
రాజ్యాంగంలోని ఆర్టికల్ లేదా రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసే సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు. కానీ, పార్లమెంట్ చట్టం ద్వారా లేదా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఏర్పాటు చేసే సంస్థలను చట్టబద్ధ సంస్థలు అంటారు. ఈ సంస్థలకు జాతీయ స్థాయిలో చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమించడంతోపాటు తొలగించే అధికారం కూడా కలిగి ఉంటారు. అలాగే రాష్ట్రస్థాయి సంస్థలకు చైర్మన్, సభ్యులను నియమించే, తొలగించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన చట్టబద్ధ సంస్థల గురించి తెలుసుకుందాం.
జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993, అక్టోబర్ 12న మానవ హక్కుల పరిరక్షణ చట్టం – 1993 ద్వారా ఏర్పాటైంది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన చట్టబద్ధ సంస్థ. ఈ చట్టం 2006, 2016లో సవరించారు. 1991, అక్టోబర్‌లో పారిస్‌లో మొదటి అంతర్జాతీయ వర్క్‌షాప్ మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి జరిగింది. ఇందులో భాగంగా పారిస్ సూత్రాలు రూపొందించబడ్డాయి. వీటిని 1993, డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రభావం భారత్‌లోని మానవ హక్కుల కమిషన్‌పై ఉంది.
చైర్మన్: మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి.
పూర్తికాల సభ్యులు: ఐదుగురు పూర్తికాల సభ్యులుంటారు. వీరిలో ఒకరు సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా మాజీ న్యాయమూర్తి అయి ఉండాలి. లేక మరొకరు ఏదైనా హైకోర్టు సిట్టింగ్ లేక మాజీ ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి. మిగిలిన ముగ్గురు సభ్యులు మానవ హక్కులకు సంబంధించిన విశిష్ట పరిజ్ఞానం కలవారై ఉండాలి. సభ్యులలో ఒకరు తప్పనిసరిగా మహిళ ఉండాలి.
ఎక్స్ అఫీషియో సభ్యులు: జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్పర్సన్లు, దివ్యాంగుల చీఫ్ కమిషనర్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.
సభ్యుల నియామకం: రాష్ట్రపతి ఒక హైపవర్ కమిటీని నియమించి, వారి సలహాతో కమిషన్ సభ్యులను నియమిస్తారు. ఈ హైపవర్ కమిటీకి ప్రధాన మంత్రి అధ్యక్షుడిగా, ఐదుగురు సభ్యులు ఉంటారు. హైపవర్ కమిటీ అధ్యక్షుడు లేదా చైర్మన్ ప్రధాన మంత్రి. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర హోంమంత్రి సభ్యులుగా ఉంటారు.
కాలపరిమితి: రాష్ట్రపతికి రాజీనామా సమర్పించవచ్చు. లేదా రాష్ట్రపతి తొలగించవచ్చు. కమిషన్ చైర్మన్, సభ్యుల కాల పరిమితి మూడేండ్లు లేదా 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
కమిషన్ విధులు: రాజ్యాంగంలోని మానవ హక్కులకు సబంధించిన నిబంధనలు అమలు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ఫిర్యాదుల ఆధారంగా కానీ లేదా సుమొటోగా గానీ స్వీకరించి అమలు చేయడం, కారాగారాలను సందర్శించి ఖైదీల హక్కుల పరిరక్షణకు సబంధించిన సూచనలు చేయడం, మానవ హక్కుల అమలులో ఆటంకాలు ఉంటే సమీక్షించి పరిష్కార మార్గాలను సూచించడం కమిషన్ విధులు. మానవ హక్కుల కమిషన్ సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. కమిషన్ చైర్మన్, సభ్యులు పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం చేపట్టరాదు.
జాతీయ మహిళా కమిషన్: జాతీయ మహిళా కమిషన్ చట్టం–1990 ఆధారంగా 1992లో జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైంది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ కమిషన్‌లో ఒక చైర్పర్సన్, ఒక మెంబర్ సెక్రటరీ, ఐదుగురు సభ్యులు ఉంటారు. సభ్యులు న్యాయశాస్త్రంలో, పారిశ్రామిక రంగంలో, స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో విద్య, వైద్య రంగంలో నిష్ణాతులై ఉండాలి. ఈ ఐదుగురు సభ్యులలో ఒకరు ఎస్సీ, మరొకరు ఎస్టీ అయి ఉండాలి. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. తొలగిస్తుంది. చైర్మన్, సభ్యులు కాలపరిమితి మూడు సంవత్సరాలు.
కమిషన్ విధులు: రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా మహిళలకు గల రక్షణలను సమర్థవంతంగా అమలు చేయడానికి సూచనలు చేయడం.
- మహిళల హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను విచారించడం.
- మహిళా సమస్యలు, అఘాయిత్యాలపై తనంతట తానుగా కేసులను స్వీకరించి పరిష్కరించడం.
- జైళ్లు, ఇతర నిర్బంధ గృహాలను తనిఖీ చేయడం, మహిళా ఖైదీల హక్కుల పరిరక్షణకు సూచనలు చేయడం.
- ప్రభుత్వానికి మహిళలు అనుభవించే సాధకబాధకాల గురించి నివేదికను సమర్పించడం.
- సమన్లు జారీ చేయడం, ఆధారాలను, అఫిడవిట్లను స్వీకరించడం.
- కమిషన్ సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది..
రాష్ట్ర మైనార్టీ కమిషన్: 1998లో రాష్ట్ర శాసనసభ చట్టం ఆధారంగా మైనార్టీ కమిషన్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, ఆరుగురు సభ్యులు(ఒకరు తప్పనిసరిగా మహిళ ఉండాలి) ఉంటారు. వీరి నియామకం, తొలగింపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. వీరి కాల పరిమితి మూడేండ్లు. ఈ కమిషన్ విధులు రాష్ట్రస్థాయిలో జాతీయ కమిషన్‌ను పోలి ఉంటాయి. సివిల్ కోర్టుకు గల అధికారాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారీ.
రాష్ట్ర బీసీ కమిషన్: 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది 1994 నుంచి అమలులోకి వచ్చింది. ఇది ఒక చట్టపరమైన సంస్థ. ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. వీరి కాలపరిమితి మూడేండ్లు. చైర్మన్, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.
తొలగిస్తుంది. రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చాల్సిన కులాలను, మినహాయించాల్సిన కులాలను సూచించడం, రాష్ట్రంలోని బీసీ కులాల స్థితిగతులను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వడం కమిషన్ విధులు. ప్రస్తుతం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్: 2003లో రూపొందించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చట్టం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటైంది. అంటే ఇది చట్టబద్ధమైన సంస్థ. ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు వరకు సభ్యులు ఉంటారు. ఈ ఐదుగురిలో ఒక మహిళా సభ్యురాలు ఉండాలి. పదవీ కాలం మూడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వయస్సు పూర్తయ్యే వరకు. ఎస్సీ, ఎస్టీల స్థితిగతులను మెరుగుపరచడానికి సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ తన నివేదికను సమర్పిస్తుంది.
కమిషన్ సభ్యులు రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. షెడ్యూల్ తెగలకు నిర్దేశించిన రక్షణల అమలు తీరును అధ్యయనం చేయడం, షెడ్యూల్ తెగలపై జరిగే అక్రమాలను విచారించడం, కొన్ని సందర్భాల్లో ఫిర్యాదులు లేకుండా సుమొటోగా కేసులను విచారించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నరోత్తం.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మానవ హక్కుల కమిషన్ 1993లో ఏర్పాటైంది. ఇందులో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. చైర్మన్‌గా నియామకమయ్యే వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా జడ్జిగా పనిచేసి ఉండాలి. ఒక సభ్యుడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి లేదా ఏడేండ్ల అనుభవం గల జిల్లా జడ్జి. మరో సభ్యుడు మానవ హక్కులకు సంబంధించిన విశిష్ట పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ సూచనను అనుసరించి గవర్నర్ నియమిస్తారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం సభ్యులను ఎంపిక చేయడానికి ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీలో అధ్యక్షుడు (ముఖ్యమంత్రి), సభ్యులుగా శాసనసభ స్పీకర్, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి ఉంటారు. చైర్మన్, సభ్యులు తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలి. కానీ, వీరిని రాష్ట్రపతిచే తొలగించబడుతారు.
చైర్మన్, సభ్యుల కాలపరిమితి మూడు లేదా 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. తన విచారణ తర్వాత నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తుంది. కలెక్టర్ కార్యాలయం జిల్లాలో మానవహక్కుల కోర్టుగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 25 రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో కలిపి) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య.
రాష్ట్ర మహిళా కమిషన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ 1998లో మహిళా కమిషన్ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం అదే సంవత్సరంలో మహిళా కమిషన్ ఏర్పాటైంది. ఇందులో ఒక చైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఒక్కొక్కరు ఉండాలి. వీరి పదవీకాలం ఐదేండ్లు. నియామకం, తొలగింపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కమిషన్ విధులు రాష్ట్రస్థాయిలో జాతీయ కమిషన్‌ను పోలి ఉంటాయి. సివిల్ కోర్టుకు గల అధికారాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి.