సిరిసిల్లలో ఏడాది కిందటే 1,320 డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తి
పేదలకు అందజేయని అధికారులు
లబ్ధిదారుల ఎంపికలో జాప్యం
కేసీఆర్ రాక కోసం ఆఫీసర్ల వెయిటింగ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సొంత సెగ్మెంటు సిరిసిల్ల. అక్కడ చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ఏడాదైంది. అయినా ఇళ్లను పేదలకు అందజేయడం లేదు. సీఎం కేసీఆర్ సమక్షంలో గృహ ప్రవేశాలు జరగాలని ఆఫీసర్లు నిర్ణయించారట. ఆయన రాక కోసం ఎదురుచూస్తూ లబ్ధిదారుల ఎంపిక కూడా ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తోంది. దీంతో సీఎం ఎప్పుడు వస్తారో, తమకు ఇండ్లు ఎప్పుడు ఇస్తారోనని జనం ఎదురుచూస్తున్నారు.
1,320 ఇండ్లకు 7,800 అప్లికేషన్లు
సిరిసిల్ల టౌన్‌కు ఐదు కిలో మీటర్ల దూరంలో మండేపల్లి శివారులో డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీని ప్రభుత్వం నిర్మించింది. దీనికి ‘కేసీఆర్ కాలనీ’ అని పేరు పెట్టారు. దాదాపు 30 ఎకరాల్లో రూ.76 కోట్లు ఖర్చు చేసి 1,320 ఇండ్లు కట్టారు. ఇది రాష్ట్రంలోనే మోడల్ కాలనీగా చెప్తున్నారు. వీటి కోసం 7,800 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. డ్రా తీసి ఇండ్లను కేటాయించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం టూర్ కన్ఫామ్ కాగానే డ్రా నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు అనంతగిరి ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇన్‌టైమ్‌లో పునరావాసం కల్పించలేదు. దీంతో అక్కడి నుంచి 200 కుటుంబాలను ‘కేసీఆర్ కాలనీ’కి తరలించారు.
జనం ఎదురుచూపులు
సిరిసిల్లలో నిరుపేదలు, నేత కార్మికులు అద్దె ఇండ్లలో ఉంటున్నారు. ప్రతి నెల కిరాయిలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. అద్దె ఇండ్లలో ఉంటున్న వారి కుటుంబసభ్యులు చనిపోతే.. ఓనర్లు శవాన్ని కూడా తేకుండా అడ్డుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి. దీంతో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లు తమకు ఇస్తారేమోనని ఆశతో పేదలు అప్లికేషన్లు ఇచ్చారు. వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఆఫీసర్లు ఈ ఇండ్లను పంచకుండా ఖాళీగా ఉంచుతున్నారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
అప్లికేషన్లు తీసుకుంటున్నం
సిరిసిల్లలో ఇండ్లు లేని నిరుపేదల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నం. వారం రోజుల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. కరోనా కారణంగా ఎంపిక లేటయ్యింది. త్వరలోనే పంపిణీ పూర్తి చేస్తాం.
– డి.కృష్ణభాస్కర్, జిల్లా కలెక్టర్
For More News..