పంట నష్ట పరిహారం ఇంకెప్పుడిస్తరు?

గత శని, ఆది వారాల్లో కురిసిన వర్షం, ఈదురుగాలులు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు మరోసారి విషాదం మిగిల్చినాయి. వేలాది ఎకరాల్లో వరి పంటతో పాటు, మొక్కజొన్న చేన్లు దెబ్బతిన్నాయి. మామిడి తోటల రైతులు, పెసర, నిమ్మ, బత్తాయి సాగుదార్లు తీరని నష్టం చవిచూడాల్సి వచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం, నిర్వహణ లోపం వల్ల కళ్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న తదితర పంటలు నీట మునిగి తడిసిన పంటలు ఎట్లా అమ్ముకోవాలో దిక్కుతోచక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోనే సుమారు 50 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, మహబూబ్​నగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కొమురంభీమ్ జిల్లాల్లో వాన, ఈదురు గాలులతోపాటు వడగళ్ళ వాన మరింత నష్టం కలిగించింది. రాష్ట్రం మొత్తం మీద లక్ష ఎకరాలు మించి రైతులు తమ పంట నష్టపోయినట్లు అంచనా.

మార్చి పంట నష్ట పరిహారమే ఇంకా రాలేదు

గత నెల మార్చిలో  కురిసిన అకాల వర్షాలకు 25 జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టంతో కుదేలైన రైతులకు రాత్రి కురిసిన వర్షం గోరుచుట్టు పై రోకలి పోటు లాంటిదే. మార్చి నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించి ఎకరాకు పది వేల రూపాయలు నష్ట పరిహారం ఇస్తామని, ప్రతి రైతును ఆదుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం 33% మించి పంట నష్ట పోయిన రైతులకే పరిహారం ఇస్తామని ప్రకటించటం, నష్టం జరిగిన భూమి 1.51 లక్షల ఎకరాలకు, లబ్ధిదారుల సంఖ్య 1.30 లక్షలకు కుదించటం కేసీఆర్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తున్నది. పంట ఎంత నష్టపోయినా ఇస్తామన్నరు. ఇపుడేమో 33శాతం పైగా నష్టపోయిన పంటలకు మాత్రమే ఇస్తామనడం సరికాదు. 

పంటల బీమా అమలు చేయాలి

ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన నష్ట పరిహారానికే దిక్కులేక ఎదురుచూస్తున్న రైతులకు ఇప్పటికైనా చేతల ద్వారా ప్రభుత్వం భరోసా కల్పించాలి. అనేక వ్యవసాయ సబ్సిడీలకు ఎగనామం పెట్టిన సర్కారు, కనీసం పంటనష్టపరిహారం కూడా ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి ఉండడం బాధాకరం.  వెంటనే గతంలో ప్రకటించిన పరిహారంతోపాటు, ప్రస్తుతం రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయించి ఎకరాకు తక్షణ సహాయం కింద  పదివేల రూపాయలు తగ్గకుండా వెంటనే రైతుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ వెంటనే గ్రామాల వారీగా సర్వే చేసి నష్టపోయిన రైతులకు ఆ మేరకు సహాయం చేయాలి. రాష్ట్రంలో పంటల భీమా అమలులో ఉండి  ఉన్నట్లయితే రైతులకు ఎంతో కొంత మేలు జరిగేది. రైతు బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం, పంటల బీమా ఎందుకు అమలు చేయడం లేదు? రైతు బతికుండాలంటే ఇవ్వాల్సింది పంటల బీమానే. పంటకు బీమా ఇస్తే రైతు ప్రాణాన్ని కాపాడినట్లే. అందుకే రాష్ట్రంలో వచ్చే వానాకాలం నుంచి పంటల బీమా పథకం అమలు చేయాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
- డా. మరింగంటి యాదగిరా చార్యులు,
వ్యవసాయ రంగ నిపుణులు 

- పెద్దారపు రమేష్,
ఆలిండియా కిసాన్ ఫెడరేషన్ 

- సోమిడి శ్రీనివాస్, 
తెలంగాణ రైతు సంఘం