
-
సాగుభూముల్లో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ల యత్నం
గూడూరు, వెలుగు : మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపెల్లిలోని సాగు భూముల్లో శుక్రవారం ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు నాటడానికి వెళ్తే రైతులు అడ్డుకున్నారు. గ్రామంలో దాదాపు 100మంది రైతులు 400 ఎకరాల పోడు భూములను ఏండ్లుగా సాగు చేస్తున్నారు. మహబుబాబాద్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ట్రాక్టర్ లో మొక్కలను తీసుకుని బొల్లెపెల్లి శివారులో ఉన్న పోడు భూముల్లో నాటడానికి కూలీలతో కలిసి వెళ్లారు. విషయం తెలుసుకున్న కొంతమంది రైతులు ఆఫీసర్లను అడ్డుకున్నారు.
ఎన్నో ఏండ్లుగా సాగు చేస్తున్న తమ భూములను ఇటీవల సర్వే చేసి కూడా పట్టాలు ఇవ్వలేదన్నారు. తమ భూముల్లో ఆఫీసర్లు మొక్కలు నాటడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 60మంది రైతుల భూములు సర్వే చేసి 15మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి మిగతా రైతులకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు, సెక్షన్ ఆఫీసర్లకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తర్వాత ఆఫీసర్లు ట్రాక్టర్ లో తెచ్చిన మొక్కలను నర్సరీలో పెట్టి వెళ్లిపోయారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు ఇవ్వాలని లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.