపట్టిన ప్రాజెక్టులే ఉన్నాయన్నారు. బేలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేసి తీరతామని, దాదాపు 84 లక్షల మందికి రైతుబంధు ప‌డింద‌ని, మ‌రో 4 లక్షల మందికి త్వరలోనే జ‌మ చేస్తామ‌న్నారు. రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయ‌డానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ ఇన్​చార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ అడ్డిబోజారెడ్డి పాల్గొన్నారు.