
నిజాం రాష్ట్ర జనసంఘం స్ఫూర్తితో తెలంగాణలో అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థలన్నింటిని కలిపి 1923 ఏప్రిల్ 1న హన్మకొండలో నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షుడు. మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సంఘం ఆంధ్ర మహాసభ అవతరణ వరకు తెలంగాణ ప్రాంత సాంస్కృతిక, వైజ్ఞానిక పురోభివృద్ధికి కృషి చేసింది. ఈ సంస్థకు అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు సారథ్యంలో ఆంధ్ర పరిశోధక సంఘం స్థాపించారు. కొమ్మరాజు లక్ష్మణరావు మరణానంతరం ఈ సంఘం లక్ష్మీనారాయణ పరిశోధక మండలిగా మారింది. వర్తక స్వేచ్ఛ, వెట్టి చాకిరి, మోతుర్భా మగ్గం పన్ను అనే కరపత్రాలు, నిజాం రాష్ట్ర ఆంధ్రులు, నిజామాంధ్ర రాష్ట్ర ప్రశంస, నిజాం రాష్ట్ర అభివృద్ధి మార్గాలు అనే లఘు పుస్తకాలు ప్రచురించింది. 1930లో వరంగల్‌లో కాకతీయుల చర్చాగోష్టి పేరుతో నిర్వహించిన సభ అనంతరం వరంగల్ నుంచి కాకతీయ సంచిక వెలువడింది.
హైదరాబాద్‌లోని వివేకవర్ధిని థియేటర్లో మహారాష్ట్ర నేత డీకే కార్వే అధ్యక్షతన 1921 నవంబర్ 11, 12 తేదీల్లో హిందూ సంస్కరణ సభ జరిగింది. ఇందులో పాల్గొన్న వక్తలు ఉర్దూ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసంగించారు. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది తెలుగులో మాట్లాడటం ప్రారంభించగానే ఇతర భాషల వారు అవహేళన చేశారు. దీనిని అవమానంగా భావించిన తెలుగు వక్తలు టేకుమల్ల రంగారావు ఇంటిలో సమావేశమయ్యారు. తెలుగు భాష ఉనికిని చాటేందుకు నిజాం రాష్ట్ర జన సంఘం అనే రాజకీయేతర సంస్థ 11 మంది సభ్యులతో ఏర్పాటైంది. 1922 ఏప్రిల్ 24న హైదరాబాద్‌లోని రెడ్డి విద్యార్థి వసతి గృహంలో నిజాం రాష్ట్ర జన సంఘం మొదటి సమావేశం కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా వ్యవహరించారు.
నిజాం ఆంధ్రమహాసభ
మెదక్‌లోని జోగిపేటలో నిజాం రాష్ట్ర జన కేంద్రం సమావేశం 1930 మార్చి 3, 4, 5వ తేదీల్లో నిర్వహించారు. దీన్ని రాజకీయ సంస్థగా మార్చాలని నిర్ణయించారు. 1930లో నిజాం రాష్ట్ర జన కేంద్రం సంఘం సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఆంధ్రమహాసభగా మారి ఒక రాజకీయ సంస్థగా ఏర్పడింది. ఇదే తెలంగాణలో ఏర్పడిన మొదటి రాజకీయ సంస్థ. 1930–46 వరకు 13 ఆంధ్రమహాసభ సమావేశాలు జరిగాయి. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కృషితో మహిళా ఆంధ్రసభలు నిర్వహించారు.
జోగిపేట (1930, మార్చి): ఈ సభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో రాజకీయ విషయాలు చర్చించలేదు. బాల్య వివాహాలను నిరోధించాలి, వితంతు వివాహాలను ప్రోత్సహించాలి, గస్తీ నిషాన్ – 53ను రద్దు చేయాలని తీర్మానించారు
.
దేవరకొండ సమావేశం(1931 మార్చి) : ఈ సభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించాడు. మాదరి భాగ్యరెడ్డి వర్మ, గూడవల్లి రామబ్రహ్మం హాజరయ్యారు. బాల్య వివాహాలను నిరోధించాలి, వితంతు వివాహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని తీర్మానించారు. రావి నారాయణరెడ్డి, రెడ్డి వసతిగృహం విద్యార్థులు కలిసి నిజాం కళాశాల నుంచి కాలినడకన సభకు హాజరయ్యారు.
ఖమ్మం (1934, మార్చి): ఈ సభకు పులిజాల వెంకట రామారావు అధ్యక్షత వహించారు. దేవాదాసీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలని ఈ సభలో నిర్ణయం తీసుకున్నారు.
సిరిసిల్ల(1935, మార్చి): ఈ సభకు తెలంగాణ వైతాళిక పితామహుడు మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహించాడు. ఈ సభ నిర్వహణ కోసం వేములవాడ భీమకవి నగర్‌ను నిర్మించారు. తెలుగు భాష మాత్రమే ఉపయోగించాలని తీర్మానించడంతోపాటు స్వపరిపాలన డిమాండ్‌ను ఆమోదించారు.
షాద్‌నగర్(1936): ఈ సభకు కేవీ రంగారెడ్డి అధ్యక్షత వహించాడు. రైతుల సమస్యలపై చర్చించారు.
నిజామాబాద్(1937): ఈ సభకు అధ్యక్షుడు మందముల నర్సింగరావు. తెలుగు మాట్లాడే వారి అభివృద్ధి కోసమే కాకుండా నిజాం రాష్ట్రాంధ్ర ప్రాంతంలో నివసించే ప్రజలందరి అభివృద్ధి కోసం ఆంధ్రమహాసభ పాటుపడాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ రాజ్యంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అరముదం అయ్యంగార్ కమిటీకి నివేదిక సమర్పించాలని తీర్మానించారు.
మల్కాపురం(1940): ఈ సభకు మందముల రామచంద్రరావు అధ్యక్షత వహించారు. రాజకీయ సంస్కరణల కోసం వచ్చిన అయ్యంగార్ కమిటీ నివేదికపై సభలో చర్చించి ఖండించారు.
చిలుకూరు(1941): ఈ సభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. సభ్యత్వ రుసుమును రూపాయి నుంచి 4 అణాలకు తగ్గించారు. ఆంధ్రమహాసభల్లో తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషలను కూడా ఉపయోగించాలని తీర్మానించారు. ప్రజలను చైతన్యపరచడానికి విద్యావారం, రాజకీయ ఖైదీలవారం, వెట్టిచాకిరీపై ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సమావేశంలో మొదటిసారిగా ఆంధ్రమహాసభ వామపక్షాల చేతిలోకి వెళ్లింది.
ధర్మారం(1942): ఈ సభకు అధ్యక్షుడు మాదిరాజు రామకోటేశ్వరరావు. ఆంధ్రమహాసభ కోసం జమలాపురం కేశవరావు, అతని శిష్యులు వెంకటపతి, నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ప్రచారం చేసి విజయవంతం చేశారు. ఈ మహాసభలోనే హైదరాబాద్: మన కర్తవ్యం అనే గ్రంథాన్ని తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్(1943): మొదటిసారిగా ఆంధ్రమహాసభ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరిగాయి. ఇందులో బద్దం ఎల్లారెడ్డిపై కొండా వెంకట రంగారెడ్డి గెలిచారు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదని కేవీ రంగారెడ్డి పేర్కొన్నాడు. దీంతో కార్యకర్తల స్థాయిలో కూడా స్పష్టమైన విభజన ఏర్పడింది.
భువనగిరి(1944): ఈ సభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించాడు. ఇందులోనే ఆంధ్రమహాసభ అధికారికంగా అతివాదులు, మితవాదులుగా విడిపోయింది. వెట్టి చాకిరీ రద్దు చేయాలి, సభలు, సమావేశాలపై నిషేధం తొలగించాలి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం తొలగించాలని తీర్మానించారు. ఈ సమావేశం నుంచి కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి, మందమల నరసింగరావు వాకౌట్ చేశారు.
మణికొండ(1945): ఇది మితవాదుల సభ. ఈ సభకు మందముల నర్సింగరావు అధ్యక్షత వహించాడు. సభ్యత్వ రుసుమను అణా నుంచి రూపాయికి పెంచారు. 100 మందిలో 10 మందికైనా ఓటు హక్కు కల్పించాలి.
ఖమ్మం(1945): ఇది అతివాదుల సభ. ఈ సభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించాడు. ఇందులో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. వెట్టి చాకిరీని రద్దు చేయాలి, ప్రజారాజ్యాన్ని స్థాపించాలి, 1/4 వ వంతు కంటే తక్కువ పంట పండితే లెవీ నుంచి మినహాయించాలని తీర్మానించారు.
కంది(1946): ఇది మితవాదుల సభ. ఈ సభకు తెలంగాణ సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షత వహించారు.
కరీంనగర్(1946): ఇది అతివాదుల సభ. ఈ సభకు బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షత వహించాడు. ఇవి ఆంధ్రమహాసభ చివరి సభలు. మితవాదులు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, అతివాదులు కమ్యూనిస్టు పార్టీలో చేరిపోయారు.