నిండా కంపుకొట్టే గటేరు నీళ్లు, ప్రమాదకర ఇండస్ట్రియల్ వేస్టేజీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఘన చరిత్రకు హుస్సేన్‌సాగర్ ఓ సాక్ష్యం. ఒకప్పుడు సిటీకి మంచి నీళ్లు అందించిన సాగర్.. ఇప్పుడు కంపు కొట్టే గటేరు నీళ్లు, విషపూరిత పారిశ్రామిక వేస్టేజీతో నిండిపోయింది. దీనిని ప్రక్షాళన చేస్తామని, గబ్బుకొట్టే జలాలను కొబ్బరి నీళ్లలా మారుస్తామని పాలకులు చెప్పిన గొప్పగొప్ప మాటలన్నీ.. సాగర్‌లో కలుస్తున్న డ్రైనేజీ నీళ్లలాగే మారిపోయాయి. నిండా నిండిపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి, ఆధునిక హంగులు జోడించి, వరల్డ్ టూరిజం స్పాట్ గా హుస్సేన్‌సాగర్‌ను మారుస్తామని.. 2016 జీహెచ్ఎంసీ ఎలక్షన్ల టైంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ పక్కకి వెళ్లాలంటే ముక్కు మూసుకోక తప్పని దుస్థితి మారలేదు. 8074437
వరల్డ్ క్లాస్ స్పాట్ చేస్తమని..
480 ఏండ్ల కింద 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఏడు చదరపు కిలోమీటర్లకు కుచించుకు పోయింది. ఉమ్మడి ఏపీ పాలకుల నుంచి ఇప్పటి టీఆర్ఎస్ సర్కారు దాకా హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేస్తామని ప్రకటనలు చేయడం, తర్వాత పట్టించుకోకపోవడం రివాజుగా మారింది. దాంతో చెత్తాచెదారం, డ్రైనేజీల నీళ్లు, ఇండస్ట్రియల్ వేస్ట్ చేరుతూ విషపూరితంగా మారిపోయింది. సాగర్ అడుగున 40 లక్షల టన్నులకుపైగా వ్యర్థాలు ఉన్నాయని అంచనా. ఇందులో ఇప్పటిదాకా 10 శాతం కూడా తొలగించలేదు. ఏటా అదనంగా 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, వేల లీటర్ల హానికర కెమికల్స్ సాగర్‌లో చేరుతున్నాయి. సాగర్ నీళ్లలో జల చరాలకు అవసరమైన ‘బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్’ స్థాయి ఆందోళనకరంగా మారుతోంది. సాధారణంగా ప్రతి లీటర్ నీటికి 35 నుంచి 45 పీపీఎంగా ఉండాల్సిన బీఓడీ… ప్రస్తుతం 80 నుంచి 100 పీపీఎంగా ఉందని పొలుష్యన్ కంట్రోల్ బోర్డు నివేదికలు చెప్తున్నాయి. సాధారణంగా 80–100 పీపీఎంగా ఉండాల్సిన కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా.. 150 నుంచి 200 పీపీఎంగా ఉందని ఎక్స్పర్టులు చెప్తున్నారు.
15 ఏండ్లలో వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా..
సాగర్ ప్రక్షాళన పేరిట సర్కారు ఏటా కోట్ల కొద్దీ ఖర్చు చూపుతూనే ఉంది. 15 ఏండ్లలో వెయ్యి కోట్ల వరకు వెచ్చించినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఫలితం మాత్రం లేదు. 1998లో హుస్సేన్ సాగర్ బ్యూటీఫికేషన్ పనులు మొదలుపెట్టారు. అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.40 కోట్లు ఖర్చు చేసింది. 2004లో మూసీ రివర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా రూ.340 కోట్లతో బ్యూటిఫికేషన్, క్లీనింగ్ పని చేపట్టారు. అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత లేక్, పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు రాష్ట్ర సర్కారు, జైకా ఫండ్స్‌తో రూ.370 కోట్లతో పనులు చేపట్టింది. 2016 నాటికే పనులు పూర్తి కావాలి. కానీ ఇప్పటికీ ఏదీ ముందుకు పడలేదు.
కంటి తుడుపుగా బయో రెమిడియేషన్
సాగర్ నీళ్లను శుద్ధి చేసేందుకు గతేడాది ప్రయోగాత్మకంగా చేపట్టిన బయో రెమిడియేషన్ రిజల్ట్స్ ఆశాజనకంగా వచ్చాయి. దాంతో రెండేళ్లు ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఏటా రూ.25 కోట్లతో ఈ ప్రక్రియ చేపడుతున్నా.. ఇది శాశ్వత పరిష్కారం కాదని ఎక్స్పర్టులు చెప్తున్నారు.
డ్రైనేజీల మళ్లింపు ఇంకెప్పుడు?
హైదరాబాద్‌లోని పలు ప్రధాన ప్రాంతాల నుంచి వస్తున్న డ్రైనేజీలు హుస్సేన్ సాగర్‌లో కలుస్తున్నాయి. రోజూ బంజారా నాలా, యూసుఫ్‌గూడ నాలా, పికెట్ నాలా, బల్కాపూర్ నాలా, బేగంపేట ఉమానగర్ నాలా, కూకట్‌పల్లి నాలా నుంచి మురుగు నీళ్లు, ఇండస్ట్రియల్ వేస్టేజీ వచ్చి కలుస్తున్నాయి. దీంతో ప్రక్షాళన పనులతో ప్రయోజనం లేకుండా పోయింది. కూకట్ పల్లి నాలా నుంచి వచ్చే వ్యర్థాలను మళ్లించేలా నెక్లెస్ రోడ్డులో నిర్మించిన ‘ఇంటర్ సెప్షన్ అండ్ డైవర్షన్ (ఐ అండ్ డీ)’ నిర్మాణం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అది వినియోగంలోకి వస్తే.. హుస్సేన్ సాగర్ లో కలిసే పొల్యూషన్ తీవ్రత తగ్గే చాన్స్ ఉందని ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్టులు చెబుతున్నారు.
ఎన్నో స్టడీలు, సూచనలున్నా..
హుస్సేన్ సాగర్ నీళ్లను శుద్ధి చేయడంపై ఎన్నో స్టడీలు జరిగాయి. వాటి రిపోర్టులు, సూచనలు సర్కారు దగ్గర ఉన్నాయి. కానీ ఏవీ ఆచరణలోకి రాలేదు. సరస్సులు, నదుల ప్రక్షాళనలో పేరున్న ఆస్ట్రియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ స్టడీ చేసి సూచించిన ప్రతిపాదనల అమలుకు రాష్ట్ర సర్కారు వెనుకడుగు వేసింది. చాలా ఖర్చవుతుందని పక్కన పెట్టింది. తర్వాత సాగర్ జలాలను మళ్లించి.. అడుగున పేరుకున్న బురద, చెత్తాచెదారం, రసాయనాలను తొలగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆచరణలో కష్టమని చేతులెత్తేశారు. హానికర పదార్థాలు వాతావరణంలో కలిసే ప్రమాదం ఉందన్న వాదనలతో వదిలేశారు.
ఆ ముచ్చట మర్చేపాయె..
హుస్సేన్‌సాగర్ లో పేరుకున్న వేస్టేజీ తొలగించి, మంచినీళ్లతో నింపుతామని.. కొబ్బరి నీళ్లలాంటి జలాలను నగర వాసులకు అందిస్తామన్న సీఎం కేసీఆర్ ఆ ముచ్చట ఎప్పుడో మరిచిపోయారు. సర్కారు కనీసం హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను పరిరక్షించలేకపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో దర్జాగా పదెకరాల అక్రమ నిర్మాణం వెలిసింది. ఇది అటు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌తోపాటు ఇటు నిర్వహణ బాధ్యతలను పంచుకునే హెచ్ఎండీఏ అధికారులకు తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. సామాజికవేత్తల ఆందోళన, హైకోర్టు చీవాట్లతో చివరికి ఆ వెంచర్‌ను కూల్చివేశారు.
For More News..