
భారతదేశంలో చట్టపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం కోసం, చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పులను సూచించడం కోసం భారతీయ లా కమిషన్ను ఏర్పాటు చేశారు. 1833 చార్టర్ చట్టాన్ని అనుసరించి 1834లో మొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం మొత్తం నాలుగు లా కమిషన్లను ఏర్పాటు చేశారు. మొదటి లా కమిషన్ చైర్మన్ గా పనిచేసిన లార్డ్ మెకాలే భారతదేశ చట్టాలను క్రోడీకరించడంలో కీలక పాత్ర పోషించారు. 1859లో ప్రవేశపెట్టిన సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో ప్రవేశపెట్టిన భారత శిక్షాస్మృతి, 1861లో ప్రవేశపెట్టిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు లా కమిషన్ కృషి వల్లనే ఏర్పాటయ్యాయి. ఈ చట్టాలు నేటికీ అనేక సంస్కరణలను తనలో ఇముడ్చుకోవడం ద్వారా మారుతున్న అవసరాలను బట్టి మార్పులు తీసుకురావడంలో లా కమిషన్ కృషి కీలకమైంది. స్వాతంత్ర్యానంతరం 1955లో మొదటిసారిగా మన దేశంలో లా కమిషన్ ఏర్పాటు చేశారు.
స్వాతంత్ర్య భారతదేశంలో మొదటి లా కమిషన్ చైర్మన్ ఎం.సి.సెతల్వార్, కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సలహా సంస్థగా పనిచేసి లా కమిషన్ కార్యనిర్వాహకపరమైన విధులను సైతం నిర్వర్తిస్తుంది. సుపరిపాలన అందించడానికి, సామాజిక న్యాయాన్ని అందించడానికి, సమన్యాయ పాలనను పెంపొందిచడానికి న్యాయ కమిషన్ కృషి చేస్తుంది.
స్వాతంత్ర్యానికి పూర్వం
స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పాటైన లా కమిషన్ల కృషి వల్ల భారతదేశంలో ప్రవేశ పెట్టిన ముఖ్యమైన చట్టాలు.. 1865 వారసత్వ చట్టం, 1881లో ప్రవేశపెట్టిన నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్, డ్రాఫ్ట్ ఆఫ్ఎవిడెన్స్ లా యాక్ట్ 1872, ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్–1870, ఎండోమెంట్ చట్టం–1863, ఇండియన్ కంపెనీ చట్టం–1860, ట్రస్టీ చట్టం–1860, భూసేకరణ చట్టం–1870, హిందూ వీలునామా చట్టం–1870, విడాకుల చట్టం–1860.
స్వాతంత్ర్యానంతరం లా కమిషన్ల ఏర్పాటు
బ్రిటీష్ ప్రభుత్వ పాలనా కాలంలో కొనసాగించిన చట్టాల సంస్కరణ సంప్రదాయాన్ని స్వాతంత్ర్య అనంతరం కూడా మన దేశంలో కొనసాగించాం. భారతదేశ చట్టాలను మారుతున్న దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సామాజిక మార్పులకు అనుగుణంగా చట్టాలను క్రోడీకరించడంలో లా కమిషన్ చేసి కృషి అద్వితీయం.
లా కమిషన్ నిర్మాణం
చైర్మన్
ఇద్దరు పార్ట్ టైం సభ్యులు
ఒక శాశ్వత సభ్యుడు
ఇద్దరు ఎక్స్అఫీషియో సభ్యులు
ఒక మెంబర్ సెక్రటరీ
కేంద్ర ప్రభుత్వం నియమించే లా కమిషన్ న్యాయరంగంలో నిపుణులైన సభ్యులతో ఏర్పాటు చేస్తారు. కమిషన్ సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలు. ఇప్పటివరకు మన దేశంలో 23 లా కమిషన్లు ఏర్పడి పనిచేశాయి.
23వ లా కమిషన్
భారతదేశ 23వ లా కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియమితులయ్యారు. 2024, సెప్టెంబర్ 3న 23వ లా కమిషన్ ను మూడేండ్ల కాలపరిమితితో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ దినేశ్ మహేశ్వరి, కమిషన్ పూర్తిస్థాయి సభ్యులుగా హితేశ్ జైన్(న్యాయవాది), ప్రొఫెసర్ డి.పి.వర్మ(లా ప్రొఫెసర్, బెనారస్ హిందూ యూనిర్సిటీ) బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్ పదవీకాలం 2027, ఆగస్టు 31 వరకు కొనసాగనున్నది. నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలుపర్చవచ్చో లేదో 23వ లా కమిషన్ పరిశీలించనున్నది. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ మహేశ్వరి 2023, మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 2004, సెప్టెంబర్లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014, జులైలో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2016, ఫిబ్రవరిలో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2018, ఫిబ్రవరి నెలలో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2019, జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.