కర్ణాటక అసెంబ్లీలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. సభలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కాంట్రోవర్సీకి కేరాఫ్ గా మారాయి. లైంగికదాడి అనివార్యమైనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించకుండా స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి పగలబడి నవ్వడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభలో రైతు సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను డిమాండ్ చేశారు. అయితే ఆ సమయంలో స్పీకర్‌ను ఉద్దేశించి రమేశ్‌కుమార్ పైవ్యాఖ్య చేశారు. ‘ఒక సామెత ఉంది. లైంగికదాడి అనివార్యమైనప్పుడు, పడుకొని ఎంజాయ్ చేయాలి. మీరు ఉన్న స్థితి కూడా సరిగ్గా అదే’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా పగలబడి మరీ నవ్వారు. దీంతో ఇప్పుడు స్పీకర్ తీరుపై కూడా పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అటు కర్నాటక అసెంబ్లీలోని ఏ ఒక్క సభ్యుడు కూడా రమేశ్ కుమార్ వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పలేదు.
అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ కు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేం కావు. గతంలో కూడా ఆయన రేప్ పై కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 2019లో, రమేష్ కుమార్ స్పీకర్‌గా పనిచేసిన సమయంలో, తాను ‘రేప్ బాధితురాలిగా’ పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. “నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలా ఉంది. అత్యాచారం ఒక్కసారి మాత్రమే జరిగింది. అలా వదిలేస్తే అది గడిచిపోయేది. అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే నిందితుడిని జైల్లో పెడతారు. అయితే అది ఎలా జరిగిందని లాయర్లు అడుగుతున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని సార్లు జరిగింది? అని అడుగుతున్నారు. అత్యాచారం ఒకసారి మాత్రమే జరుగుతుంది, కానీ మీరు కోర్టులో 100 సార్లు అత్యాచారానికి గురవుతారు. ఇదీ నా పరిస్థితి’’ అని రమేశ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై మహిళా శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రమేశ్ కుమార్ సభకు క్షమాపణలు చెప్పారు.
అయితే ఎమ్మెల్యే రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై అటు నెటిజన్స్ మండిపడుతున్నారు. అతనిపై యాక్షన్ తీసుకున్నారా? అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అసలు ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేయే కాదు.. ఆయనపై నవ్విన స్పీకర్ కూడా దోషులే.. ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు.
#WATCH| "...There's a saying: When rape is inevitable, lie down&enjoy," ex Karnataka Assembly Speaker & Congress MLA Ramesh Kumar said when Speaker Kageri, in response to MLAs request for extending question hour, said he couldn't& legislators should 'enjoy the situation' (16.12) pic.twitter.com/hD1kRlUk0T
— ANI (@ANI) December 17, 2021