పాత కక్షలతో తల్లిదండ్రులపై దాడి.. తట్టుకోలేక బిడ్డ మృతి

  • సూర్యాపేట జిల్లాకొత్తపల్లిలో విషాదం 
  • పరారీలో ముగ్గురు నిందితులు

తుంగతుర్తి, వెలుగు : పాత కక్షలతో ప్రత్యర్థులు తన తల్లిదండ్రులపై దాడి చేయగా, అది తట్టుకోలేక షాక్​కు గురై బిడ్డ చనిపోయింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని డి.కొత్తపల్లి గ్రామంలో జరిగింది. కొత్తపల్లికి చెందిన కాసం సోమయ్య, అదే గ్రామానికి చెందిన కడారి సోమయ్య మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఊర్లో చాలాసార్లు పంచాయితీలు జరిగాయి. ఈ క్రమంలో కాసం సోమయ్య సూర్యాపేటకు మకాం మార్చి, కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడు. ఇటీవల అతని కుమార్తె పావని(14) అనారోగ్యానికి గురికాగా సర్జరీ చేశారు. 

దాంతో నెల రోజుల కింద కాసం సోమయ్య తన సొంతూరుకు తిరిగొచ్చాడు. శ్రావణ మాసం కావడంతో గురువారం ఊళ్లో బోనాల పండుగ జరిగింది. పండుగ సందర్భంగా కడారి సైదులు, కాసం కాశిలింగం, కడారి సోమయ్య కలిసి మద్యం తాగారు. మద్యం తాగుతుండగా కాసం సోమయ్యతో ఉన్న పాత కక్షలు గుర్తుకురావడంతో ముగ్గురు కలిసి అతని ఇంటికి వెళ్లి గొడవకు దిగారు.

కాసం సోమయ్య, అతని భార్య మంజులపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పావని.. తన తల్లిదండ్రులపై ముగ్గురు వ్యక్తులు దాడి చేస్తుండడం చూసి భయాందోళనకు గురైంది. అదే షాక్​లో చనిపోయింది. కాసం సోమయ్య ఫిర్యాదు మేరకు కడారి సైదులు, కాసం కాశిలింగం, కడారి సోమయ్యపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఐలయ్య తెలిపారు. నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు.