నల్లసూర్యుల పెన్షన్ కష్టాలు తీరేదెన్నడు?

తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బంగారాన్ని బయటకు తీస్తున్న బొగ్గు గని కార్మికుల పెన్షన్ కష్టాలు తీరడం లేదు. 30 – 40 ఏళ్లు బొగ్గు బాయిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెన్షన్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు జీతంలో 50 శాతం పెన్షన్ వస్తే, బొగ్గు గని కార్మికులకు 25 శాతమే వస్తోంది. కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా 1998 నుంచి బొగ్గు గని కార్మికులకు ఈ మాత్రం పెన్షన్ వస్తోంది. కేంద్ర కార్మిక, బొగ్గు మంత్రిత్వ శాఖ పెన్షన్‌‌ను కనీసం రూ.1000 చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంకా అమలవుతున్న పాపాన పోలేదు.1998 నుంచి 2007 మధ్య ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు రూ.500 నుంచి రూ.2 వేలలోపు మాత్రమే పెన్షన్ అందుతోంది. ఇక 2008 తర్వాత రిటైర్ అయిన వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్ వస్తోంది. 2010 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారిలో రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు కూడా పెన్షన్ తీసుకుంటున్న వాళ్లున్నారు. అయితే  పెన్షన్లను పెంచుతూ ఏ ఒక్క ప్రభుత్వమూ ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో 2007 లోపు రిటైర్ అయినవాళ్లకు ఇప్పటికీ రూ.500 నుంచి 2 వేల లోపు మాత్రమే పెన్షన్ అందుతోంది. ఇలా అతి తక్కువ పెన్షన్ లభిస్తున్న రిటైర్డ్ కార్మికులు, వారి భార్యలు 65 వేల మంది వరకు ఉంటారు. రూ.500 నుంచి రూ.1000 వరకు పెన్షన్ పొందుతున్న వారు దేశవ్యాప్తంగా 79,714 మంది ఉన్నారు. రూ.వేయి నుంచి రూ.1600 వరకు పెన్షన్ పొందుతున్న వారు 67,958 మంది ఉన్నారు. రూ.1500 నుంచి రూ.2,200 వరకు పెన్షన్ పొందుతున్న వారు 48 వేల మంది ఉన్నారు. రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ పొందుతున్న వారు 1,01,700 మంది ఉన్నారు. రూ.5 వేల నుంచి రూ.11 వేల పెన్షన్ పొందుతున్న వారు 65 వేల మంది ఉన్నారు. పదో వేతన ఒప్పందం కూడా జరిగినప్పటికీ పెన్షన్ మాత్రం పాత వారికి పెరగలేదు.

ప్రభుత్వ శాఖల్లో ఏటా పెంపు

ప్రభుత్వ శాఖల్లో 50 శాతం పెన్షన్ ఇవ్వడమే కాకుండా ప్రతీ సంవత్సరం పెన్షన్లలో ఎంతోకొంత పెరుగుదల ఉంటోంది. బొగ్గు గనిలో పని చేసి రిటైర్ అయిన కార్మికులకు మాత్రం ఆ సౌకర్యం లేదు. బొగ్గుగని కార్మికుల బేసిక్ శాలరీ, డీఏ కలిపి 40 శాతం పెన్షన్ ఇవ్వాలని జాతీయ కార్మిక సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాయి. దేశంలోని 11 రాష్ట్రాల్లో బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి.

కేసీఆర్ హామీపై ఎదురుచూపులు

పెన్షన్ తక్కువగా ఉన్న కార్మికులకు ప్రభుత్వం నుంచి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. దాని ప్రకారం కనీసం రూ.2 వేల వృద్ధాప్య పెన్షన్ కింద కార్మికులకు లభించే అవకాశం ఉంది. కానీ ఇది సంపూర్ణంగా ఎక్కడా కూడా అమలు కావడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అతి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న బొగ్గుగని కార్మికులు కోరుతున్నారు.

కనీస పెన్షన్ రూ.10 వేలు చేయాలి

బొగ్గు సంస్థల్లో ప్రతీ ఒక్కరికీ కనీస పెన్షన్  రూ.10 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  ప్రతీ టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.20 నుంచి 30 వరకు పెన్షన్ నిధికి జమ చేస్తే నిధికి లోటు సమస్య కూడా పూడ్చవచ్చని సంఘాలు అంటున్నాయి. బొగ్గు పరిశ్రమల నుంచి టన్ను బొగ్గు ఉత్పత్తికి స్వచ్ఛత పన్ను పేరిట రూ.400 చొప్పున బొగ్గు సంస్థలు చెల్లిస్తున్నాయి. ఇందులో నుంచి కొంత పెన్షన్ నిధికి జమచేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పెన్షన్ నిధి పెంచాల్సిన బాధ్యత కేంద్రానిదే

ఇప్పటికే కార్మికులు పెన్షన్ కోసం తమ వాటాను కార్మికులు 1 శాతం చెల్లిస్తుండగా, యాజమాన్యం మరో 7 శాతం జమ చేసి పెన్షన్ నిధికి చెల్లిస్తోంది. పెన్షన్ నిధిలోటుకు కారణాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం బొగ్గు సంస్థల్లో సింగరేణి సహా పనిచేస్తున్న కార్మికుల సంఖ్య కన్నా రిటైర్ అయిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. మొత్తం మూడున్నర లక్షల మంది దేశవ్యాప్తంగా బొగ్గు సంస్థల్లో పనిచేస్తుంటే సుమారు 5 లక్షల మంది రిటైర్డ్ కార్మికులు పెన్షన్ తీసుకుంటున్నారు. పెన్షన్ నిధిని పెంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అలాగే ఎంతో రిస్క్ తీసుకొని పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు కనీస పెన్షన్ రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కార్మిక సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన కనీస పెన్షన్ రూ.1000 అయినా అందేలా చేస్తే  దానికన్నా తక్కువ తీసుకుంటున్న రిటైర్డ్ కార్మికులకు కొంత మేలు జరుగుతుంది.

2007కు ముందు రిటైరైన కార్మికుల పరిస్థితి అంతే!

వేతనాలు పెరుగుతున్న కొద్దీ వేతన ఒప్పందాలలో జీతాన్ని బట్టి 2007 తర్వాత రిటైర్డ్ అయిన కార్మికులకు పెన్షన్ పెరుగుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ రూ.1000 ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వల్ల సుమారు 82 వేల మంది రిటైర్డ్ కార్మికులకు కొంత ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఇంత వరకు దీని అమలుపై ఎలాంటి కదలిక లేదు. 2007కు ముందు రిటైర్డ్ అయి అరకొర పెన్షన్ పొందుతున్న వారికి ఏమాత్రం పెరుగుదల కనిపించింది లేదు. బొగ్గు సంస్థలో ఉద్యోగ విరమణ చేస్తున్న కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా వచ్చే మొత్తం అంతా అప్పులు కట్టుకోవడానికో, బిడ్డల పెళ్లిళ్లకో, ఇండ్లు కట్టుకోవడానికి ఇంత జాగా కొనుక్కోవడానికో ఆవిరైపోతోంది.

– ఎండీ. మునీర్, సీనియర్‌‌ జర్నలిస్ట్‌‌, సెల్: 9951865223

For More News..

న్యూజిలాండ్ మంత్రిగా మన దేశ మహిళ

‘బాబ్రీ తీర్పు చెప్పిన జడ్జికి నో సెక్యూరిటీ’

మూడేళ్ల పాప మూడు రోజులుగా శిథిలాల కిందే..