ఇండోర్/ బలోద్: ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ లోకల్ లీడర్లు సంబురంగా వెల్కమ్ చెప్పారు. శాలువాలు కప్పి, గులాబీలు ఇచ్చి ఫొటోలు తీసుకున్నారు. అదే స్పీడ్లో వచ్చిన ఓ సీనియర్ నేత ప్రియాంకకు పువ్వుల్లేని బొకే ఇచ్చి నవ్వులు పూయించాడు. మంగళవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన ఈ సరదా సన్నివేశం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సభా వేదికపై ప్రియాంక ఉండగా సీనియర్ నేత తన పరివారంతో వచ్చి ఆమెకు బొకేను అందజేశాడు. అందులో పువ్వులేవీ లేకుండా ఖాళీగా ఉండటం చూసి ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయారు. వెంటనే తేరుకుని ఖాళీ బొకేను ఆ నేతకే చూపిస్తూ.. ఇందులో పువ్వులేవి? అని సరదాగా ప్రశ్నించారు. ఎక్కడో పడిపోయినట్లున్నయని చెప్తూనే ఆయనతోపాటు అక్కడున్నవాళ్లంతా కాసేపు నవ్వుకున్నారు.
దేశ సంపదంతా బడా వ్యాపారుల చేతుల్లోనే..
బీజేపీ సర్కారు దేశ సంపదనంతా కార్పొరేట్ కంపెనీలకు, బడా వ్యాపారులకు అప్పగించిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు. మంగళవారం చత్తీస్గఢ్లోని బలోద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. చత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అల్లర్లు, అవినీతి, పేదరికం విలయ తాండవం చేశాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాకే పాలన గాడిలో పడిందని, సంక్షేమ ఫలాలు పేదలకు అందాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయన కోసం 800 కోట్ల విలువైన 2 విమానాలు కొనుక్కున్నారు, 20 వేల కోట్లతో కొత్త పార్లమెంటు కట్టారు గానీ ఉత్తరప్రదేశ్ చెరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. తాను కూడా బీసీనని చెప్పుకునే మోదీ, కులాలవారీగా బీసీల జనాభాను లెక్కిస్తామంటే తిరస్కరించారని ప్రియాంక మండిపడ్డారు. యువతకు కోట్లాది ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న హామీలు గాలికొదిలేశారన్నారు. యువకులకు ఉద్యోగాలు లేకుండా చేశారని, రైతులకు కన్నీళ్లే మిగిల్చారని అన్నారు.