వడదెబ్బ నుంచి రక్షించుకోవాలంటే..ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వడదెబ్బ నుంచి రక్షించుకోవాలంటే..ఈ జాగ్రత్తలు తప్పనిసరి

‘అబ్బో ఏమి ఎండలు ఇవి.. అడుగు బయటపెట్టాలంటేనే భయమేస్తోంది’ ప్రస్తుతం ప్రతి ఇంట్లో వినిపిస్తోన్న మాట ఇది. అయినా.. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవడం అందరికీ సాధ్యం కాదు. అలాగని వెళ్తే నడినెత్తిన సూర్యుడు భగభగమంటాడు. దీంతో ఒంట్లో నీరంతా చెమట రూపంలో పోయి నీరసం వచ్చేస్తుంది. ఇలాంటప్పుడే కొన్నిసార్లు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఈ ఎండలకు వడదెబ్బ తగులుతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ల గురించి వార్తల్లో చూస్తున్నాం. రాబోయేది మే నెల. అప్పుడు ఇక ఎండలు ఎలా మండిపోతాయో.. ఊహించుకోవచ్చు. కాబట్టి వడదెబ్బకు గురి కాకుండా.. అసలు ఎండబారిన పడి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలో డాక్టర్ రాహుల్ చిరాగ్ మాటల్లో తెలుసుకుందాం. 

ఎండలో ఎక్కువసేపు ఉండడం లేదా పనిచేయడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని ఎలా గుర్తించాలంటే.. సాధారణంగా మన బాడీ టెంపరేచర్​ దాదాపు 98 ఫారెన్ హీట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే జ్వరం వచ్చినట్టు గుర్తిస్తాం. అప్పుడు ఒళ్లంతా కాలిపోతూ ఉంటుంది. అయితే వడదెబ్బకు గురైతే బాడీ టెంపరేచర్​ ఇంకా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మన బాడీ టెంపరేచర్​104 ఫారెన్ హీట్​కు పైన ఉంటే దాన్ని సన్​స్ట్రోక్​గా పరిగణిస్తాం. 

వడదెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ?

సాధారణంగా మన శరీరంలో ఏదైనా సమస్య  లేదా ఇబ్బంది తలెత్తితే వెంటనే దాని తాలుకా లక్షణాలు బయటపడతాయి. అలానే వడదెబ్బకు గురైనప్పుడు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏంటంటే.. చర్మం పొడి బారుతుంది. బీపీ లెవల్స్​ తగ్గుతాయి.

ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి?

వడదెబ్బ తగిలినప్పుడు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే.. ఆ వ్యక్తిని నీడలోకి తీసుకెళ్లాలి. వాళ్లు స్పృహలో ఉంటే ఏవైనా లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ వంటివి ఇవ్వాలి. తర్వాత చల్లగా ఉన్న నీటి తొట్టిలో కూర్చోబెట్టాలి. ఇవేవీ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న హాస్పిటల్​కు తీసుకెళ్లాలి. అప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్, మెడికేషన్స్ వంటివి డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతాయి. 

అశ్రద్ధ చేస్తే..?

మామూలు జ్వరమో, నీరసమో అని తేలిగ్గా తీసుకుంటే ఊహించని ప్రమాదాలకు దారితీయొచ్చు. ఉదాహరణకు వడదెబ్బ తగిలిన వ్యక్తి కొన్నిసార్లు స్పృహ కోల్పోతారు. మజిల్​ లాస్ జరుగుతుంది. అలాంటప్పుడు హాస్పిటల్​కి తీసుకెళ్లాలి. అలా చేయకపోతే శృతి మించి ప్రాణాపాయం అవుతుంది. కొన్నిసార్లు కండరాలు, కిడ్నీలు డ్యామేజ్​ అయ్యే ప్రమాదం ఉంది. 

ఎలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్​కి వెళ్లాలి? 

వడదెబ్బకు గురైన వ్యక్తి ఒకవేళ స్పృహ తప్పి పడిపోతే కచ్చితంగా హాస్పిటల్​కి తీసుకెళ్లాలి. బాడీ టెంపరేచర్104 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా డాక్టర్​కి చూపించాలి. మైల్డ్​ స్ట్రోక్​ అంటే.. డీ హైడ్రేషన్​కి గురై, నీరసంగా ఉంటే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్​ఎస్ వంటివి తాగుతూ ఉండాలి. అప్పుడు పరిస్థితులు చేయిదాటకుండా చూసుకోవచ్చు. ఈ పరిస్థితులు సాధారణంగా యువకులు, మధ్యవయసు వాళ్లలో కనిపించవు. ఎక్కువగా వృద్ధులు, చిన్నపిల్లలు, డయాబెటిస్, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవాళ్లలో కనిపిస్తాయి. ప్రతి సిచ్యుయేషన్​ని ఇంట్లో మేనేజ్​ చేయగలమా? అంటే కచ్చితంగా చేయలేం. పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, మనం ఏం చేసినా వర్కవుట్ కానప్పుడు ఆటోమెటిక్​గా తెలుస్తుంటుంది. నీరసం తగ్గకపోవడం, స్పృహలోకి రాకపోవడం, టెంపరేచర్​ నార్మల్​ కాకపోవడం వంటివి. ఇలాంటి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు. 

ఏఏ జాగ్రత్తలు పాటించాలి?

  • హైడ్రేషన్ మెయింటెయిన్ చేయాలి. అంటే.. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం నీటి శాతం ఎక్కువ ఉంటే పండ్లు, జ్యూస్​లు కూడా తీసుకోవాలి. 
  • నేరుగా ఎండ పడే టైంలో పనులు చేయకూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవడం బెటర్. 
  • ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివి ఉన్నవాళ్లు, అలాగే చిన్నపిల్లలు ఎండలోకి వెళ్లకూడదు. 
  • కార్​లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఏసీ ఆన్​లో ఉంటే బెటర్. లేదంటే ఆ ఎండకు కూడా చిన్నపిల్లలు, వృద్ధులు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
  • ఎండ బారి నుంచి తప్పించుకోవాలంటే ఉదయం11 గంటలలోపు, సాయంత్రం 5 తర్వాత బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటే బెటర్. ముఖ్యంగా స్పోర్ట్స్​ ఆడేవాళ్లు, యాక్టివిటీలు చేసే పిల్లలు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు టైం టేబుల్ వేసుకుంటే మంచిది.
  • బయటకు వెళ్లేటప్పుడు లేతరంగు బట్టలు వేసుకుంటే బెటర్. ముదురు రంగు బట్టలు వేసుకుంటే అవి ఎండ  నుంచి వేడిని గ్రహిస్తాయి. కాబట్టి వాళ్లు సన్​స్ట్రోక్​కి ఈజీగా గురయ్యే చాన్స్ ఉంది. 
  • రాత్రుళ్లు హీట్ వేవ్స్ వల్ల ఇంట్లో కూడా వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు రూమ్​ చల్లగా ఉండేలా చూసుకోవాలి. పల్చని బెడ్ షీట్స్ వాడాలి. వెంటిలేషన్ బాగా ఉండాలి. కుదిరితే ఏసీ వేసుకోవడం బెటర్. కానీ, డైరెక్ట్​ బ్లోయర్​ కింద పడుకోకూడదు. దానివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావొచ్చు. 

- డాక్టర్ రాహుల్ చిరాగ్​
సీనియర్ జనరల్ ఫిజీషియన్
కేర్ హాస్పిటల్స్,  హైదరాబాద్​