- దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది
- ఏండ్ల తరబడి పెండింగ్‌లోనే..
- సాంకేతిక కారణాలు, సిబ్బంది కొరత కారణమంటున్న అధికారులు
- అడుగు ముందుకు పడని ప్రక్రి
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏకు వచ్చిన ఎల్ఆర్ఎస్అప్లికేషన్లకు మోక్షం కలగడం లేదు. అప్పటి బీఆర్ఎస్సర్కారు 2015, 2020 సంవత్సరాల్లో ఎల్ఆర్ఎస్స్కీం ప్రకటించగానే గ్రేటర్ పరిధిలో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని హెచ్ఎండీఏ కూడా భావించింది. అయితే, ఏండ్లు గడుస్తున్నా వీటికి మాత్రం విముక్తి కలగడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఏమైందని వాకబు చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను క్లియర్చేస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటించినా ఇప్పటివరకు అడుగు ముందుకు పడడం లేదు.
రూ.వెయ్యి ఫీజు చెల్లించి..
గత ప్రభుత్వం రెండుసార్లు ఎల్ఆర్ఎస్అప్లికేషన్ల రెగ్యులరైజేషన్‌కు అనుమతి ఇవ్వడంతో ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్ పల్లి జోన్ల పరిధిలో ఇప్పటివరకూ సుమారు 4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందరూ దరఖాస్తు ఫీజు రూ.వెయ్యి చెల్లించి ఆన్‌లైన్‌ద్వారా అప్లై చేసుకున్నారు. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారా దాదాపు రూ. 1400 కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేసింది. అయితే, అధికారులు ఇప్పటివరకు కొన్నివేల దరఖాస్తులు మాత్రమే పరిశీలించినట్టు తెలిసింది.
2020కి ముందు కొన్నవారికే..
అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం 2020 సంవత్సరానికి ముందు వేసిన అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న వారికే తాజా మార్గదర్శకాల ప్రకారం రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించింది. సదరు అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న వారే ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. అలాగే అక్రమ లేఅవుట్లలో కనీసం10 శాతం ప్లాట్లు విక్రయించి ఉంటేనే మిగిలిన ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి అవకాశం ఉంటుంది. అయితే,10 శాతం విక్రయాలు జరగని లేఅవుట్లకు సంబంధించి కూడా ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. దేవాలయ భూములు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు ఉంటే అలాంటి వాటిని గతంలో రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ తాజా క్రమబద్ధీకరణకు అనుమతించమని కూడా అధికారులు తెలిపారు. ఇలాంటి సమస్యలున్న ప్లాట్లు, లేఅవుట్లను ఫీల్డ్లెవెల్ లో పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన సిబ్బంది కొరత ఉండడం వల్ల వీలు కావడం లేదని హెచ్ఎండీఏ అధికారులు చెప్తున్నారు. కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సంవత్సరంతో సంబంధం లేకుండా రెగ్యులరైజ్‌చేస్తామని చెప్పడంతో మరింత మంది దరఖాస్తు చేసుకున్నారు. అయినా రెగ్యులరైజ్చేయడంలో ఆలస్యం జరుగుతూనే ఉంది.
టెక్నికల్ ఇష్యూస్ కూడా..
ఎల్ఆర్ఎస్అప్లికేషన్ల పరిశీలన కోసం హెచ్ఎండీఏకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) సాంకేతిక సహాయం అందిస్తోంది. అప్పుడప్పుడు టెక్నికల్ఇష్యూస్వస్తుండడం, దరఖాస్తుల పరిశీలనకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఆలస్యమవుతోందని అధికారులు చెప్తున్నారు. ఒక ప్లానింగ్ ఆఫీసర్పరిధిలో ఒక్కరికే వెబ్ సైట్లోలాగిన్ అయ్యే అవకాశం ఉండడంతో దరఖాస్తుల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతుందంటున్నారు. నిబంధనల ప్రకారం అన్ని దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే క్రమబద్ధీకరణ ప్రాసెస్ చేస్తామని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.