కొత్త వ్యవస్థ వస్తేనే రైతు కష్టం తీరుతది

కొత్త వ్యవస్థ వస్తేనే రైతు కష్టం తీరుతది
రాత్రనక పగలనక కష్టపడి రైతు పంట పండిస్తుంటే..  ఆ కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు. కానీ, రైతు కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ దళారీలు, మిల్లర్లు లాభాల పంట పండించుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకంటూ కేంద్రం కొత్త అగ్రి చట్టాలను తెచ్చింది. కానీ వాటి వల్ల కూడా తమకు మేలు జరగదంటూ రైతులు ఢిల్లీలో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో రైతులకు మరింత మేలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వ్యవస్థ తేవాలి. రైతు పండించిన ఉత్పత్తులకు వచ్చే ఆదాయం.. రైతులకే దక్కేలా మార్పు రావాలి. రైతులు పండించిన ఉత్పత్తుల అమ్మకానికి కొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుడికి మధ్య ఉన్న దళారీల దోపిడీని అరికట్టేందుకు ఓ కొత్త మార్గానికి శ్రీకారం చుట్టాలి. ఇందుకోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గ్రామానా శాశ్వత ఆహార ధాన్యాల కొనుగోలు కేంద్రాలను నెలకొల్పాలి. వాటి ద్వారా నేరుగా రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి. కూరగాయలు, పండ్లు, పూలు వంటివి మినహా అన్నింటినీ అక్కడ కొనుగోలు చేసే వ్యవస్థ రావాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రాసెస్ చేసేందుకు ఆయా మిల్లులకు తరలించాలి. వాటిని వినియోగదారుడు వాడుకునేందుకు అవసరమైన తీరుగా మార్చాలి. ఆ ఉత్పత్తులను సేల్ చేసేందుకు అమ్మకం కేంద్రాలను కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలి. మిల్లు నుంచి బియ్యం, పప్పులు, మిరప, ధనియాలు లాంటి పొడులు, నూనె తదితరాలను అమ్మకం కేంద్రాలకు తరలించాలి. ఆ కేంద్రాల నుంచి ప్రజలకు వాటిని అమ్మడం ద్వారా ఇటు రైతుకు.. అటు వినియోగదారుడికి కూడా ధర విషయంలో మేలు జరుగుతుంది. ధాన్యం కొనుగోలు, అమ్మకం కేంద్రాల్లో పని చేసే వ్యక్తులకు కిలోకు రూపాయి చొప్పున ఇచ్చినా వేల రూపాయల జీతం ఇవ్వచ్చు. వీటిలో పనిచేసేందుకు రైతు బిడ్డలనే ఎంపిక చేయాలి. హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో 10 వేల అమ్మకపు కేంద్రాలు నెలకొల్పినా తక్కువే కావచ్చు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. మార్కెట్ మాయాజాలం ప్రస్తుతం రైతు నుంచి వినియోగదారులకు సరుకులు చేరడానికి నలుగురి చేతులు మారుతున్నాయి. ముందుగా ధాన్యం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన వ్యక్తి మిల్లుకు తరలిస్తారు. ఆ తర్వాత మిల్లర్ల నుంచి హోల్ సేలర్ కు, హోల్ సేలర్ నుంచి రిటైల్ స్టోర్లు, చిన్న చిన్న షాపుల వాళ్లకు చేరుతాయి. ఉదాహరణకు పసుపును పరిశీలిస్తే.. క్వింటాలు పసుపు కొమ్ములు మేలు రకం ప్రస్తుతం 6 వేలకు మించి ధర పలకడం లేదు. ఈ మేరకు కేజీ కొమ్ములు రూ.60కు లభిస్తాయి. దానిని  పొడిచేయడానికి రూ.పదికి మించి ఖర్చు కాదు. తరుగు, వడ్డీ, రవాణా ఖర్చులు మరో రూ.పది వేసుకుందాం. టోకు వ్యాపారి లాభం కేజీకి రూపాయి. ఇప్పటికి మొత్తం 60+10+10+1=81 రూపాయలు అయింది. హోల్ సేలర్ ప్రస్తుత మార్కెట్ మేరకు ఆరు శాతం చూసుకుంటే.. దాదాపు 5 రూపాయలు. దీనిని కలిపితే 81+5=86 రూపాయలు అయింది. ఇక చిల్లర వ్యాపారికి పది శాతం లాభం (రూ.9) ఉంటుంది. ఈ లెక్కన సరుకు ధర 86+9=95 కావాలి. ఇక మార్కెట్లో చూస్తే పసుపు పొడి మేలు రకం కేజీరూ.200కి తక్కువ దొరకడంలేదు. కేజీ పసుపు పొడిపైనే వ్యాపారులు రూ.100 దోచుకుంటున్నారు. న్యాయంగా చూస్తే ఇందులో కనీసం సగమైనా రైతుకు దక్కాలి. మార్కెట్ లో ఉత్పత్తిదారుడికి, వినియోగదారుడికి మధ్య చెయిన్ పెరిగిపోవడం వల్ల వీరిద్దరూ నష్టపోతున్నారు. ఇలా చేస్తే ఇద్దరికీ మేలు రైతు పండించిన ఉత్పత్తులను గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు, అమ్మకం కేంద్రాల ద్వారా వినియోగదారుడికి చేరిస్తే.. ఇద్దరికీ మేలు జరుగుతుంది. ఈ వ్యవస్థ ద్వారా ఆ పసుపు కొమ్ములను రూ.60కే  కొన్నామనుకుంటే.. దానిని పొడి చేయడానికి రూ.పది, తరుగు, వడ్డీ, రవాణా ఖర్చులు మరో రూ.పది వేసుకుందాం. కొనుగోలు, అమ్మకపు కేంద్రాల్లో పనిచేసే వారికి కిలోకి రూపాయి చొప్పన రెండు రూపాయలు ఇవ్వాలి. 60+10+10+2=82 రూపాయలు. అంటే ఒక కేజీపైన మిగులు 200–-82=118 రూపాయలు. దీనిని ఇటు రైతుకు అటు వినియోగదారునికి పంచుదాం. పసుపుపొడి మేలురకం కేజీ రూ.150 ధర పెడితే.. మిగిలిన దానిలో కొంత రైతులకు, ఆ మార్కెట్ల నిర్వహణకు వాడినా ప్రస్తుత పరిస్థితులు చాలా మారుతాయి. రైతుకు క్వింటాల్ కు మరో వెయ్యి ఆదాయం పెరుగుతుంది. సామాన్యుడిపైనా భారం తగ్గుతుంది. ప్రభుత్వంపై భారం పడదు కొనుగోలు, అమ్మకం కేంద్రాలను పెట్టడం ప్రభుత్వానికి కష్టమేం కాదు. ధాన్యం కొనుగోలు చేసిన తక్షణమే బ్యాంకు నుంచి నేరుగా రైతు అకౌంట్ లోకి డబ్బులు జమచేయవచ్చు. ఇక్కడ రైతు సరుకునే బ్యాంకులకు పూచీకత్తుగా ఉంచవచ్చు. అమ్మకపు కేంద్రాల ద్వారా వచ్చే నగదును ఏ రోజుకారోజే అదే బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎప్పటికప్పుడు రుణం తీరుతూ వస్తుంది. అటు రైతు ఇటు వినియోగదారుడు ఇద్దరికీ పెద్ద ఎత్తున ప్రయోజనం దక్కుతుంది. ఆహార ఉత్పత్తులన్నీ సరసమైన ధరలకే అందించవచ్చు. ధరలు నియంత్రణలోకి వస్తాయి. బ్లాక్ మార్కెట్, దళారీ దందాలను అంతం చేయొచ్చు. రైతును దోపిడీ చేసేందుకు అవకాశమే ఉండదు. మరోవైపు ధాన్యం కేంద్రాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. రైతు జీవితం సుభిక్షంగా మారుతుంది. – మారసాని విజయబాబు, ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక అధ్యక్షుడు For More News.. లాక్‌డౌన్‌లో పానీ పూరికి 2 లక్షల ఆన్‌లైన్‌ ఆర్డర్లు అప్పిచ్చే యాప్స్‌తో జర జాగ్రత్త టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో