ఎస్‌‌ఎల్‌‌బీసీని ఇంకెన్నడు పూర్తి చేస్తరు?

లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును అనుకున్న టైమ్​కు పూర్తి చేసిన సర్కారు.. 2005లో ప్రారంభించిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌‌ఎల్‌‌బీసీ) ప్రాజెక్టును మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. 20 ఏండ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాంటి ఎత్తిపోతలు, కరెంట్​అవసరం లేకున్నా.. ఎస్​ఎల్​బీసీతో దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నా.. సర్కారు దాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం లేదు. 

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి టన్నెల్‌‌ ద్వారా నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌‌ఎల్‌‌బీసీ) ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. నల్గొండ జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, 500 గ్రామాలకు పైగా తాగునీరు ఇచ్చే ఉద్దేశంతో రూ.1,925 కోట్ల అంచనా వ్యయంతో 2005లో వైఎస్‌‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి.15 ఏండ్లలో సుమారు రూ.2,500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయగా, పెరిగిన ధరల ప్రకారం అంచనా వ్యయం సుమారు రూ.4 వేల కోట్లకు చేరింది. గత మూడేండ్లుగా కలిపి బడ్జెట్‌‌లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.10 కోట్లే కేటాయించింది. ఇవి నిర్వహణకే సరిపోయాయని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

వరద జలాల సముద్రం పాలు..

ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌‌నగర్ ప్రజల వెనుకబాటు దృష్ట్యా ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అంచ‌‌నా వ్యయం రెండింత‌‌లైంది. కానీ ప‌‌నులు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు సరిగా లేకపోవడంతో సొరంగం ప‌‌నులు పూర్తి చేయ‌‌డంలో కాంట్రాక్టు కంపెనీ వేగం పెంచడం లేదు. ఈ ఏడాది కష్ణానదికి రికార్డు స్థాయిలో వచ్చిన వరదలతో ప్రాజెక్టులు నిండి పోయాయి. దాదాపు తొమ్మిది వందల టీఎంసీలకుపైగా వరద జలాలు సముద్రం పాలయ్యాయి. వరదలు వచ్చిన సమయంలో నీటిని సద్వినియోగం చేసుకోకపోవడం బాధాకరం. 2021లో కష్ణానదికి వరద ఆగస్టులోనే ప్రారంభమైంది. ఆగస్టు10 నుంచి అక్టోబర్‌‌ 31 వరకు వరద ప్రవాహం కొనసాగింది. అలాంటి సమయంలో కృష్ణానది మీద తెలంగాణ ప్రాంతంలో ప్రారంభించిన ఎత్తిపోతల పథకాలు, సొరంగ మార్గాలు, ప్రాజెక్టులు పూర్తయితే ఎంతో ఉపయోగం ఉండేది. 

చిత్తశుద్ధి, సంకల్పంతోనే..

ప్రభుత్వం ఇప్పటికైనా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నీటి పథకాలను నిర్లక్ష్యం చేయకూడదు. మిగిలిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేస్తే భవిష్యత్తులో కృష్ణా నదీ జలాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల వరద జలాలను వినియోగించుకునే చాన్స్​ఉంది. ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకుంటోంది. రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లను వరద జలాలతో నింపుకుంది. సర్కారు నిర్లక్ష్యంతో తెలంగాణకు అటువంటి అవకాశం లేకుండా పోయింది. తక్కువ మొత్తంలో నిధులు వెచ్చించడం ద్వారా కృష్ణా నదిపై ఉన్న నీటి పథకాల ద్వారా ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 2010 నాటికి పూర్తి కావాల్సిన ఎస్‌‌ఎల్‌‌బీసీ ప్రాజెక్టు నేటికీ నిధుల లేమితో పెండింగ్‌‌లో పడిపోయింది. నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టును అప్పట్లో తొమ్మిది సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం బాధాకరం. లక్షకోట్ల భారీ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసిన ప్రభుత్వం అదే చిత్తశుద్ధి, సంకల్పంతో కృష్ణా నదిపై ఉన్న నీటి పథకాలను పూర్తి చేయాలి. వృథాగా సముద్రంలో కలిసిపోయే వందల టీఎంసీల జలాలను ఒడిసి పట్టి పంట పొలాలకు మళ్లించాలి.

నిలిచిన సొరంగం పనులు

కృష్ణానది జలాలతో కరువు కాటకాలకు అలవాలమైన నల్గొండ జిల్లాతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల బీడు భూములు సస్యశ్యామలంగా మారేవి. 2005లో ప్రారంభించిన 43 కిలోమీటర్ల ఎస్‌‌ఎల్‌‌బీసీ సొరంగ మార్గం పనులు నేటికీ పూర్తి కాలేదు. మరో పది కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. దీంతో దక్షిణ తెలంగాణకు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎస్‌‌ఎల్‌‌బీసీ ఎడమగట్టు సొరంగ మార్గం పూర్తయితే ఎలాంటి విద్యుత్​ ఖర్చు, ఎత్తిపోతల ప్రయాస లేకుండానే గ్రావిటీ ద్వారా పుష్కలమైన నీరు పంట పొలాలకు అందేవి. లక్షల ఎకరాల పంటభూములు పచ్చబడి పంటలు పండేవి. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌‌ కేంద్రంలో సంభవించిన ప్రమాదం వల్ల వందల కోట్ల నష్టంతో పాటు, ప్రతి సంవత్సరం విద్యుత్తు ఉత్పాదన ద్వారా వచ్చే ఆరు వందల కోట్ల ఆదాయాన్ని కూడా నష్టపోవాల్సి వచ్చింది. విద్యుదుత్పాదనకు పనికొచ్చే వరద జలాలు క్రస్ట్‌‌ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. నిరుడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో సంభవించిన ప్రమాదం వల్ల కూడా వరద నీటిని వాడుకునే అవకాశం కోల్పోవాల్సి వచ్చింది. 

‌‌‌‌- జటావత్ హనుము,
రీసెర్చ్ స్కాలర్, ఓయూ