రెడ్డి, రావు కులాల వాళ్లు ఒకటైనప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వాళ్లు ఒకటి కావద్దా..? అని ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ ప్రశ్నించారు. హైదరాబాద్ బర్కత్ పురలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రెండో విడతలో 25 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా విశారదన్ మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ధర్మసమాజ్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో ముందు ఉందన్నారు. అగ్రవర్ణ, ఆదిపత్య రాజకీయాల నుంచి విముక్తి కల్పించడానికి తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఏకైక ప్రాంతీయ పార్టీ కేవలం ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పారు.
బీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి, రావులకు చెందిన వాళ్లు అందరూ ఒక్కటేనని, వారి స్థానాలు మాత్రం మారవని విశారదన్ మహరాజ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా వారి కులాలకు చెందిన వెలమ, రెడ్లను గెలిపించుకునే ఆలోచనలో అగ్రకుల నాయకులు ఉన్నారని, అందుకనే ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో 70 ఏళ్లుగా ఓటు వేసి బానిసలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇకపై ఆ పరిస్థితి రాకుండా టార్చ్ లైట్ గుర్తుకే ఓట్లు వేసి ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో రెడ్డి, రావు, కమ్మ, కాపు దొరలతో ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజకీయ యుద్ధం జరగనుందన్నారు.